Monday, April 29, 2024

ఈ నెల 14 వ‌ర‌కు టూరిజం అవార్డుల దరఖాస్తు గడువు పెంపు

అమరావతి, ఆంధ్రప్రభ: : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని రవాణా-పర్యాటక రంగాలకు ఇచ్చే వార్షిక పర్యాటక విశిష్ట పురస్కారాలకు దరఖాస్తు గడవు పెంచారు. పూరించిన దరఖాస్తులను ఈ నెల 14వ తేదీ లోగా పంపాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ కే.కన్నబాబు తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ సంబరాల్లో భాగంగా ఏపీ పర్యాటక శాఖ ఏటా పర్యాటక రంగాల్లో విశిష్ట ప్రతిభ చూపిన వ్యక్తులు, సంస్థలు, ట్రావెల్‌ ఏజెంట్లు, టూర్‌ ఆపరేటర్లు, హోటల్స్‌, ట్రావెల్‌ రచయితలు సహా 40 కేటగిరీల్లో అవార్డులు ప్రదానం చేస్తుంది. ఇందులో భాగంగా 2021-22 వార్షిక ఏడాదికి పర్యాటక రంగ విశిష్ట అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు తొలుత 8వ తేదీ వరకు గడువు ఇచ్చారు.

వివిధ వర్గాల నుంచి అభ్యర్థనల నేపధ్యంలో ఈ నెల 14వ తేదీ వరకు గడువు పొడిగించారు. దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన మార్గదర్శకాలను విజయవాడలోని ఏపీ పర్యాటక ప్రాధికార సంస్థ సీఈవో కార్యాలయంలోను, సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారాను పొందొచ్చని అధికారులు తెలిపారు. పూరించిన దరఖాస్తులను వ్యక్తిగతంగాను, ఆన్‌లైన్‌ ద్వారాను అందజేయవచ్చని పేర్కొన్నారు. సందేహాల నివృత్తికి 9494063888, 9121144077, 9121144099 నంబర్లలో సంప్రదించొచ్చని ఏపీటీఏ సీఈవో కన్నబాబు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement