Thursday, April 25, 2024

AP: మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమం

వైసిపికి చ‌ర‌మాంకం పాడాలంటే కూట‌మి అవ‌స‌రం
పార్టీలు వేరైనా మూడు పార్టీల అజెండా ఒక్క‌టే
అన్నివ్య‌వ‌స్థ‌లు జ‌గ‌న్ చేతిలో స‌ర్వ‌నాశ‌నం
చివ‌ర‌కు తాక‌ట్టులో సచివాలయం
నిరంకుశ పాల‌న పోవాలంటే కూట‌మి రావాలి
బిజెపి ఎపి చీఫ్ పురందేశ్వ‌రి వెల్ల‌డి

విజ‌యవాడ – టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ అధిష్టానం నిర్ణ‌యించింద‌ని, మూడు పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరమ‌ని అన్నారు బిజెపి ఎపి చీఫ్ పురందేశ్వ‌రి…. మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమంగా అభివర్ణించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వివిధ రంగాలు, వర్గాలకు చెందిన పలువురు నేడు పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఏపీలోని అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారన్న ఆమె.. పొత్తుల వల్ల పార్టీలో చాలా మంది ఆశావహులకు నిరాశ ఎదురైంద‌న్నారు. అయితే రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులు తప్పలేదని అన్నారు..

వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకుందని విమర్శించారు. భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించార‌ని ఆరోపించారు. అప్పులు భారీ ఎత్తున చేయ‌డమే కాకుండా సెక్రటేరీయేట్టును, మద్యాన్ని, గనులను, ప్రభుత్వ భవనాలను, భూములను తనఖా పెట్టేశారని వివ‌రించారు.. సెక్రటేరీయేట్టును తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాశారా? అని ఓ వైసీపీ నేత కామెంట్ చేస్తున్నార‌ని అన్న పురందేశ్వ‌రి . ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎక్కడిది..? అంటూ మండిపడ్డారు.


వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ అవినీతే అని ఆరోపించారు.. మహిళల పుస్తెలు తెగినా నాసిరకం మద్యం తాగిస్తామనే రీతిలోనే జగన్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలనే సీఎం జగన్.. ఆ వర్గాలకు ఏం న్యాయం చేశారు? అని ప్రశ్నించారు పురంధేశ్వరి.. ఎస్సీ, బీసీ, ఎస్టీల నిధులు దారి మళ్లించార‌ని, ఎస్సీ యువకుడిని హత్య చేసిన ఎమ్మెల్సీని సీఎం తన పక్కన కూర్చొబెట్టుకుంటున్నార‌ని గుర్తు చేశారు. ఎస్సీలకు జగన్ చేసిన న్యాయం ఇదేనా..? అని మండిపడ్డారు.

- Advertisement -

ఏపీ అభివృద్ధికి బీజేపీ అంకితమై పని చేస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ నిరంకుశ పాలన చూస్తున్నాం. సీఎం జగన్‌ను గద్దె దించాలంటే మూడు పార్టీల కూటమి.. త్రివేణి సంగమం అనివార్యమన్నారు. బీజేపీ అభ్యర్థులనే కాదు.. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. మూడు పార్టీల జెండాలు వేరైనా.. అజెండా మాత్రం ఒక్కటేన‌ని.. మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలోకి వస్తేనే ఏపీలో రామరాజ్యం వస్తుందనే ఆశాభావం వ్య‌క్తం చేశారు పురందేశ్వ‌రి..

ఏప్రిల్ 5 నుంచి బిజ‌పి ప్ర‌చార భేరి

ఇక వచ్చే నెల 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రచారాన్ని చేపట్టనుంది. ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి ఎంపీగా బరిలోకి దిగుతున్న రాజమండ్రి నుంచే ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పార్టీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు ప్రచారసభల్లో పాల్గొనేలా టూర్ షెడ్యూల్స్‌ను ఖరారు చేస్తున్నారు. వీటితో పాటు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిపి ఉమ్మడి బహిరంగ సభలు కూడా ఎక్కడెక్కడ నిర్వహించాలనే దానిపై ఆలోచన చేస్తున్నారు.

ప‌దాదికారుల బేటి

దీనిలో భాగం 150 మందితో విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల స‌మావేశం విజ‌య‌వాడ‌లో నేడు ప్రారంభ‌మైంది. ఈ సమావేశానికి జాతీయ నాయకులతో పాటు, రాష్ట్ర నేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు… దాదాపు 150 మంది వరకు హాజరయ్యారు. ఈ మీటింగ్‌కు చీఫ్ గెస్ట్‌గా సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ హాజరైన‌ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకునేలా ట్రైనింగ్‌ ఇస్తున్నారు. పోటీ చేయబోయే నియోజకవర్గాలకు ప్రత్యేకంగా కొన్ని టీమ్‌లను ఎంపిక చేయనున్నారు. బీజేపీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సీనియర్లకు, నియోజకవర్గంపై పట్టున్న లీడర్లకు ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement