Monday, April 29, 2024

Vijayawada – మాకూ ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వండి – ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ డిమాండ్

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరోరాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐదు లక్షల పైగా ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డివి సత్యనారాయణ, కె శ్రీహరి రావులు విమర్శించారు. అధికారం కోసం కార్మికుల ఓట్లను మాయమాటలు చెప్పి వేయించుకుంటున్నారటప్ప అధికారంలోకి వచ్చినాక పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవన్నారు.

విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాల ఆడిచర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలు ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుండి సుమారు మూడు వేలకు పైగా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ తరలివచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డివి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి శ్రీ హరి రావులు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది ప్రైవేట్ ఎలక్ట్రికల్స్ వర్కర్స్ ఉన్నారని తమ సంక్షేమాన్ని ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులకు ప్రతి మండలానికి ఒక సర్వీస్ సెంటర్ ని ఏర్పాటు చేసి వారికి వృత్తి ఉపాధి కల్పించాలని కోరారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా పనిముట్లకు రెండు లక్షల సబ్సిడీతో కూడిన రుణ సదుపాయం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. .

ప్రమాదవశాత్తు చనిపోయిన ప్రైవేట్ ఎలక్ట్రికల్ కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం అందజేయాలని, ఈఎస్ఐ హాస్పటల్లో వైద్య సదుపాయాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులు ప్రతి ఏడాది జనవరి 27వ తేదీన ఎలక్ట్రికల్ డే ని జరుపుకుంటామని, ప్రభుత్వం కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ పండుగగా నిర్వహించాలని వారు సూచించారు. కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుంచి అందజేసే సంక్షేమ పథకాలు నాలుగు సంవత్సరాలుగా కార్మిక శాఖ నిలిపివేసిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ పథకాలు ఎలక్ట్రికల్ కార్మికులకు అందించాలని కోరారు.

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 2018 వ సంవత్సరంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికుల సమగ్ర సంక్షేమ సర్వే చైతన్య యాత్ర చేశామని ఆ యాత్ర ముగింపు సందర్భంలో ప్రజాప్రతినిధులు అధికారులకు తమ సమస్యలను తెలియజేశామని, అయినా ఇంతవరకు, ప్రభుత్వాలు తమ సమస్యలను పరిష్కరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రైవేట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే విధంగా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రైవేట్ కార్మికులకు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement