Wednesday, May 15, 2024

టిటిడి బోర్డు సభ్యుడిగా విజయకుమార్ స్వామి?

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పితామహుడుగా పేరుగాంచిన విజయకుమార్‌ స్వామికి త్వరలో కీలకమైన పదవి కట్టబెట్టే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి ట్రస్టు బోర్డు సభ్యునిగా ఆయన్ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆ దిశగా యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా రెండు రోజుల క్రితం విజయకుమార్‌ స్వామి తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమై జగన్‌ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం టీటీడీ బోర్డు మెంబర్‌ అంశంపై చర్చించినట్లు తెలిసింది. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే టీటీడీ పాలక మండలిని ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే సుమారు 50 మంది సభ్యులతో జంబో బోర్డును ప్రభుత్వం నియమించింది.

అయితే నిబంధనలకు విరుద్దంగా ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో బోర్డులో పరిమితికి మించి సభ్యులను తీసుకున్నారని కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో హైకోర్టు నిబంధనల మేరకే బోర్డు సంఖ్య ఉండాలని, అంతకు మించి అదనంగా ఉన్న సభ్యులను తొలగించాలని సూచించింది. దీంతో అప్పట్లో 8 మందికి పైగా సభ్యులను బోర్డు నుంచి తొలగించారు. ఆ జాబితాలో విజయకుమార్‌ స్వామి కూడా ఉన్నారు. అయితే అప్పట్లో చేజారిన పదవిలో ఆయనకు తిరిగి అవకాశం కల్పించాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కర్ణాటక నుంచి ఆయన ప్రత్యేక విమానంలో ఏపీకి వచ్చారు. నవయుగ గ్రూపు చైర్మన్‌ చింతా విశ్వేశ్వరరావు కుటుంబానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయకుమార్‌ స్వామి బెంగుళూరు నుంచి ఆ గ్రూపునకు చెందిన సొంత విమానంలో విశాఖకు వెళ్లారు. అక్కడి నుండి టీటీడీ చైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి వినతి మేరకు సీఎం జగన్‌కు ఆశీస్సులు అందించేందుకు ఆయన అదే ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో సీఎం జగన్‌ దంపతులకు స్వామీజీ ఆశీస్సులు అందించారు.

తాజాగా తాడేపల్లి భేటీలోనూ..ఇదే అంశంపై చర్చ..?
దేశవ్యాప్తంగా ప్రముఖులతో అత్యంత సన్నిహిత సంబంధాలు, పరిచయాలు ఉన్న విజయకుమార్‌కు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ లేరు. వ్యాపారాభివృద్ధితో పాటు రాజకీయంగా మరింత ముందుకు వెళ్లాలని యోచించి పలువురు ప్రజా ప్రతినిధులంతా విజయకుమార్‌ ఆశీస్సులు తీసుకుంటుంటారు. అందులో భాగంగానే గతంలో నవయుగ గ్రూపు కృష్ణపట్నం పోర్టును నిర్వహించింది. గ్రూపు చైర్మన్‌ చింతా విశ్వేశ్వరరావు, ఆయన తనయుడు చింతా శశిధర్‌లు అనేక సందర్భాల్లో నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు వచ్చేవారు. ఇదే తరహాలో నవయుగ మరికొన్ని వ్యాపారాలను కూడా నిర్వహిస్తుంది. అందులో భాగంగా విజయకుమార్‌స్వామి ఆ కుటుంబానికి అనేక సందర్భాల్లో ఆశీస్సులు అందించే వారని తెలుస్తోంది. తాజాగా కూడా సి.వి.ఆర్‌ కుటుంబంలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరయ్యేందుకే విజయకుమార్‌ స్వామి రాష్ట్రానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే తాడేపల్లికి వచ్చి సీఎం జగన్‌ దంపతులను ఆయన ఆశీర్వదించారు. ఆయనతో పాటు చింత శశిధర్‌ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో కృష్ణపట్నం పోర్టులో ఓబులాపురం మైనింగ్‌ ఎగుమతులు, దిగుమతులు జోరుగా సాగేవి. ఆ సమయంలో కూడా చింతా కుటుంబానికి విజయకుమార్‌ స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉండేవి. ఆ సందర్భంలోనే జగన్‌కు, చింతా శశిధర్‌కు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవని అప్పట్లో జోరుగా ప్రచారం కూడా సాగింది. ఈ నేపధ్యంలోనే శశిధర్‌ సొంత ఫ్లైట్‌లో స్వామీజీని ఏపీకి ఆహ్వానించి వై.వి సుబ్బారెడ్డి విజ్ఞప్తి మేరకు విజయకుమార్‌ తాడేపల్లికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంలోనే టీటీడీ పదవిపై మరోసారి చర్చ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో చేజారిన బోర్డు మెంబర్‌ పదవిని త్వరలో విజయకుమార్‌కు ఇవ్వబోతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement