Saturday, May 18, 2024

వైసీపీ సర్కారుకు మూడేళ్లు, పార్టీ శ్రేణుల సెల్రబేషన్​.. ముందస్తుకు రావాలని చంద్రబాబు సవాల్​

ఆంధ్రప్రదేశ్​లో వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి చవ్చి మూడేళ్లు అవుతోంది. సీఎం జగన్​మోహన్​రెడ్డి చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. ఈ మూడేళ్ల పాలనను పార్టీ వర్గాలు పెద్ద ఎత్తున సెలబ్రేట్​ చేసుకుంటున్నాయి. ‘‘మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్ల‌లో 95శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మ‌రొక్క‌సారి అందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నా.” అని సీఎం జగన్​ ట్వీట్​ చేశారు.

కాగా, వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజనీ ప్రత్యేకంగా తయారు చేయించిన ఫ్లెక్సీ ఆకట్టుకుంటోంది. ఈ ఫ్లెక్సీని ట్విట్టర్​లో పోస్టు చేయడంతో చాలా మంది చూసి బాగుందని కామెంట్​ చేస్తున్నారు. అయితే.. జగన్​ సర్కారు తీరుపై, పాలనా వైఫల్యాలపై.. ఈ మూడేళ్ల పాలనపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఎన్నికలకు వెళ్దాం దమ్ముంటే రండి అని చంద్రబాబు సవాల్​ చేస్తూనే ఉన్నారు.

అమరావతిపై రెఫరెండం పెడతాం.. ఏపీలో అభివృద్ధిని రెఫరెండంగా పెట్టాలని.. ఇలా రకరకాలుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే స్థానిక ఎన్నికల్లో మాత్రం టీడీపీ తమ సత్తా చూపించలేకపోయింది. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి మాత్రం సరైన కారణాలు చెప్పుకోలేకపోతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలిసిపోయిందని, ఇంకా ఎక్కువ రోజులు వేచి చూస్తే ఆ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు చంద్రబాబు. అందుకే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, తమ్ముళ్లూ సిద్ధంగా ఉండండి.. అంటూ దిశా నిర్దేశం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. ప్రజలు తమకు సంపూర్ణ మెజార్టీ ఇచ్చారని, ఐదేళ్లు పాలించాలని చెప్పారని, అలాంటిది తామెందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తామని గతంలో ప్రశ్నించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

సీఎం జగన్​ ట్వీట్​కు రిప్లయ్​ చేస్తూ మూడేళ్లలో ప్రజలకు ఉరితాడు మిగిలిందని పోస్టు చేసిన టీడీపీ అభిమాని

ముందస్తుకి వెళ్తే ఎవరికి మేలు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా జగనే సీఎం అవుతారని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈమేరకు వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో కూడా పలు కథనాలు వస్తున్నాయి. పోనీ కొంతకాలం వేచి చూసినా కూడా వైసీపీపై వ్యతిరేకత పెరిగే అవకాశం లేదు. అసలు సంక్షేమ పథకాలు సరిగ్గా అమలైనంత కాలం ఏపీకి ఎంత అప్పు ఉంది, ప్రజలపై అప్పుల భారం ఎంత పెరిగింది అనేది ఎవరూ ఆలోచించట్లేదు. బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ అయిందా లేదా అనేదే ఆలోచిస్తున్నారు. సో.. ఇలాంటి సమయంలో జగన్ ముందస్తుకి వెళ్లాల్సిన అవసరమే లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ.. జగన్ ముందస్తుకి వెళ్తే అది పెద్ద సాహసమేనని చెప్పాలి. ప్రజలు పూర్తి మద్దతు ఇస్తే, ప్రజా ధనాన్ని వృధా చేస్తూ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారనే అపవాదు ఆయన్ను చుట్టుముట్టే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement