Thursday, May 2, 2024

శ్రీవారి ఆలయంలో వారపు సేవలు తాత్కాలికంగా రద్దు.. సామాన్య భక్తులకు ప్రాధాన్యం

తిరుమల, ప్రభన్యూస్‌ : వేసవి సెలవులలో తిరుమలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, సామాన్య భక్తుల సౌకర్యార్థం తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్‌ 30 వరకు అష్టదళ పాదపద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, నిజపాద దర్శనాన్ని తాత్కాలికంగా రద్దు చేశామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాకు తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు వారపు సేవలను రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది. మంగళవారు నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవ, గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవ, శుక్రవారం నిర్వహించే నిజపాద దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

ఇప్పటికే వారాంతంలో విఐపి బ్రేక్‌ దర్శనాలను రద్దు చేయడం, ఇపుడు వారపు సేలను కూడా రద్దు చేయడంతో సామాన్య భక్తులకు అధిక సమయం దర్శనం లభిస్తుందని టిటిడి భావిస్తోంది. మరో వైపు స్వామివారికి నిర్వహించే సేవలను భక్తుల సౌలభ్యం పేరుతో రద్దు చేయడం ఎంత వరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. బ్రేక్‌ దర్శనాలను కొనసాగిస్తూ స్వామివారికి నిర్వహించే సేవలను రద్దు చేయడం ఏంటని టీటీడీపై భక్తులు మండి పడుతున్నారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికే నష్టమని, వెంటనే సిఎం జోక్యం చేసుకుని సేవలను రద్దు చేయకుండా చూడాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement