Thursday, May 2, 2024

AP | విశాఖలో పట్టణీకరణ జోరు.. ఇళ్ల నిర్మాణం ఫుల్‌ జోష్‌

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతున్న విశాఖలో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతోంది. దేశంలోనే ప్రముఖ ఖరీదైన పది నగరాల్లో విశాఖ ఇప్పటికే చోటు దక్కించుకుంది. ఇక్కడ నివాసం ఉండేందుకు అన్ని ప్రాంతాల ప్రజలు ఎంతో ఇష్టపడతారు. అందువల్లే పట్టణీకరణ శరవేగంగా పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా ఖరీదైన నగరాల కేటగిరిలో కూడా విశాఖ తొలి పది స్ధానాల్లో ముందుకు సాగుతున్నది. ఇక్కడ నగరంలో ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి వంటి పలు అంశాల్లో ఎంతో పురోగతి సాధించింది. ఆరోగ్యానికి సంబంధించి ప్రధానంగా కేజీహెచ్‌, విమ్స్‌తోపాటు టీబీ ఆసుపత్రి, కంటి ఆసుపత్రి, మెంటల్‌కేర్‌ వంటి అనేక ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన వైద్యం అందిస్తున్నాయి.

ఇక ప్రైవేట్‌ ఆసుపత్రులు ముంబాయికి ధీటుగా అవసరమైన మేరకు వైద్యం అందించడంలో పోటీపడుతున్నాయి. ఇక విద్యకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా యూనివర్శటీ, ఆంధ్రా మెడికల్‌ కళాశాలతో పాటు ఎన్నో కోర్సులను అందించే కళాశాలలు విశాఖలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన పలు దేశాల విద్యార్ధులు ఇప్పుడు విశాఖలోనే తమ ఉన్నత విద్యాభ్యాసం సాగిస్తున్నారు. ఇంకా ఐఐటీ, ఐఐఎం, పెట్రోలియం, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వంటి సంస్థðలు విశాఖలో కోకొల్లలుగా ఉన్నాయి.

- Advertisement -

ఉపాధికి సంబంధించి ప్రధానంగా వ్యాపార రంగంతో పాటు, పరిశ్రమల కేంద్రంగా నగర ం పేరుగాంచింది. ప్రభుత్వ, ప్రైవేట్‌కు చెందిన అనేక సంస్థలు విశాఖలోనే ఉన్నాయి. దీంతో సమీప జిల్లాలు, రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చి ఇక్కడ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తుంది. అందువల్లే క్రమేపీ విశాఖలో పట్టణీకరణ జోరు పెరుగుతున్నట్లు, అందుకు తగ్గట్టే నిర్మాణాలు సాగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

నివాస భవనాలే అధికం

విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తరువాత కూడా వాణిజ్య భవన సముదాయాలు నిర్మాణాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. అయితే ప్రశాంత విశాఖనగరంలో నివాసముండేందుకు అత్యధిక శాతం ప్రజలు ఇష్టపడటం జరుగుతుంది. అందుకు తగ్గట్లుగానే నాలుగేళ్లలో నివాసభవనాల సంఖ్య ఘననీయంగా పెరుగుతూ వస్తుంది. అయితే వాణిజ్య భవనాలు నిర్మాణం మాత్రం పెద్దగా పురోగతి లేదు. ప్రతీ ఏటా వందకు మించి నిర్మాణం జరగకపోవడం గమనార్హం. జీవీఎంసీకి అత్యధికంగా టౌన్‌ప్లానింగ్‌ విభాగం ద్వారా ఆదాయం లభిస్తుంది.

బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌ (బీపీఎస్‌), ల్యాండ్‌ రెగ్యులైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌)ల ద్వారా భారీగా ఆదాయం లభిస్తుండగా ప్రస్తుతం ఈ రెండు అమలులో లేవు. అయితే భవన నిర్మాణ ఫీజులు ద్వారా జీవీఎంసీకి ఏటా కోట్లాది రూపాయలు ఆదాయం లభిస్తుంది. ఒక్క 2022లోనే జీవీఎంసీకి టౌన్‌ప్లానింగ్‌ విభాగం ద్వారా రూ.205.31 కోట్లు ఆదాయం లభించగా గడచిన మూడు నెలల్లో రూ.95.85 కోట్లు లభించడం విశేషం.

2020 నుంచి 2023 వరకు నగరంలో నిర్మాణాల వివరాలు:-

సంవత్సరం ఇచ్చిన అనుమతులు నివాసం వాణిజ్యం ఆదాయం (కోట్లలో)
2020 5005 4968 37 రూ.86.82
2021 6645 6584 61 రూ.151.87
2022 6884 6775 109 రూ.205.31
2023 1650 1629 21 రూ.95.85

Advertisement

తాజా వార్తలు

Advertisement