Sunday, April 28, 2024

Water Matter’s: ప్రాజెక్టులపై గెజిట్‌ లేట్‌.. ఇంకాస్త టైమ్‌ కావాలన్న ఏపీ, తెలంగాణ

అమరావతి, ఆంధ్రప్రభ: గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై ఏపీ దూకుడుగా ఉంటే తెలంగాణ ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈనెల 30న నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆ తరువాత వెంటనే నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని సమాచారం. ఈనెల 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లోకి వచ్చిందని కృష్ణా, గోదావరి బోర్డులు ఇప్పటికే ప్రకటించాయి.

గెజిట్‌ అమలుకు సంబం ధించి అనిశ్చితి తొలగించేందుకు బోర్డులు కేవలం సాంకేతిక ప్రకటన జారీ చేశాయి. క్షేత్రస్థాయిలో గెజిట్‌ లోని షెడ్యూల్‌ -2లో పొందుపర్చిన ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మూడు నెలల సమయం పట్ట వచ్చని బోర్డులు భావిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర జలశక్తికి బోర్డులు నివేదిక అందించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టుల అప్పగింత ఉత్తర్వులను ఆలస్యం చేసేందుకు ప్రాధాన్యతిస్తోంది.

షరతులతో జారీ చేసిన ఏపీ ఉత్తర్వులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు..సమగ్ర అధ్యయనం తరువాతే ప్రాజెక్టుల అప్పగింతపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు బోర్డులు సేకరించిన సమాచారాన్ని కేంద్ర జలశక్తికి నివేదించినట్టు తెలిసింది. బచావత్‌ ట్రిబ్యునల్‌, బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందున్న వాదనలు..తాజాగా సుప్రీంకోర్టు నుంచి వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్న అనంతరం కొత్త ట్రిబ్యున ల్‌ కోసం డిమాండ్‌ చేయటం, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాల వాడకంపై గతంలో సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సిడబ్ల్యుసి) ముందుంచిన ప్రతిపాదనలు, కృష్ణా జలాల పున:పంపిణీ, కేంద్ర జలశక్తి తాజాగా జారీ చేసిన గెజిట్‌ ముసాయిదా, ఆపరేషన్‌ ప్రోటోకాల్స్‌ను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి తమ రాష్ట్ర సాగు, తాగునీటి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ భావిస్తోంది.

- Advertisement -

ప్రాజెక్టుల అప్పగింతపై కాలయాపన చేయటం, తమ డిమాండ్లు సాధించుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో గెజిట్‌ అమలుకు కృష్ణా, గోదావరి బోర్డులు కట్టు-బడి ఉండాలని ఏపీ డిమాండ్‌ చేస్తోంది. ఏపీ పరిధిలో శ్రీశైలం, నాగార్జున సాగర్‌ కుడిగట్టు- పవర్‌ హౌస్‌ లను అప్పగించేందుకు తాము ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ జెన్‌ కో నిర్వహిస్తున్న పవర్‌ హౌస్‌ లను కూడా కృష్ణా బోర్డు స్వాధీనం చేసుకుని నిర్వహణ ప్రారంభించాలని ఏపీ పట్టు-బడుతోంది.

సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కొంత ఆలస్యమైనా జల విద్యుత్‌ ప్రాజెక్టుల విషయంలో ఆలస్యం చేయటానికి వీల్లేదు..విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను అప్పగించేది లేదని కృష్ణా బోర్డు సమావేశాల్లో తెలంగాణ నీటిపారుదల ఉన్నతిధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల నిర్ణయం కోసం ఎదురుచూడకుండా గెజిట్‌ అమలు కార్యాచరణపై బోర్డు దృష్టి పెట్టాలి..ఈ విషయంలో కేంద్ర జలశక్తి తన విస్తృతాధికారాలు వినియోగించి విద్యుత్‌ ప్రాజెక్టులను బోర్డుల నిర్వహణలోకి తీసుకురావాలి..సిఐఎస్‌ఎఫ్‌ బలగాలతో ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలి..దీనిపై త్వరలోనే కృష్ణా బోర్డు చైర్మన్‌ తో పాటు- కేంద్ర జలశక్తి అధికారులతో భేటీ- కానున్నట్టు- ఏపీ జల వనరుల శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇవీ..బోర్డు పరిధిలో ప్రాజెక్టులు
శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని ఏపీ భూభాగంలో శ్రీశైలం స్పిల్‌ వే, కుడిగట్టు- విద్యుత్‌ కేంద్రం, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, హంద్రీ-నీవా (మాల్యా) ఎత్తిపోతల పంపుహౌస్‌..తెలంగాణ భూ భాగంలో ఎడమగట్టు- విద్యుత్‌ కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల పంపుహౌస్‌ ను బోర్డుకు అప్పగించాల్సి ఉంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని ఏపీ భూ భాగంలో కుడి కాలువ విద్యుత్‌ కేంద్రం, తెలంగాణ భూ భాగంలో నాగార్జునసాగర్‌ స్పిల్‌ వే, కుడికాలువ ప్రధాన రెగ్యులేటర్‌, ఎడమ కాలువ ప్రధాన రెగ్యులేటర్‌, ప్రధాన విద్యుత్‌ కేంద్రం, ఎడమ కాలువ విద్యుత్‌ కేంద్రం, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, హైదరాబాద్‌ తాగునీటి పథకం, నాగార్జున సాగర్‌ వరద కాలువలను బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement