Friday, June 14, 2024

నిధుల విడుదలలో జాప్యానికి చెక్‌ .. సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రానికి ఎంతో ఉపయోగం..

ఉదయగిరి, (ప్రభ న్యూస్‌) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కేంద్రం మరింత దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో పనులు చేశారనే ఉద్దేశంతో కక్షకట్టి బిల్లులు ఆపే అవకాశం ఇక ఉండకపోవడమే కాకుండా పథకం పరిధి పెరుగుతుండడంతో మరింత అభివృద్ధికి కూడా అవకాశం కలుగుతోంది . ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారం పనులు జరిగా యంటే బిల్లు ఇవ్వాల్సిందే. పనులు లేక ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న వారికి స్థానికంగా ఉపాధి కల్పించేందుకు గత యూపీఏ సర్కార్‌ ‘ఉపాధి హామీ’ పథకాన్ని ప్రవేశపెట్టింది. కరువు కాటేసినప్పుడు, వేసవిలో పనులు లేనప్పుడు సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలకు ఉపాధి పథకం ఊపిరిగా మారింది. ఉపాధి నిధులతో చేపట్టిన పనులకు వరుసగా జిల్లాకు అవార్డుల పంట పండింది. నీటి సంరక్షణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల పనులకు ఈ నిధులనే వినియోగించారు. జిల్లాలో 4,34,877 జాబ్‌కార్డులు ఉన్నాయి. 2021-22 సంవత్సరంలో 1.50 కోట్ల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకుని ఇప్పటికే దాదాపు 1.20 కోట్లకు పైగా పనిదినాలను కల్పించడం జరిగింది. పూర్తి స్థాయి లక్ష్యాన్ని చేరుకునే విధంగా జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది.

ఉపాధితో పలు అభివృద్ధి పనులు..

కేంద్ర ప్రభుత్వమే ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయిస్తుంది. కొన్ని పనులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా కేటాయిస్తుంది. అయితే ఈ నిధులతో చేపట్టిన పనులు భూగర్భజలాల పెంపునకు దోహదపడ్డాయని చెప్పడానికి వరుసగా వచ్చిన అవార్డులే సాక్ష్యం. గత చంద్రబాబు హయాంలో ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించుకుని కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, అంగనవాడీ భవనాలు, పాఠశాల, స్మశానాల ప్రహరీలు, తదితర అభివృద్ధి పనులు చేపట్టి శాశ్వత ఆస్తులను సమకూర్చారు. ముఖ్యమంత్రి జగన్‌ మానసపుత్రిక అయిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలను ఉపాధి నిధులతో నిర్మిస్తున్నారు. హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణానికి 50 శాతం ఉపాధి నిధులను వెచ్చించగా మరో 50 శాతం నిధులను వైద్య ఆరోగ్యశాఖ భరిస్తోంది.

కక్ష సాధింపులకు చెక్‌ ..

ఉపాధి హామీ పథకం ద్వారా 254 రకాల పనులు చేపట్టాలని కేంద్రం సూచించింది. కొన్ని రాష్ట్రాలు ఆ నిధులను బాగా సద్వినియోగం చేసుకున్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ నిధుల ద్వారా స్మశాన, పాఠశాలల ప్రహరీ గోడలు, అంగన్‌వాడీ భవనాలు, సిమెంటు- రోడ్లు, క్రీడా మైదానాలు, చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్మాణాలతో పాటు పలు పనులు చేపట్టారు. చంద్రబాబునాయుడు దిగిపోయే నాటికి జిల్లాలో సుమారు రూ.75 కోట్ల మేర బకాయిలు ఉండేవి. జగన్‌ సర్కార్‌ వచ్చిన తరువాత ఆ బిల్లులను నిలిపివేసింది. అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు మొట్టికాయలు వేయడంతో బిల్లులు చెల్లిస్తూ వచ్చారు. దేశంలోని అన్ని జిల్లాలు ఎన్‌ఐసీ సాప్ట్‌వేర్‌ ఉపయోగిస్తుండగా కేవలం మన రాష్ట్రం, తెలంగాణ మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చేసుకున్న సాప్ట్‌వేర్‌ను ఉపయోగిస్తూ వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి పనులపై కేంద్రం దృష్టి సారించడంతో మన రాష్ట్రం కూడా ఎన్‌ఐసీ సాప్ట్‌వేర్‌ పరిధిలోకి వెళ్లింది. గతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన పనులను రాత్రి పూట కేంద్రం రూపొందించిన సాప్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేసేవారు. ఇప్పుడు డైరెక్టుగా ఎంత మంది కూలీలు హాజరయ్యారు, తదితర వివరాలను ఎన్‌ఐసీ పోర్టల్‌లోనే నమోదు చేయాలి. ఉపాధి నిధులతో చేపడుతున్న పనులలో 60 శాతం కూలీల వేతనం కాగా 40 శాతం మాత్రమే మెటీరియల్‌ కాంపౌండ్‌ ఉంటుంది. ఎన్‌ఐసీ సాప్ట్‌వేర్‌లో వివరాలు నమోదు చేయడం వల్ల ఏదైనా పని చేపడితే ఆ పనికి అనుమతి ఉందా, పని పూర్తి అయిందా అనే వివరాలు ఎం బుక్‌లో నమోదు అయితే నిధులు విడుదల అవుతాయి. కూలీల వేతనాలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతాయి.

- Advertisement -

ఇష్టమొచ్చినట్టు పనుల మార్పు కుదరదు..

ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులను ఇక మీదట ఇష్టం వచ్చినట్టు మార్చు కోవడానికి వీలుండదు. ఏ పనులు చేపడుతున్నారో ముందుగానే కేంద్రానికి నివేదిం చాల్సి ఉంటుంది. ఆ పనులను మాత్రమే చేయాలి. అలా కాదని పనులను మార్చుకోవా లంటే మళ్లీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మార్చుకోవాల్సి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement