Sunday, April 28, 2024

AP-TS : తెలంగాణ‌, ఏపీలో ప్రారంభ‌మైన‌ పది పరీక్షలు..

తెలంగాణలో 5.08లక్షల విద్యార్థులు
ఏపీలో 6.23 లక్షల విద్యార్థులు
6,149 కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు
ఆర్టీసీ బస్సులు కళకళ
హైదరాబాద్ రద్దీని తట్టుకుని
పరీక్షలకు బడిపిల్లలు పరుగులే పరుగులు

(ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ / విజయవాడ ప్రతినిధి) : ఏపీ, తెలంగాణలో పదో తరగతి పరీక్షలు సోమవాం ప్రారంభమయ్యాయి. ఈ రెండు రాష్ర్టాల్లో దాదాపు 11.31 లక్షల మంది పది విద్యార్ధులు పరీక్షలకు సిద్ధం కాగా.. అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 6,149 పరీక్ష కేంద్రాల్లో పది విద్యార్థులతో పరీక్షల జాతర షురూ అయింది. అటు పోలీసులు పూర్తి బందోబస్తుతో పహారా కాస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, కార్పొరేట్ విద్యాసంస్థల బస్సులతో పరీక్ష కేంద్రాల్లో సందడి నెలకొంది.

ఏపీలో సందడే సందడి..

6 లక్షల మంది విద్యార్ధులు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు తరలివెళ్లారు. పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. వేసవిని దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల్లో విద్యార్దులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారుల్ని, సిబ్బందిని ఆదేశించింది. అలాగే పదో తరగతి విద్యార్ధులకు హాజరవుతున్న విద్యార్దులకు పలు సూచనలు కూడా చేసింది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులు హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకునే అవకాశం కల్పించారు. ఇలా డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై హెడ్మాస్టర్ల సంతకాలు లేకపోయినా విద్యార్ధులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 3473 కేంద్రాల్లో సోమవారం ఏకకాలంలో పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో 6.23 లక్షల మంది రెగ్యులర్ విద్యార్ధులతో పాటు గతంలో ఫెయిలై పరీక్ష రాస్తున్న మరో లక్ష మంది వరకూ పరీక్షలు రాస్తున్నారు. ఏపీలో 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్ని గుర్తించి సీసీ టీవీ కెమెరా వంటి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. మాల్ ప్రాక్టీస్ ను అరికట్టేందుకు రాష్ట్రంలో తొలిసారిగా పదో తరగతి ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్ ను ముద్రించారు. ఇన్విజిలేటర్లు, విద్యార్ధులు పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లతో పాటు మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకున్నారు.

తెలంగాణ‌లోనూ…

- Advertisement -

టెన్త్ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోగా.. పరీక్షా కేంద్రాలన్నీ జాతరను తలపించాయి. మొత్తం 5,08,385 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరు కానున్నారని అధికారుల అంచనా. మొత్తం 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. ప్రతీ కేంద్రానికి ఒకరు చొప్పున మొత్తం 2,676 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను నియమించారు. ఈ పరీక్షలకు సజావుగా నిర్వహించేందుకు గానూ 30వేల మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా… 5 నిముషాల గండం తప్పించుకునేందుకు తమ పిల్లలను పరీక్ష కేంద్రానికి చేర్చేందుకు తల్లిదండ్రులు నానా ఆందోళనతో ఉరుకులు పరుగులు పెట్టారు. హైదరాబాద్ నగరంలో పది విద్యార్థులు ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు ఉదయం ఆరుగంటలకే పరీక్షలకు బయలుదేరటం విశేషం. ఇక పరీక్షల నిర్వహణను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. పరీక్షల్లో విద్యార్థులు ఎవరైనా కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. వారిని మిగిలిన పరీక్షలు రాయకుండా డిబార్‌ చేస్తామని ప్రకటించారు.

పకడ్బందీ ఏర్పాట్లు…

పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులు, సిబ్బందిపై నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్‌ కేంద్రాలను మూసివేయించారు. విద్యార్థులు సహా, పరీక్షల సిబ్బంది ఎవరూ కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు తీసుకెళ్లడంపై నిషేధం విధించారు. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు హాల్‌ టికెట్‌, ప్యాడ్‌, పెన్‌, పెన్సిల్‌, స్కేల్‌ షార్ప్‌ నర్‌, ఎరేజర్‌, జామెట్రీ- పరికరాలు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement