Thursday, May 2, 2024

AP | సుర్రుమనిపిస్తున్న సూరీడు.. ముదురుతున్న ఎండలు !

అమరావతి, ఆంధ్రప్రభ : సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. క్రమేపీ ఎండలు ముదురుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. సాధారణం కంటే 3 నుంచి 4.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, కడప జిల్లాల్లో 38 సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి నెలలో సాధారణ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు మించవు. గత వారం రోజులుగా ఎండల తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ నెల మూడో వారం నుంచి ఎండల ప్రభావం బాగా పెరుగుతోందని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో బలంగా ఉండటమే ఇందుకు కారణంగా వాతావరణ శాఖ లెక్కగడుతోంది. సాధారణంగా ఫిబ్రవరి నెలలో చిరుజల్లులు కురుస్తూంటాయి దీంతో పగటి ఉష్ణోగ్రతల్లో చురుకుదనం ఉండదు.

ఈ ఏడాది ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గతేడాది ఫిబ్రవరి చివరివారంలో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు జిల్లా కౌతాళంలో నమోదైంది. గడిచిన వారం రోజులుగా కర్నూలు, నంధ్యాల జిల్లాల్లో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అనంతరపురం, కడప జిల్లాల్లో 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం చూస్తుంటే ఈనెల మూడో వారం నుంచి ఎండలు ఠారెత్తడం ఖాయమన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

మార్చి నుంచే ఎండలు తీవ్రంగా ఉంటాయని, దీంతోపాటు- వడగాల్పులు ప్రభావం కూడా అధికంగా ఉంటు-ందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాలపై అధికారులు దృష్టి సారించాలని సూచనలు చేస్తోంది. గడిచి న వారం రోజులుగా ఎండల తీవ్రత పెర గడంతో ఏసీలకు పని మొదలైంది. గడిచిన మూడు నెలలుగా స్విచ్‌ ఆఫ్‌లో ఉన్న ఏసీలు మళ్ళీ ఆన్‌ అవుతున్నాయి.

నిరుడు నిప్పులు కక్కిన భానుడు

- Advertisement -

గతేడాది ఎర్రటి ఎండలకు వడగాలులు తోడవ్వడంలో రాష్ట్రంలో ప్రజలు అల్లాడిపోయారు. గడిచిన ఐదేళ్ళతో పోలిస్తే 2023 సంవత్సరంలో వేసవి తన విశ్వరూపాన్ని చూపించింది. గ్లోబల్‌ వార్మింగ్‌, పారిశ్రామికీకరణ, పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అడవులు నరికివేత, కొండలు తొలచివేత, భూమిలో కలవని వ్యర్ధాలతో భూ ఉపరితలం నిండిపోవడం, కాలుష్యం, ప్లాస్టిక్‌ వినియోగం మొదలైనవి వాతావరణంలోని మార్పులు విపత్తులకు కారణభూతాలవుతున్నాయి.

ఒకప్పుడు మండే ఎండలంటే 35 డిగ్రీలు అది మే నెలలో ఉండేవి కానీ గత కొన్నేళ్ళుగా 40 డిగ్రీలు కూడా సర్వ సాధారణమైంది. ప్రకృతికి అనుగుణంగా జీవనవిధానం మారకపోతే రానున్న కాలంలో మరింత విపత్కర పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటు-ందని వాతావరణ శాస్త్ర వేత్తలు హెచ్చరిస్తున్నారు.

2017 నుంచి 2021 వరకు వరుసగా 46.7, 43.1, 46.4, 47.8, 45.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదుకాగా, 2022లో ఉమ్మడి నెల్లూరు జిల్లా గుడూరులో అత్యధికంగా 45.9 డిగ్రీలు, గతేడాది తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8, ప్రకాశం గుండ్లపల్లిలో 46.7, శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 46.5 అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చిలో నంద్యాల జిల్లా నందికొట్కూరు, వైయస్సార్‌ జిల్లా కడప మండలంలో 41.8 డిగ్రీలు, ఏప్రిల్‌లో పల్నాడు జిల్లా బెల్లంకొండలో 45.9, మే లో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8, జూన్‌ లో పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 45.6డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

12 జిల్లాల్లో 46, 8 జిల్లాల్లో 45, 4 జిల్లాల్లో 44, రెండు జిల్లాల్లో 43డిగ్రీల సెల్సియస్‌కు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా రుతుపవనాలు ఆలస్యం అవ్వడంతో నిరుడు వర్షపాతం అనూహ్యంగా తగ్గింది. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఎండలు తీవ్రంగానే ఉంటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా ‘ఆంధ్రప్రభ’ తో మాట్లాడుతూ గడిచిన వారం రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయన్నారు. మార్చి తరువాత ఎండల తీవ్రతపై స్పష్టమైన నివేదిక ఇవ్వగలుగుతామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement