Monday, April 29, 2024

Tirupathi: తిరుమలకు కొత్త బ‌స్సులు.. పొల్యూష‌న్ కంట్రోల్ కోసం e-Buses..

Electric Buses: ఏపీ ఎస్సార్టీసీ ఎలక్ట్రిక్ వాహనాలవైపు దృష్టి సారించింది. తిరుమలగిరుల్లో కాలుష్యం తగ్గించే క్రమంలో భాగంగా పెద్దఎత్తున ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపించాలని నిర్ణయించింది. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సంస్థకు భారీ కాంట్రాక్ట్ దక్కింది. ఓ వైపు పర్యావరణ పరిరక్షణ.. మరోవైపు పెరుగుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయం ఎలక్ట్రిక్ వాహనాలు. అందుకే ఏపీఎస్సార్టీసీ (APSRTC) ఎలక్ట్రిక్ వాహనాల్ని సమకూర్చుకుంటోంది.

తొలిదశలో తిరుమల గిరుల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తిరుమల-తిరుపతి మధ్య పెద్దఎత్తున ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపించాలని నిర్ణయించింది. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నుంచి 100 ఎలక్ట్రిక్‌ బస్సులకు కాంట్రాక్ట్ దక్కింది. ఈ కాంట్రాక్టు విలువ దాదాపు 140 కోట్ల రూపాయలు.

ఏడాది వ్యవధిలో బస్సుల్ని డెలివరీ చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టు వ్యవధిలో బస్సుల మెయింటెనెన్స్‌ కూడా ఒలెక్ట్రా సంస్థే నిర్వహిస్తుంది. నిర్దిష్ట మోడల్‌ ప్రకారం ఈ కాంట్రాక్టు 12 సంవత్సరాలు అమల్లో ఉంటుంది. ఈ బస్సులను తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి నిర్వహిస్తారు. 50 బస్సులను తిరుమల–తిరుపతి ఘాట్‌ రోడ్డులో, మరో 50 బస్సులను తిరుపతి నుంచి నెల్లూరు, కడప, మదనపల్లి పట్టణాలకు ఇంటర్‌సిటీ సర్వీసులుగా నడుపుతారు.

ఎలక్ట్రిక్ బస్సుల వల్ల కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ (Olectra Greentech) వెల్లడించింది. ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలకు ఒలెక్ట్రా కట్టుబడి ఉందని.. ఏపీలో అత్యాధునిక ఎలక్ట్రిక్‌ బస్సులు ఆపరేట్‌ చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్, ముంబై, పూణే తదితర నగరాల్లో తమ సంస్థ బస్సులు నడుస్తున్నాయని సంస్థ ఛైర్మన్ కేవీ ప్రదీప్ తెలిపారు.

ప్రముఖ ఇన్‌ఫ్రా దిగ్గజం మేఘా ఇంజనీరింగ్‌లో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ భాగంగా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 150 ఎకరాల పారిశ్రామిక స్థలాన్ని కేటాయించింది. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ ఎయిర్ కండీషన్ బస్సులో డ్రైవర్ మినహాయించి 35 సీట్ల సామర్ధ్యం ఉంది. ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమేరాలు, ఎమర్జెన్సీ బటన్, ప్రతి సీటుకు యూఎస్‌బీ సాకెట్ సౌకర్యం ఉంటాయి. లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేసే ఈ బస్సులు ఒకసారి చార్జ్ అయితే.. ప్రయాణికుల సంఖ్యను బట్టి 180 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తాయి.

- Advertisement -

ఇది కూడా చదవండి:విద్యార్థులపై లాఠీఛార్జి.. అనంతపురంలో బంద్

Advertisement

తాజా వార్తలు

Advertisement