Sunday, April 28, 2024

Big Story: పక్కదారి పడుతున్న సంపద .. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి.. అన్నీ తప్పుడు రిపోర్టులే!

ఆంధ్రప్రభ , అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ సంపద పెద్ద ఎత్తున పక్కదారి పడుతోంది. ఆ సంపదను కాపాడడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా వ్యవహరించాల్సిన అధికారులు మాఫియాతో చేతులు కలిపి విలువైన సంపదను కొల్లగొడుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా వందల కోట్ల విలువైన సంపద దొడ్డిదారిన తరలిపోతోంది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఖనిజ సంపదకు రాష్ట్రంలో ఢోకా లేదు. గ్రానైట్‌ , కంకర , తెల్లరాయి , ఎర్రమట్టి , గ్రావెల్‌ , ఇసుక , సిలికా , మైకా వంటి విలువైన ఖనిజ సంపద ఆయా ప్రాంతాల్లో పుష్కలంగా అందుబాటులో ఉంది. అయితే ఆయా మైనింగ్‌లకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా కొన్ని అనుమతులు ఇస్తుంది. తద్వారా ప్రభుత్వానికి కొంత ఆదాయం కూడా వస్తుంది. అయితే అవే అనుమతుల ముసుగులో పెద్ద ఎత్తున విలువైన సంపదను దోచుకుంటున్నారు. అక్రమాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినా .. వాటి కళ్లుగప్పి మాఫియా దర్జాగా సంపదను బొక్కేస్తున్నారు. అందుకు ఆయా శాఖల పరిధిలో కొంతమంది అధికారులు మాఫియాకు సహకరిస్తున్నారు. తమ అవినీతి అక్రమాలు వెలుగు చూడకుండా ఉండేందుకు అధికారులు మొక్కుబడి తనిఖీలతో నామ్‌కే వాస్తుగా ఒక్రటెండు కేసులను నమోదు చేసి ప్రభుత్వానికి సైతం తప్పుడు నివేదికలను అందిస్తున్నారు. దీంతో ప్రతిఏటా రాష్ట్రం నుంచి కోట్లాది రూపాయలు విలువైన సంపద పొరుగు దేశాలకు తరలిపోతోంది.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల పరిధిలో విలువైన ఖనిజ సంపద ఉంది. అలాగే కృష్ణా , గోదావరి , పెన్నా నదుల పరిధిలో పెద్ద ఎత్తున ఇసుక క్వారీలు కూడా ఉన్నాయి. ఇసుక అమ్మకాల్లో ప్రభుత్వం కొత్త విధానాలను అనుసరిస్తోంది. ఓ ప్రైవేట్‌ సంస్థకు కాంట్రాక్టు పద్ధతిలో ఇసుక తవ్వకాలను అప్పగించారు. అయినా కొన్ని రేవుల్లో గుట్టుచప్పుడు కాకుండా అక్రమ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూనే ఉన్నారు. అలాగే గ్రానైట్‌ క్వారీల్లో కూడా అడుగడుగునా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్క క్వారీకి అనుమతి తీసుకుని ఇతర ప్రాంతాల్లో కొండరాయిని తరలించి అదే లైసెన్సు పేరుతో రాజమార్గంలోనే రాయిని తరలిస్తున్నారు. ప్రకాశం , నెల్లూరు, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఈ తరహా దొపిడీ అధికంగా సాగుసతోంది. ఇక ఎర్ర మట్టి , గ్రావెల్‌ మాఫియాదైతే చెప్పాల్సిన పనే లేదు. అటవీ భూముల్లో ఇష్టానుసారంగా ఎర్ర మట్టి , గ్రావెల్‌ను అందిన వరకు దోచేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అటవీ అధికారులు గాని , రెవెన్యూ సిబ్బంది కాని అక్రమ తవ్వకాల వైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలపై స్థాని ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా .. సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో మాఫియాదే ఇష్టారాజ్యమైపోతోంది. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతూ స్వంత ఖజానాను నింపుకుంటున్నారు. గ్రానైట్‌ , ఇసుక , ఎర్ర మట్టి , గ్రావెల్‌ , తదితర సంపదను దోచుకోవడం వల్ల రాష్ట్రా ప్రభుత్వానికి ప్రతి ఏటా వందల కోట్ల రూపాయలు నష్టం వాటిళ్లుతోంది. అనుమతులు తీసుకుని అందుకు సంబంధించి వే పర్మిట్లు తీసుకోవడం ద్వారా ప్రతి లోడ్‌కు వంద శా తం ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. అదే సంపద దొడ్డిదారిన తరలించడం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది.


తప్పుడు నివేదికలు..

రాష్ట్రంలో ఆయా శాఖల పరిధిలో ఉన్నతాధికారులతో పాటు ఎస్‌ఈబీ అధికారులు అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. అలాగే అక్రమ తవ్వకాలపైనా ఆకస్మిక దాడులు చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఒక్క వైపే. రెండో వైపు నుంచి చూస్తుంటే అదే వ్యవస్థలోని కొంత మంది అధికారులు మాఫియాతో చేతులు కలిపి సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. వారిచ్చే మామూళ్లకు ఆశపడి ప్రభుత్వ ఆశయానికి గండి కొడుతున్నారు. ఇదే సందర్భంలో నెలవారీ సమీక్షల్లో భాగంగా ఉన్నతాధికారులకు సైతం తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. ఆయా జిల్లాల పరిధిలో తనిఖీలు చేసినట్లు అందులో భాగంగా కేసులు నమోదు చేసినట్లు మొక్కుబడిగా చూపిస్తున్నారు. వాస్తవానికి రెండు కేసులు నమోదు చేస్తే .. అంతకు పదింతలు అక్రమ తవ్వకాలకు, రవాణాకు ప్రత్యేక్షంగానూ , పరోక్షంగానూ సహకారాన్ని అందిస్తున్నారు. ఫలితంగానే మైనింగ్‌లో ప్రభుత్వానికి పెద్దఎత్తున నష్టం వాటిళ్లుతోంది. కేవలం క్షేత్రస్థాయిలో అధికారులు ఇస్తున్న తప్పుడు నివేదికల వల్లే ప్రభుత్వం కూడా ఖనిజ సంపద పదిలంగా ఉందన్న అభిప్రాయానికి వస్తుంది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా దొపిడీ సాగుతోంది.


ప్రత్యేక నిఘా పెడితే ఆర్థిక వ్యవస్థ బలోపేతం..

- Advertisement -

రాష్ట్రంలో అక్రమ తవ్వకాలు, రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆయా శాఖల పరిధిలో ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు కూడా చేపడుతుంటారు. ఇంత బలమైన నిఘా ఉన్న రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుంచి విలువైన సంపద నిత్యం దోపిడీకి గురవుతూనే ఉంది. జిల్లా స్థాయిలో కొంతమంది అధికారులు తమ అవినీతి , అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు మొక్కుబడి తనిఖీలతో మమ అనిపిస్తున్నారు. ఉన్నతాధికారుల నిఘా ఉన్న సమయంలో ఒక్రటెండు కేసులను నమోదు చేసి సిన్సియర్‌గా డ్యూటీ చేస్తున్నట్లు నటిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిళ్లుతోంది. అసలే లోటు బడ్జెట్‌తో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్న ప్రభుత్వం .. అందుబాటులో ఉన్న సంపద నుంచి మరింత ఆదాయాన్ని పొందాలంటే తక్షణమే నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తేనే ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement