Tuesday, April 30, 2024

AP | నీళ్ళు లేక వరి లేదు.. సాగు విస్తీర్ణం భారీగా తగ్గే అవకాశం

అమరావతి, ఆంధ్రప్రభ : ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టే అవకాశాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా నమోదు కావటం, సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్ళు అడుగంటు-తుండటంతో వరి సాగుపై రైతులు వెనుకంజవేస్తున్నారు. గత ఏడాది (2022-23) ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయశాఖ ప్రకటించిన లక్ష్యానికి కన్నా వరిసాగు విస్తీర్ణం తక్కువగా నమోదయింది.

వరి సాగు విస్తీర్ణ లక్ష్యం 40.75 లక్షల ఎకరాలుగా ఉంటే కేవలం 35.97 లక్షల ఎకరాల్లోనే సాగయినట్టు అంచనా. ఈ ఏడాది (2023-24) ఖరీఫ్‌ సీజన్‌ కోసం గత ఏడాది కన్నా అధికంగా 15.88 లక్షల హెక్టార్లను వ్యవసాయశాఖ లక్ష్యంగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో వరి సాగు ఆశాజనకంగా లేదని రైతులు అంటున్నారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఈ సంవత్సరం సాగునీటి వనరుల అందుబాటు తక్కువగా ఉండటం ప్రధాన కారణం కాగా పెట్టుబడి వ్యయం పెరగుతున్న స్థాయిలో మార్కెట్లో మద్దతు ధరలు కరువు కావటంతో రైతులు వరి పై ఆసక్తి కనబర్చటం లేదని రైతు సంఘాలు చెబుతున్నాయి.

- Advertisement -

అన్నిటికన్నా మించి ప్రతి ఏటా వరి సాగు విస్తీర్ణ లక్ష్యాన్ని ఒక వైపు పెంపుదల చేస్తూనే మరో వైపు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేయటం, ప్రోత్సాహకాలు అందించటం కూడా సాగు విస్తీర్ణం తగ్గుదలకు మరో కారణంగా భావిస్తున్నారు. రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పాడ్డ ప్రాంతాల్లో ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళిక అమలు చేస్తోంది. ఈ మేరకు ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన ఎరువులు, విత్తనాలను ఆర్బీకేలకు చేరవేసి రైతులకు అందుబాటులో ఉంచుతోంది.

ఉద్యాన పంటల వైపు చూపు..

వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, నూనెగింజలు, చిరుధాన్యాలతో పాటు ప్రత్యేకించి ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంపుదల చేసేలా ప్రణాళిక అమలు చేస్తోంది. గడిచిన మూడేళ్ళలో 4.29 లక్షల ఎకరాల్లో కొత్తగా ఉద్యాన పంటలు సాగు కావటం విశేషం. ఈ ఏడాది 2022-23 ఖరీఫ్‌, రబీ సీజన్లలో కలిపి అదనంగా మరో 1.34 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా ప్రకటించింది. ఈ ఏడాది 15 నుంచి 20 శాతం అధికంగా ప్రత్యామ్నాయ పంటల విస్తీర్ణాన్ని పెంపుదల చేసింది. బోర్ల కింద వరి సాగు చేయవద్దని కోరుతోంది.

ప్రత్యామ్నాయంగా ఉద్యానపంటలను సూచిస్తోంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డ ప్రాంతాలతో పాటు వరి సాగు అధికంగా ఉండే కృష్ణా-గోదావరి ప్రాంతాల్లో బోర్ల కింద వరికు బదులు ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తే లాభదాయంగా ఉంటుoదని ఉద్యానశాఖలోని శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. ఆయిల్‌ పామ్‌తో పాటు కొబ్బరి, కోకో, జామ తోటలను సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో అధిక లాభాలు ఆర్జించవచ్చని చెబుతున్నారు.

దీని కోసం పంటకాలం పూర్తయ్యే వరకు వివిధ దశల్లో రైతులకు ప్రభుత్వం రాయితీలు కూడా అందిస్తోంది. ప్రత్యామ్నాయ పంటల సాగులో రాయలసీమ రీజియన్‌ మిగతా ప్రాంతాల కంటే ముందుంది. రాష్ట్ర వ్యాప్తంగా 44.88 లక్షల ఎకరాల్లో ఉద్యానపంటలు సాగవుతుతుండగా దానిలో 39 శాతం విస్తీర్ణం రాయలసీమలోనే ఉండటం విశేషం. అధికారిక గణాంకాల ప్రకారం రాయలసీమలోని బోరు బావుల కింద పండితే పండింది.

లేదంటే లేదన్నట్టుగా గతంలో వరిని సాగు చేయగా ఇపుడు అరటి, బత్తాయి, బొప్పాయి, దానిమ్మ, మామిడి తోటల పెంపకం వైపు రైతులు దృష్టి కేంద్రీకరించారు. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ నిమ్మ, బత్తాయి, అరటి, మామిడి, జీడి మామిడి, ఆయిల్‌ పామ్‌, కొబ్బరి తోటలవైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని మరింత పెంపుదల చేసేందుకు అనువైన ప్రాంతాలను రాష్ట్ర ఉద్యానవన శాఖ గుర్తించి రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement