Friday, May 3, 2024

ధ‌ర‌ల‌కు కేంద్రం క‌ళ్లెం – బియ్యం,గోధుమ‌లు బ‌హిరంగ మార్కెట్ లోకి విడుద‌ల

అమరావతి: ఆంధ్రప్రభ : ఈ ఏడాది అనూహ్యంగా పెరిగిన పప్పుల ధరలను అదుపు చేసిన ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెరిగిన బియ్యం, గోధుమలు, గోధుమ పిండి రి-టైల్‌ ధరలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఓపెన్‌ మార్కెట్‌ సేల్‌ స్కీమ్‌ (ఓఎంఎస్‌ఎస్‌ – డొమెస్టిక్‌) ద్వారా బహిరంగ మార్కెట్‌లో గోధుమలు, బియ్యాన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు 25 లక్షల టన్నుల బియ్యం, గోధుమలను మార్కెట్‌లోకి తెస్తోంది. ప్రస్తుతం ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) వద్ద ఆంధ్రప్రదేశ్‌లో 7.61 లక్షల టన్నుల బియ్యం, 10,703 టన్నుల గోధుమలు ఉన్నాయి. వీటికి అదనంగా సెంట్రల్‌ పూల్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద మరో 8.40 లక్షల టన్నుల బియ్యం ఉన్నాయి. ఓఎంఎస్‌ఎస్‌ (డీ) పథకం కింద ఎఫ్‌సీఐ ప్రతివారం నిర్వహించే ఈ-వేలంలో భాగంగా అమరావతిలోని ఎఫ్‌సీఐ ప్రాంతీయ కార్యాలయంలో ఈ నెల 23న 5 వేల టన్నుల గోధుమలు, 13,200 టన్నుల బియ్యాన్ని మార్కెట్‌లోకి తెస్తున్నారు.

ఈ-వేలంలో పాల్గొనదలిచిన వారు ఈఎండీ మొత్తాన్ని ఎల్రక్టానిక్‌ మోడ్‌ ద్వారా జనరల్‌ మేనేజర్‌, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ప్రాంతీయ కార్యాలయం, అమరావతి పేరిట ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు జమ చేయాలి. ఆసక్తి కలిగిన పిండి మిల్లులు, గోధుమ పిండి ప్రాసెసర్లు, గోధుమ ఉత్పత్తుల తయారీదారులు ఈ-వేలంలో పాల్గొనేందుకు ఎఫ్‌ సీఐ వెబ్‌ సైట్‌ లో వివరాలు తెలుసుకోవచ్చు. వేలంలో గోధుమలు కొన్న వారు 30 రోజులలోపు ప్రాసెస్‌ చేసి రి-టైల్‌ మార్కెట్‌లోకి విడుదల చేయాలి. బియ్యం వేలంలో వ్యాపారులు కూడా పాల్గొనవచ్చు. ఎఫ్‌ఆర్‌కే బియ్యం రిజర్వ్‌ ధర క్వింటాల్‌కు రూ.2,973, ఎఫ్‌ఆర్‌కే కాని బియ్యం రిజర్వ్‌ ధర క్వింటాల్‌కు రూ.2,900గా నిర్ణయించారు. ఆసక్తి గల బిడ్డర్లు, వ్యాపారులు వెబ్‌సైట్‌ ద్వారా వారి వివరాలను సమర్పించి ఈ వేలంలో పాల్గొనవచ్చని ఎఫ్‌సీఐ ఏపీ జనరల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ జోషి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement