Monday, April 29, 2024

AP: ఐటీ హబ్‌గా విశాఖ.. సీఎం జగన్

విశాఖపట్నం, ఆంధ్ర ప్రభ బ్యూరో : విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌ మోహన్ రెడ్డి అన్నారు. పరవాడ సెజ్‌లో ఫార్మా యూనిట్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. అలాగే బీచ్‌ క్లీనింగ్‌ సమకూర్చిన యంత్రాలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సోమవారం తన విశాఖ పర్యటన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

విశాఖపట్నంలోని రుషికొండలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ… త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది చివర అంటే డిసెంబరు నెలలోపు ఈ మార్పు ఉంటుందని ప్రకటించారు. అంతేకాకుండా హైదరాబాద్‌, బెంగళూరు మాదిరిగా వైజాగ్‌లో అపారమైన అవకాశాలున్నాయన్నారు. వైజాగ్‌ కూడా ఐటీ హబ్‌గా మారుతుందని, ఇప్పటికే విద్యాసంస్థల కేంద్రంగా మారిందన్నారు. ఏటా 15వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం, అంతర్జాతీయ విమానాశ్రయం, పొడవైన తీర ప్రాంతం విశాఖ సొంతమన్నారు. ఇలాంటి సౌకర్యాలన్నీ ఉన్నందునే ప్రముఖ సంస్థలు అనేకంగా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.

త్వరలో విశాఖకు మకాం :
విశాఖకు మకాం మార్చడంపై సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఇవాళ కీలక ప్రకటన చేశారు. డిసెంబర్‌ నాటికి విశాఖకు రాబోతున్నట్లు వెల్లడించారు. పరిపాలనా విభాగమంతా ఇక్కడికే వస్తుందని, ఇక్కడి నుంచి పాలన కొనసాగిస్తానని తెలిపారు. విశాఖలో సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఇవాళ పర్యటించారు. ఐటీ హిల్స్‌ వద్ద ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే జీవీఎంసీ బీచ్‌ క్లీనింగ్‌ వాహనాలను ప్రారంభించి మాట్లాడారు. విశాఖ నగరానికి ఉజ్జ్వల భవిష్యత్‌ ఉందన్నారు. వైజాగ్‌ కలల నగరంగా అభివృద్ధి చెందబోతోందన్నారు. ఇన్ఫోసిస్‌ రాకతో విశాఖ మరింత వేగంగా వృద్ధి చెందుతుందన్నారు. ఇన్ఫోసిస్‌కు అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement