Monday, May 6, 2024

నిర్మల సీతారామన్‌తో విజయసాయి రెడ్డి భేటీ.. విభజన హామీలు, ఆర్థికాంశాలపై చర్చ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యల పరిష్కారంలో మరో అడుగు పడింది. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి సమావేశమయ్యారు. ప్రధాని కార్యాలయ ప్రతినిధి సహా కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో గత నెల 24న విజయసాయి రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధుల బృందం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ బృందంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఇతర ఉన్నతాధికారులన్నారు.

ఈ భేటీ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని, రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరింది. అలాగే విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన సంస్థలన్నింటికీ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక తోడ్పాటు అవసరమని తెలియజేసింది. విభజన సమస్యల పరిష్కారానికి అడ్డంకిగా ఉన్న అంశాల గురించి కమిటీ సమావేశంలో కూలంకశంగా చర్చించారు. ఈ క్రమంలో తీసుకోవాల్సిన రాజకీయ నిర్ణయాల గురించి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ను విజయసాయి రెడ్డి కలిశారు. త్వరితగతిన అన్ని సమస్యలకూ పరిష్కారం అందించాలని ఆమెను కోరినట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement