Friday, May 3, 2024

AP: పశ్చిమలో తుఫాన్ బీభత్సం.. నేలమట్టమైన వరి పంట

భీమవరం, ప్రతినిధి: తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు మంగళవారం ఉదయానికి తమ ప్రతాపాన్ని చూపాయి. సోమవారం జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదు కాగా.. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షానికి ఎక్కడికక్కడ వరిచేలు, ధాన్యం రాశులు, రహదారులు, కాలనీలు, జలమయమయ్యాయి. చేతికొచ్చిన వరిపంట రెండు రోజులుగా వర్షానికి తడుస్తూ వరి కంకులు బరువెక్కి వరి మొదలు పట్టు కోల్పోవడంతో వరిచేలు వర్షాలకి ఈదురుగాలులకు నేలమట్టమవుతున్నాయి. పడిపోయిన వారిచేలపైకి వర్షం నీరు చేరడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన గురవుతున్నారు. ఇప్పటికే ఎకరాకి రూ.30,000 వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు పంటను గట్టుకు చేర్చుకునే తరుణంలో కురుస్తున్న వర్షాలతో తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భీమవరం జలమయం..

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం భారీ వర్షాలకు ఎక్కడకక్కడ రహదారులు, కాలనీలు జలమయమవుతున్నాయి. ఆర్టీసీ డిపో, లూథరన్ గ్రౌండ్, బ్యాంకు కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, మెంటే వారి తోట, దుర్గాపురం ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా మార్గాల్లో ప్రయాణించడానికి వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. భీమవరం-తాడేపల్లిగూడెం రహదారిలో గరగపర్రు వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీ వాహనాలు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. పాలకోడేరు, ఆకివీడు, కాళ్ళ, ఉండి, పాలకొల్లు, నరసాపురం, వీరవాసరం మండలాల్లో వరిచేలు వర్షాలకు దెబ్బతింటున్నాయి, ధాన్యం రాశులు అడుగుభాగానికి వర్షం నీరు చేరుతుండటంతో రైతులు నీటిని బయటికి పంపేందుకు చర్యలు చేపట్టారు.

- Advertisement -

వర్షపాతం వివరాలు..

జిల్లాలో మంగళవారం ఉదయానికి 55.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 43.9 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదయింది. మంగళవారం ఉదయం ఆకివీడులో అత్యధిక వర్షపాతం 139.2 మిల్లీమీటర్లు నమోదయింది. కాళ్లలో 135.2 నమోదు కాగా అత్యాల్పంగా తణుకులో మూడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement