Monday, April 29, 2024

ఉద్యోగాలు ఇంకెప్పుడు.. గతేడాది క్యాలెండర్‌ ఇచ్చినా భర్తీ లేదు..

రాష్ట్రంలో నిరుద్యోగుల నిరీక్షణ ఎంతకీ తెగడం లేదు. గ‌త‌ ఏడాది జూన్‌లో విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో ప్రకటించిన ఉద్యోగాల భర్తీ కూడా పూర్తి కాలేదు. దీంతో లక్షల మంది నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. రాష్ట్రంలో జ‌గ‌న్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని, ప్రతి సంవత్సరం డీఎస్సీ వేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్లు కరోనా కారణంగా జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయలేదు. జాబ్‌ క్యాలెండర్‌తో సంబంధం లేకుండా పెద్ద సంఖ్యలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టులు, లక్షలాది వలంటీర్ల నియామకాలు చేపట్టినా.. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ప్రభుత్వోద్యోగాల ఊసు మాత్రం లేదు. ఈ నేపథ్యంలో గ‌త‌ జూన్‌ 18న 10,413 పోస్టులతో క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లను ప్రతి నెలా కొన్ని చొప్పున ఏపీపీఎస్సీ ద్వారా విడుదల చేస్తామన్నారు. అయితే ఆ మేరకు కార్యాచరణలో మాత్రం జరగలేదు.

మళ్లి జూన్‌లోనేనా.?
ప్రకటించిన ప్రకారం గ‌త‌ ఏడాది జూలై నుంచి డిసెంబర్‌ వరకు 7, 867 పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ మేరకు జరగలేదు. మరోవైపు పెండింగ్‌ నోటిఫికేషన్లతో కలిపి వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో 2, 736 పోస్టులకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ అని ప్రకటించినట్లుగా వచ్చే నెలలో అయితే ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు.

నోటిఫికేషన్‌ విడుదలైనా..
గత కొన్ని నెలలుగా వివిధ ప్రభుత్వ శాఖలలోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసింది. వాటిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, అర్హతలు, ఫీజు వివరాలు తదితరాలను పేర్కొన్నారు. అయితే ఆ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేది ప్రకటించలేదు. దీంతో ఆయా పోస్టుల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు టెన్షన్‌ పడుతున్నారు. తాజాగా డిసెంబ‌ర్‌ 28న 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌, గ్రేడ్‌ 3 ఈవో పోస్టులు 60భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇప్పటికైనా అభ్యర్థుల నిరీక్షణకు తెరవేసేలా ప్రభుత్వం ప్రకటిం చాల్సిన అవసరం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement