Tuesday, May 14, 2024

జగన్ పాలనలోనే నిరుద్యోగుల ఆత్మహత్యలు చూస్తున్న: యనమల రామకృష్ణుడు

ఏపీని జగన్ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. ఏప్రిల్ నెలలో రాష్ట్ర ఆర్థిక శాఖ సమర్పించిన సమగ్ర అప్పుల నివేదికను చూసి కేంద్ర అధికారులే విస్తుపోయారని యనమల తెలిపారు. రుణ పరిమితిలో కేంద్ర ప్రభుత్వం భారీ కోతను విధించినప్పటికీ జగన్ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవడం లేదని అన్నారు. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన ఢిల్లీలో అప్పుల కోసం చక్కర్లు కొట్టిన కొన్ని రోజుల్లోనే రుణ పరిమితిలో కేంద్రం కోత పెట్టడం వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని ఎద్దేవా చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై గత ఏడాదే ఎన్కే సింగ్ నేతృత్వంలోని ఎఫ్ఆర్బీఎం రివ్యూ కమిటీ హెచ్చరించిందని… దీనిని జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని యనమల మండిపడ్డారు.

రాష్ట్రాల జీడీపీలో అప్పు నిష్పత్తి 20 శాతం మించితే బ్యాడ్ ఫైనాన్సియల్ మేనేజ్ మెంట్ గా కేంద్రం భావిస్తుందని చెప్పారు. తెలంగాణ అప్పుల నిష్పత్తి 17 శాతం కాగా… ఏపీ పరిస్థితి 31.46 శాతంతో చాలా దారుణంగా ఉందని అన్నారు. అప్పుల భారం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో ఉందని దుయ్యబట్టారు. అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారని… దీని వల్ల రాష్ట్ర ప్రజలపై మరింత పన్నుల భారం పడబోతోందని చెప్పారు.

ఇక జగన్ పాలనలో ఏపీలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో తొలిసారి నిరుద్యోగుల ఆత్మహత్యలను చూస్తున్నామని చెప్పారు. నిరుద్యోగుల ఆత్మహత్యల పాపం జగన్ దేనని అన్నారు. రానున్న రోజుల్లో ఏపీలో ఆర్థిక అసమానతలు మరింతగా పెరగబోతున్నాయని చెప్పారు.

ఇది కూడా చదవండి: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

Advertisement

తాజా వార్తలు

Advertisement