Monday, April 29, 2024

ఏపీలో అమలయ్యేది ఐపీసీ సెక్షన్లు కాదు వైసీపీ సెక్షన్లు : భానుప్రకాష్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అన్నపూర్ణగా కీర్తి గడించిన ఆంధ్రప్రదేశ్ మూడేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అప్పుల ప్రదేశ్, అరాచక ప్రదేశ్, అవినీతి ప్రదేశ్‌గా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మరో రెండు సంవత్సరాల్లో రాష్ట్రం ఎక్కడికి వెళుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి పబ్బం గడుపుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతూ కేసులు పెట్టి వేధిస్తున్నారని భానుప్రకాష్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐపీసీ సెక్షన్లు కాకుండా వైసీపీ సెక్షన్లు పని చేస్తున్నాయని మండిపడ్డారు. హత్యలు చేసి మృతదేహాలను హోం డోర్ డెలివరీ చేసే పరిస్థితికి వైసీపీ నాయకులు చేరుకున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న శాంతిభద్రతల పరిస్థితులు చూసి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదని వివరించారు. రామతీర్థంలో శ్రీరామచంద్రుడి విగ్రహ తల నరికివేత, అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన సహా దాదాపు 200 ఆలయాలపై అగంతకులు దాడులు చేసి విగ్రహాలు ధ్వంసం చేశారని భానుప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మూడేళ్ల పాలనలో దేవాలయాలపై ఎన్ని దాడులు జరిగినా ఒక్క కేసూ నమోదు చేయలేదన్నారు. హిందూ వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ టీటీడీ నిధులు దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీటీడీ దేవస్థానాన్ని జగన్ ఆస్థానంగా మార్చి దేవాలయాలు, హిందూమతంపై కక్ష సాధింపు ప్రయత్నాలు చేస్తున్నారని భానుప్రకాష్ చెప్పుకొచ్చారు. నియమనిబంధనలకు విరుద్ధంగా ఆర్ధిక నేరగాళ్లను టీటీడీ బోర్డులో నియమిస్తున్నారని తెలిపారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చే నాటికి 3.5 లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర రుణబారం ఇప్పుడు రూ. 8.5 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్‌లో అత్యాచారాలు పెరిగిపోతుంటే మహిళ అయిన రాష్ట్ర హోంమంత్రి పిల్లల బాధ్యత తల్లులదేనని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని భానుప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందన్న ఆయన, ప్రజల్లో సహనం నశిస్తే శ్రీలంకలోలా తిరగబడతారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఏ క్షణాన ఎన్నికలు వచ్చినా జగన్‌కు బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement