Tuesday, April 30, 2024

Top Story – నరసాపురం తీరంలో రాజకీయ అలజడి… సీట్ల‌పై అశావాహుల ధీమా..

(ప్రభన్యూస్‌, నరసాపురం) – 2024 సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు మాజీలతో బాటు తాజాలు సై అంటున్నారు. ఎన్నికల బరిలో నిలిచేదెవరు.. గెలిచేదెవరన్నట్లుగా నియోజకవర్గ రాజకీయ పరిస్థితి ఉంది. ప్రధానపార్టీల తరపున పోటీచేసేందుకు ఆశావాహులు తమ యత్నాలను ముమ్మరం చేశారు. సీటుపై ధీమా , గెలుపుపై ఆశ అన్నట్లుగా ఉంది ఆశావ‌హుల‌ పనితీరు. వైసీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు నియోజకవర్గంలో బలమైన పార్టీలుగా నిలిచాయి. గత ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరా హోరీగా సాగింది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించేందుకు తెలుగుదేశం, జనసేన జతకట్టాయి. దీంతో టీడీపీ, జనసేన మధ్య సీటు కోసం పోటీ పెరిగింది.

స‌ర్దుబాటులో ఎటు వెళ్తుందో..
సీట్లు సర్దుబాటు విషయంలో నరసాపురం సీటు ఏ పార్టీకి కేటాయిస్తారో అనే విషయం చర్చనీయాంశంగా మారింది. రెండు పార్టీలకు చెందిన ఆశావాహులు తమ కార్యకలాపాలను ముమ్మరంచేసి అధినేతల మననం పొందే ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు. నరసాపురం సీటు తమ పార్టీదేనంటు జనసేన నేతలు బలంగా చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సీటుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇరు పార్టీల అధినేతలు హామీలు ఇచ్చారని ఆయా పార్టీలకు చెందిన ఆశావాహులు ప్రచారం చేసుకోవడం గమనార్హం. నియోజకవర్గంలో కాపు, అగ్నికులక్షత్రియ సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు అత్యధికంగా ఉండటంతో ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన ఆశావాహులు సీటు కోసం వేట మొదలు పెట్టారు.

టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆస‌క్తి..
తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఎన్‌ఆర్‌ఐ, కొవ్వలి ఫౌండేషన్‌ చైర్మన్‌ కొవ్వలి రావ్మెూహన్‌ నాయుడు లతో బాటు మరి కొంతమంది పార్టీసీటు కోసం పోటీ పడుతున్నారు. టీడీపీ సీటు కోసం మాధవనాయుడు, రావ్మెూహన్‌ నాయుడుల మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరింది. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా చీలిపోవడమేగాకుండా పార్టీ కార్యకలాపాలను వేరువేరుగా చేపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు, పార్టీ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు వర్గాలుగా తెలుగుదేశం పార్టీ చీలిపోయింది. మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు అధికారపార్టీ పై తనదైన స్థాయిలో పోరాడమేగాకుండా ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తుతున్నారని, రామరాజు వర్గం కేవలం పార్టీ కార్యకలాపాలకు మాత్రమే పరిమితమయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

జ‌నసేన నుంచి బొమ్మ‌డి నాయ‌క‌ర్‌..
జనసేన పార్టీ నుంచి నియోకవర్గ ఇన్‌చార్జి బొమ్మిడి నాయకర్‌తో బాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ (చిన్న) పోటీకి సై అనడంతో సీటు ఎవరికనే దానిపై చర్చ జోరందుకుంది. కాపు సామాజిక వర్గంనుంచి చాగంటి, అగ్నికులక్షత్రియ వర్గంనుంచి నాయకర్‌లు పార్టీ టికెట్‌ కోసం పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తులో భాగంగా నరసాపురం సీటు దక్కించుకునేందుకు రెండు పార్టీలకు చెందిన నేతలు పోటీపడుతున్నారు. రెండు వారాల్లో నరసాపురం సీటుపై ఒక క్లారిటీ వస్తోందని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. అధికార పార్టీ తరపున ప్రస్తుత ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పోటీచేస్తారని వైసీపీ నేతలు ఢంకాపథంగా చెబుతున్నారు.

వైసీపీలో ప్ర‌సాద‌రాజుకే ఖాయ‌మా?
వైసీపీ సీటు ప్రసాదరాజుకేనని, అందులో ఏమాత్రం సందేహం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. టికెట్‌ వస్తే చాలు… ఏ పార్టీ నుంచైన పోటీ చేసేందుకు కొందరు నేతలు సముఖంగా ఉన్నారనే ప్రచారంకూడా జోరందుకుంది. తెలుగుదేశం పార్టీ తరపున సీటు దక్కకపోతే స్వతంత్ర అభ్యర్దిగా బరిలో దిగేందుకు మాజీలు సిద్దం అవుతున్నట్లుగా తెలిసింది. మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అనుకున్న పార్టీ నుంచి టికెట్‌ లభించకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారనే ప్రచారం నియోజకవర్గంలో జోరందుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement