Friday, May 3, 2024

ఎపిలో దేవుడికే శ‌ఠ‌గోపం…

అమరావతి, ఆంధ్రప్రభ: ఆదాయం వచ్చే ఆలయాలను వదిలేందుకు కార్యనిర్వహణాధికారులు ఇష్టపడరు. ఏదో విధంగా అక్కడే తిష్టవేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు వర్కింగ్‌ ఆర్డర్స్‌ విధానం అక్కరకొస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగాల్లో బదిలీలు సర్వసాధారణం. ఏటా నిర్దేశిత సమయాల్లో బదిలీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది. ఇందుకు కొన్ని ప్రామాణికాలు కూడా స్పష్టం చేస్తుంది. ఇందుకు దేవదాయశాఖ మినహాయిం పేమీ కాదు. ఆలయ కార్య నిర్వహణాధికారులు మొదలు.. జిల్లాల దేవాదాయ శాఖ అధికారుల వరకు బదిలీలు అని వార్యం. విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు బదిలీలు చేయక తప్పనిసరి. ఈ క్రమంలోనే గత ఏడాది నుంచి వర్కింగ్‌ ఆర్డర్స్‌ తెరపైకి వచ్చాయి. గతంలో తప్పనిసరి ప్రత్యేక పరిస్థితుల్లో వర్కింగ్‌ ఆర్డర్స్‌ ఇచ్చేందుకు వెసులుబాటు ఉన్నప్పటికీ.. గత ఏడాది బదిలీల తర్వాత ఇది మరింతగా శృతిమించిందని చెపుతున్నారు.

నచ్చినచోట పోస్టింగ్‌
రాష్ట్రంలోని ఆలయాలు, జిల్లాల్లో కోరుకున్న పోస్టింగ్‌లో కొనసాగేందుకు వర్కింగ్‌ ఆర్డర్స్‌ను అడ్డుగా పెట్టుకుంటున్నారు. గత ఏడాది సాధారణ బదిలీల ప్రక్రియ ముగిసిన కొద్ది రోజుల్లోనే పెద్దఎత్తున కార్యనిర్వహణాధికారులు, అధికారులు వర్కింగ్‌ ఆర్డర్స్‌ పేరిట కీలక స్థానాలు చేజిక్కించుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి నెల రోజుల కిందట రాష్ట్రంలోని కీలకమైన ఆలయం ఈవో పోస్టింగ్‌లో చేరిపోయారు. గతంలో అవినీతి నిరోధక శాఖ ఆదాయానికి మించి ఆస్తులు కూడా బెట్టినట్లు పేర్కొంటూ కేసు నమోదు చేసింది. అప్పట్లో ఏసీబీ దాడుల్లో రూ.వందల కోట్ల ఆస్తులున్నట్లు సాక్షాత్తు అధికారులే పేర్కొన్నారు. కొన్నాళ్ల తర్వాత సస్పెన్షన్‌ ఎత్తేయించుకొని ప్రధాన కార్యాలయంలో విధులు చేపట్టారు. ఏసీబీ కేసుల్లో ఉన్న వారికి కీలక స్థానాలు ఇవ్వకూడదన్న ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ అన్నింటిని తన గుప్పిట్లోకి తీసుకున్నారు. అయినప్పటికీ ప్రధాన ఆలయాల్లో పని చేయాలనే కోరిక తీర్చుకునేందుకు ఇటీవల ఓ కీలక ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకొని తాను కోరుకున్న పోస్టింగ్‌ తెచ్చుకున్నట్లు దేవదా యశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వర్కింగ్‌ ఆర్డర్స్‌ను అడ్డుపెట్టుకొనే ఆ కీలక దేవాలయం కార్యనిర్వహణాధికారి పోస్టు దక్కించుకున్నారు. ఇదే తరహాలో పలు జిల్లాల్లో ఈవోలు కూడా వర్కింగ్‌ ఆర్డర్స్‌ పేరిట ఆదాయం వచ్చే చోట విధులు నిర్వహిస్తున్నారు.

నచ్చనివారినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం
కోరుకున్న పోస్టింగ్‌ ఇవ్వడం కోసమే కాదు. నచ్చని వారిని లేపేసేందుకు కూడా వర్కింగ్‌ ఆర్డర్స్‌ను అధికారులు ప్రయో గిస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. కీలక ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఆర్జేసీ స్థాయి అధికారి చెప్పిన మాట వినడం లేదంటూ కొందరు ప్రజా ప్రతినిధులకు ఆగ్రహం వచ్చింది. ఆయన చేసిన తప్పల్లా లడ్డూ ప్రసాదాల్లో నాణ్య మైన నెయ్యి వినియోగించేందుకు ప్రజా ప్రతినిధులు చేసిన సిఫార్సులను బుట్ట దాఖలు చేయడమే. తాము చెప్పిన మాట వినని అధికారి మాకొద్దంటూ వర్కింగ్‌ ఆర్డర్స్‌పై అక్కడి నుంచి పంపేసి ప్రధాన కార్యాలయంలో విధులు అప్పగించారు. జిల్లాల్లో పలువురు కార్యనిర్వహణాధికారులు, జిల్లా అధికారులను సైతం చెప్పిన మాట వినకపోవడంతో వర్కింగ్‌ ఆర్డర్స్‌పై ఇతర ప్రాంతాలకు పంపారు. ఈ క్రమంలో ఆయా పోస్టింగ్‌ల్లో తమకు అనుకూలమైన వారిని, అమ్యామ్యాలు ఇచ్చిన వారిని నియమించుకున్నారు.

చక్కదిద్దుతారా?
ఓ వైపు ఏసీబీ దాడులు..మరో వైపు ఆలయాల్లో సౌకర్యాలపై భక్తుల పెదవి విరుపులు..ఇంకో వైపు ఆలయాల్లో నిర్వహిస్తున్న సేవలు, ఆస్తుల అన్యాక్రాంతం వంటి పలు అంశాల్లో హిందూ సంఘాల ఆగ్రహం. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో వర్కింగ్‌ ఆర్డర్స్‌ పేరిట చోటు చేసుకుంటున్న అక్రమాలకు కొత్త కమిషనర్‌ సత్యనారాయణ ఏమేరకు కట్టడి చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవలనే దేవదాయశాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సత్య నారాయణ శాఖాపరమైన లోటుపాట్లపై ప్రధాన దృష్టిసారించారు. అయితే సింహాచలంలోని శ్రీ వరహా లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం, మరో ఆరు రోజుల్లో విజయవాడలో నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ రాజశ్యామల యాగం ఏర్పాట్ల వంటి కారణాలతో పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నట్లు చెపుతున్నారు. ఆ తర్వాత చక్కదిద్దుతారో? లేక పరిస్థితులకు అను గుణంగా సర్దుకుపోతారో? వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement