Tuesday, April 30, 2024

త‌మ్మినేని ఫేక్ స‌ర్టిఫికెట్లు.. రాష్ట్ర‌ప‌తి, సుప్రీంకోర్టుకు కూన ఫిర్యాదు

శ్రీకాకుళం, మార్చి 27 : రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం ఆ పదవికి తీరని కళంకం తెచ్చారని, డిగ్రీ పూర్తి చేయకుండానే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న మహాత్మా గాంధీ లా కళాశాలలో మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సులు ఎలా చేరారని మాజీ విప్, తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు కూన రవికుమార్ ప్రశ్నించారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ… మూడు సంవత్సరాల లా కోర్సులో చేరాలంటే తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేయాలని తెలిపారు. అయితే 2019 మార్చి నెలలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసినప్పుడు తమ్మినేని సీతారాం ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఎఫిడవిట్టులో తాను డిగ్రీ డిస్ కంటిన్యూ అని రాశారని, అయితే అదే సంవత్సరం ఆగస్టులో లా కళాశాలలో ఆయన చేరేందుకు దరఖాస్తు చేశారని రవికుమార్ తెలిపారు.

డిగ్రీ పూర్తి చేయకుండా ఉన్న తమ్మినేని లా కోర్సు చేసేందుకు ఎటువంటి సర్టిఫికెట్లు అందజేశారని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ డిగ్రీ పూర్తి చేసిన సర్టిఫికెట్లు సమర్పించినా అవి నకిలీ సర్టిఫికెట్ లే అని రవికుమార్ తెలిపారు. ఫోర్జరీ సర్టిఫికెట్లతో లా కళాశాలలో చేరిన తమ్మినేని సీతారాం స్పీకర్ పదవిని అగౌరవపరిచారని, అటువంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగే హక్కులేదని తెలిపారు. ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తాను రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, రాష్ట్ర గవర్నర్ కు, హైకోర్టుకు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వ్యవహారంలో శాసనసభ స్పీకర్ ప్రతిష్టను పెంచేలా చేయాలంటే తక్షణమే స్పీకర్ పదవి నుంచి తమ్మినేనిని తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పీఎంజే బాబు, సింతు సుధాకర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement