Sunday, May 19, 2024

కొత్త జీవోతో విదేశీ విద్య నిర్వీర్యం.. కనీసం వంద మందికి కూడా పథకం అందదు : పరుచూరి అశోక్‌బాబు

అమరావతి, ఆంధ్రప్రభ: జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో ప్రభుత్వం ఇచ్చిన జీవోనెం. 39లో షరతులు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని, ఆ జీవో అమలైతే ఏడాదికి కనీసం 10 మంది పేద విద్యార్ధులు అర్హులు కారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌ బాబు అన్నారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 100 క్యూఎస్‌ యూనివర్సిటీ-ల్లో ర్యాంకింగ్‌ వస్తేనే మొత్తం ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ అమలవుతుందని, ఇది కష్టసాధ్యమని వివరించారు. మరో షరతు ప్రకారం 101 నుంచి 200 క్యూఎస్‌ యూనివర్సిటీ ల్లో ర్యాంకు వస్తే 50 శాతం లేదా రూ. 50 లక్షలు ఫీజ్‌ రీయింబర్స్‌ చేస్తామని పేర్కొందన్నారు. ఆ యూనివర్సిటీల్లో చదువుకోవాలంటే ఎంతవుతుందో ముఖ్యమంత్రికి తెలుసా అని ప్రశ్నించారు. పాత పథకంలో వైఫల్యాలు ఉన్నాయని షరతులతో కూడుకున్న కొత్త పథకం తెచ్చారని, అయితే ఐఐటీ, ఐఐఎంల్లో సీటు సాధించే విద్యార్ధులకు మాత్రమే వరల్డ్‌ 100 క్యూఎస్‌ యూనివర్సిటీలో సీటు వస్తుందని అభిప్రాయపడ్డారు.

గతంలో క్యాస్ట్‌, ఇన్‌కం లాంటి సర్టిఫికెట్లు కావాలంటే మీ సేవలో3 రోజుల్లో వచ్చేది. కాని నేడు రూ.8 లక్షల ఇన్‌కం సీలింగ్‌ పెట్టి దానికి జిల్లా కలెక్టర్‌ సంతకం కావాలని జీవోలో పేర్కొన్నట్లు అశోక్‌ బాబు వివరించారు. రెవిన్యూ ఆఫీసుల్లో సంతకాలకే ఇబ్బందులు ఎదురవుతాయని, అలాంటిది జిల్లా కలెక్టర్‌ సంతకం కావాలంటే ఎన్ని రోజులు పడుతుందో ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ఎక్కువ మంది విద్యార్ధులను అనర్హులుగా చేయడానికే ఈ జీవో తెచ్చారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో విదేశీ విద్యకు ఎంపికైన విద్యార్ధులకు సంబంధించిన రూ. 120 కోట్లు- ఈ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యను మధ్యలోనే వదిలేసి రావాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 4,900 మందికి అవకాశం కల్పిస్తే.. కొత్త జీఓ ద్వారా 100 మందికి కూడా అవకాశం రాదని ఛాలెంజ్‌ చేశారు. తక్షణమే జీవోను ఉపసంహరించుకోవాలని అశోక్‌ బాబు డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement