Monday, April 29, 2024

Big story : తెల్ల బంగారానికి తెగుళ్ళ బెడద.. అన్నదాతల్లో ఆందోళన

అమరావతి, ఆంధ్రప్రభ : గతేడాది పత్తి పంటకు తెగుళ్లు ఆశించి దిగుబడులు తగ్గినా ధరలు ఆశాజనకంగా వుండడంతో రైతులు ఈ ఏడాది పత్తి పంట వైపు మొగ్గు చూపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పంట విస్తీర్ణం పెరిగింది. దీంతో ఈ ఏడాది దిగుబడి, ధరలపై అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే అన్నదాతల ఆశలు అడియాశలు చేస్తూ ఈ ఏడాది సైతం పత్తి పంటపై తెగుళ్లు దాడి చేస్తున్నాయి. పత్తిని సర్వనాశనం చేసే గులాబీ పురుగు వేలాది ఎకరాల్లో వ్యాపించింది. గులాబీతో పాటు పూత రాలిపోవడం, వేరుకుళ్లు వంటివీ పంటను ఆశిస్తున్నాయి. ఇప్పటికే రెండు లక్షల ఎకరాలకుపైన పత్తి పంట తెగుళ్లబారిన పడిందని వ్యవసాయశాఖ వర్గాల సమాచారం. పురుగు వ్యాపించే తీవ్రత తక్కువగానే ఉందని, గుర్తించి రైతులను అప్రమత్తం చేసి నివారణా చర్యలను సూచిస్తున్నామని వెల్లడించింది. కాగా రైతులు మాత్రం తెగుళ్లపై ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ లెక్కల కంటే రెండు మూడు రెట్ల విస్తీర్ణానికి తెగుళ్లు వ్యాపించాయని, పంట నష్టం గణనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లక్ష్యాన్ని మించి పంట విస్తీర్ణం..

గతేడాది ఖరీఫ్‌లో భారీ వర్షాల వలన పత్తి పంట దెబ్బతింది. దిగుబడి తగ్గింది. ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం తరువాత గతేడాదే అతి తక్కువగా ఎకరానికి సగటున 4.7 క్వింటాళ్ల ఉత్పాదకత లభించింది. ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్‌లో కొంత రేటు వచ్చింది. దాంతో ఈ సారి ఖరీఫ్‌లో రైతులు పత్తి వైపు మోగ్గారు. టార్గెట్‌లను, సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించి 16.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అయితే భారీ వర్షాలు, వర్షాభావం, డ్రై-స్పెల్స్‌ కారణంగా ఉత్పాదకత తగ్గుతుందని, ఎకరానికి ఆరు క్వింటాళ్లు లభిస్తాయని అంచనా వేశారు. ఇదిలా ఉండగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన పత్తిపై వివిధ రకాల తెగుళ్లు విరుచుకుపడ్డాయి. గులాబీ తెగులు అత్యంత ప్రమాదకరమైంది. ఆదిలోనే గుర్తించి సస్యరక్షణా చర్యలు చేపట్టి నివారించకపోతే అంతే సంగతులు. పంట చేతికి రాదు. ఈ తెగులు అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. పత్తి పంట సాధారణ అంచనాలను మించి సాగైంది. గతంలో కొన్నేళ్లుగా సాగు చేస్తున్న ఏరియాల్లో నార్మల్‌ కంటే సాగు తగ్గగా, కడప, అనంతపురం వంటి ప్రాంతాలకు బాగా విస్తరించింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో నార్మల్‌ కంటే 9 శాతం ఎక్కువ సాగైంది. ఎపిలో వరి తర్వాత వేరుశనగ విస్తీర్ణం ఎక్కువ కాగా సారి వేరుశనగకు సరిసమానంగా పత్తి సాగైంది. అనంతపురం వంటి చోట్ల వేరుశనగకు బదులు పత్తి వేశారు. ఈ సారి కర్నూలు, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశంలో నార్మల్‌ కంటే ఎక్కువ, గుంటూరు, పల్నాడు, ఎన్‌టిఆర్‌ జిల్లాల్లో కొంచెం తక్కువ సాగైంది.

నకిలీ, కల్తీ, నాసిరకం అనుమతుల్లేని బిటి-3 తో తెగుళ్లు..

ఇదిలావుండగా, అనుమతుల్లేని బిటి-3 తో పాటు నకిలీ, కల్తీ, నాసిరకం విత్తనాల వలన పత్తికి తెగుళ్లు వ్యాపిస్తున్నాయని ఆరోపణలొస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం భారీ వర్షాలు, వర్షాభావం, డ్రై-స్పెల్స్‌ కట్టకట్టుకొని ఒకేసారి రావడం మూలంగా పత్తిపై తెగుళ్లు విరుచుకుపడి పంటను దెబ్బతీస్తున్నాయని, పంట నష్టం, దిగుబడి నష్టం, నాణ్యతాలోపం చోటు చేసుకుంటోందని, రైతులకు నష్టాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. 2014-15, 2015-16 ఖరీఫ్‌లలో గులాబీ తెగులు వలన పత్తికి జరిగిన నష్టం అంతాఇంతా కాదు. బిటి-2 విత్తనాలు కేవలం శనగపచ్చ పురుగును మాత్రమే ఎదుర్కొంటాయి తప్ప గులాబీ వంటి ఇతర తెగుళ్లను కాదు. ఆ అనుభవంతో రైతులు ఒకటి రెండేళ్లపాటు పత్తి జోలికి అంతగా పోలేదు. మళ్లీ రెండేళ్ల నుంచి పత్తి వైపు మళ్లుతున్నారు. పత్తి అధికంగా సాగైన కర్నూలు, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో గులాబీ తెగులు ప్రభావం అధికంగా ఉందని చెబుతున్నారు. ఈ జిల్లాల్లో అన్ని తెగుళ్లూ కలిపి 2.13 లక్షల ఎకరాల్లో వ్యాపించాయని తెలపగా, అత్యధికభాగం గులాబీ తెగులేనని తెలుస్తోంది. పత్తి ఎక్కువగా సాగైన ఎన్‌టిఆర్‌, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో సైతం గులాబీతో పాటు ఇతర తెగుళ్ల ప్రభావం ఉంది.

- Advertisement -

భారీ వర్షాలు, అనావృష్టే కారణం..

భారీవర్షాలు, అనావృష్టే కారణంగా ఈ ఏడాది కూడా పత్తి దిగుబడి అంత ఆశాజనకంగా లేదు. సరిగ్గా పంట ఎదిగే సమయంలో భారీ వర్షాలు కురవడంతో పత్తికి నష్టం జరిగింది. చాలా చోట్ల మొదటి తీత పత్తి ఆగమైంది. అందుకు తోడు ఇటు- భారీ వర్షాలు అటు- వర్షాభావం వలన వేలాది ఎకరాల్లో గులాబీ వంటి తెగుళ్లు వ్యాపించి పంటను నాశనం చేశాయి. ఈ పరిస్థితుల రీత్యా గతేడాదికిమల్లే ఇప్పుడు సైతం పత్తి ఉత్పాదకత గణనీయంగా తగ్గుతుందని అంచనా వేశారు. బిటి రకాలొచ్చాక తమ విత్తనాలు వేస్తే ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి తీయొచ్చని సీడ్‌ కంపెనీలు ఊదరగొడుతున్నాయి. సగటున 10-12 క్వింటాళ్ల దిగుబడి లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కంపెనీలు చెప్పినట్లు 20 క్వింటాళ్లు, శాస్త్రవేత్తల అభిప్రాయం మేరకు 12 క్వింటాళ్లు ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడలేదు. కాగా ఈ ఏట ఆరు క్వింటాళ్ల దిగుబడి రావొచ్చని అర్థగణాంక శాఖ తన మొదటి ముందస్తు అంచనాలో పేర్కొంది. శాస్త్రవేత్తల సగటు గణాంకాల్లోనే సగానికి సగం తగ్గించింది.

ఇదిలా వుండగా, గతేడాది మొదటి ముందస్తు అంచనాలో ఎకరానికి 7.15 క్వింటాళ్లొస్తాయని తెలపగా, చివరికొచ్చింది 4.70 క్వింటాళ్లు మాత్రమే. ఇవి కూడా ప్రభుత్వ సగటు లెక్కలు. వాస్తవానికి చాలా చోట్ల రైతులకు రెండు మూడు క్వింటాళ్లు రావడం గగనమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంచనా వేసిన మేరకు 6 క్వింటాళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఇంకా తగ్గేలా కనిపిస్తోంది. గత సంవత్సరంలో ఖరీఫ్‌లో వర్షాభావం, భారీ వర్షాల వలన పత్తి పంటకు అపార నష్టం వాటిల్లింది. రైతులు ఆర్థికంగా నష్టాలు చవిచూశారు. రాష్ట్ర విభజన తరువాత అతి తక్కువ ఉత్పాదకత గతేడాది నమోదైంది. దిగుబడులు తగ్గడంతో చేతికొచ్చిన కొద్దిపాటి పంటకు గిరాకీ ఏర్పడి వెనకచిక్కి అమ్ముకున్న కొంత మంది రైతులకు, ముందుగానే కొని నిల్వ చేసుకున్న వ్యాపా రులకు ఆకర్షణీయమైన ధర వచ్చింది. దాంతో ఈ మారు ఖరీఫ్‌లో మెట్ట ప్రాంతాల్లోని రైతులు పత్తి తోవ పట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement