Friday, April 26, 2024

కో ‘ఢీ’ పందాలకు అనుమతులు వచ్చేనా..?

నెల్లూరు ప్రభన్యూస్ : జిల్లాలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే సంప్రదాయ కోడి పందాలకు రంగం సిద్దమవుతోంది. సంక్రాంతి కోసం ఏడాది పొడవునా పెంచిన కోళ్లను వాటి యజమానులు సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో జీవహింస పేరుతో వీటికి అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వాలు, కోర్టులు నిరాకరించేవి. కానీ ఈసారి మరో కారణం కనిపిస్తోంది. కరోనా కారణంగా ఈసారి సంక్రాంతి కోడి పందాలకు అనుమతులు లభిస్తాయా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే అనుమతులతో సంబంధం లేకుండానే గ్రామీణ ప్రాంతాల్లో సాగే ఈ పందాలను ఎలాగైనా నిర్వహించి తీరాలని పందెం రాయుళ్లు పట్టుదలగా ఉన్నారు.

కోడి పందాలపై కరోనా ప్రభావం..
ప్రతీ ఏటా సంక్రాంతి కోడి పందాలకు ప్రభుత్వాలు, కోర్టుల నుంచి ఆంక్షలు ఉండేవి. చివరికి కోళ్లకు కత్తులు కట్టకుండా పందాలు నిర్వహించుకోవచ్చని అనుమతులు ఇచ్చేవారు. కానీ ఈసారి కరోనా ప్రభావంతో రాష్ట్రం సతమతమైంది. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలోలా కోడి పందాలకు అనుమతులు ఇస్తారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా జనం ఎక్కువగా టెంట్లలో గుమికూడి నిర్వహించుకునే కోడి పందాలకు అనుమతులు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకూ స్ఫష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో చివరి నిమిషంలో అనుమతులు ఇస్తే ఏర్పాట్ల సంగతేంటని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.కానీ జిల్లాలో కోడి పందేలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement