Thursday, May 2, 2024

Spl Story: ధర్మపీఠంపై తెలుగు తేజం.. నేడు పదవీ విరమణ చేయనున్న ఎన్వీ రమణ

అమరావతి, ఆంధ్రప్రభ : దేశ సర్వోన్నత న్యాయస్థానం అత్యున్నత పదవిలో తెలుగు తేజం ప్రకాశించింది. ఆ వలుగులో న్యాయవ్యవస్థ సరికొత్త కాంతులీనింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రెండో తెలుగు వ్యక్తి దిగ్విజయంగా నేటితో తన పదవీ కాలాన్ని ముగించుకోబోతున్నారు. గతంలో 1966 జూన్‌ 30 నుండి 1967 ఏప్రిల్‌ 11 వరకూ జస్టిస్‌ కోకా సుబ్బారావు ఈ పదవికి వన్నె తెచ్చి తెలుగు ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేశారు. ఆతరువాత మళ్లిd ఇప్పుడు జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ సుప్రీం కోర్టు 48వ న్యాయమూర్తిగా ఏప్రిల్‌ 24న బాధ్యతలు చేపట్టి 16 మాసాలపాటు న్యాయవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి న్యాయ వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించారు. సరికొత్త తీర్పులతో చరిత్ర సృష్టించారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ .. న్యాయ వ్యవస్థకు లోబడి .. పనిచేసి .. తన పదవికి వన్నె తెచ్చారు. ఆయన నేడు (శుక్రవారం) పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం.

కృష్ణా జిల్లాలో జన్మించి :
1957 ఆగస్టు 27న కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో ఒక సాధారణ రైతు నూతలపాటి గణపతిరావు, సరోజిని దంపతుల కుటుంబంలో ఆయన జన్మించారు. తన బాల్య విద్యను అక్కడే అభ్యసించిన ఆయన అమరావతిలోని ఆర్వీఆర్‌ కలేజీలో బీఎస్సీ పూర్తిచేశారు. అనంతరం 1982లో నాగార్జున విశ్వ విద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. 1983 ఫిబ్రవరి 10న బార్‌ అసోసియేషన్‌ లో పేరు నమోదు చేసుకున్నారు. అక్కడి నుండి అంచెలంలచెలుగా ఎదుగుతూ హైకోర్టు న్యాయమూర్తిగా, అనతరం 2000 జూన్‌ 27న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుండి మే 20 వరకూ ఏపీ హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా పనిచేశారు. అదే ఏడాది సెప్టెంబరు 2న పదోన్నతిపై ఢిల్లిd హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు. ఆమరుసటి ఏడాదే అంటే 2014 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇప్పుడు అదే సుప్రీం కోర్టు ప్రధాన న్యామూర్తిగా పనిచేసి పదవీ విమరణ చేస్తున్నారు.

ఎంత ఎదిగినా .. ఒదిగి ఉండే వ్యక్తిత్వంతో :
ఎంత ఎదిగినా ఒదిగుండే మనస్థతత్వం. న్యాయం అడుగంటిపోకుండా ఆయన చెప్పిన చారిత్రాత్మక తీర్పులు ఎన్నో. నాది తెలుగు జాతి.. నేను తెలుగు వాడిని అని ఎంతో సగర్వంగా చెప్పుకున్నారు. విద్యార్ధిగా ప్రగతిశీల భావాలు, న్యాయ వాదిగా లోతైన అధ్యయనం, న్యాయ మూర్తిగా ఆలోచనలో ఘాడత.. ఈ తెలుగు తేజం సొంతం. సామాన్య రైతు కుటుంబం .. సాధారణ జీవితం .. అనితర సాధ్యమైన శ్రమ.. అసాధారణ ప్రతిభ .. న్యాయ వాదిగా .. న్యాయమూర్తిగా .. జస్జిస్‌ ఎన్వీ రమణ ప్రస్థానం సామాన్యుడి విజయకేతనం. సుప్రీం కోర్డు ప్రధాన న్యాయమూర్తిగా పీఠం అధిరోహించేందుకు ఆయన ఎన్నో మైలు రాళ్లను అధిరోహించారు.

సంస్కరణల కోసం పరితపిస్తూ :
సంస్కరణల కోసం నిత్యం పరితపిస్తుంటారు. చిట్టచివరి పేదవాడికి న్యాయం జరగాలన్నది ఆయన లక్ష్యం. అందుకోసం తన పరిధిలో ఎంతో చొరవ తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎంత సాధించినా..సాధారణంగా ఉండేందుకే ఆయన ప్రాధాన్యత నివ్వడం గమనార్హం. న్యాయ వ్యవస్థ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో చొరవ తీసుకునేవారు. ఢిల్లిd హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో అనేక సమస్యలను సుమోటోగా తీసుకుని పరిష్కరించారు. అదనపు కోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా నిర్భయ చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన ఎంతో కృషి చేశారు. న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని గుర్తించి ఢిల్లి హైకోర్టులో ఇ-ఫైలింగ్‌ ప్రారంభించారు.

నేషనల్‌ జ్యుడీషియల్‌ అకడమిక్‌ కౌన్సిల్‌ ద్వారా పేదలకు న్యాయాన్ని చేరువచేశారు. ఆయనకు వాస్తవిక వాదిగా పేరుంది. ప్రతి అంశాన్ని వాస్తవిక కోణంలో చూసి, అర్ధంచేసుకుని పరిష్కరించడమే ఆయన బలంగా సహచర న్యాయవాదులు చెబుతుంటారు. వివేకవంతంగా ఆలోచించే న్యాయమూర్తిగా సుప్రీం కోర్టులో గుర్తింపు తెచ్చుకున్నారు. తనకంటే ముందు తన కుటుంబంలో ఎవరూ న్యాయవాద వృత్తిలో లేకపోయినా..తాను ఈ స్థాయికి చేరుకున్న అంశాన్ని ఆయన ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. కిందనుండి రావడం వల్లే పేదల సమస్యలను లోతుగా అర్ధం చేసుకుంటారని చాలా మంది అభిప్రాయపడతారు. ఆఆలోచనలవల్లే న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలన్న దిశగా ఆయన అడుగులు పడ్డాయి.

- Advertisement -

జోరుగా నియామకాలు
జస్టిస్‌ రమణ సీజేఐ పీఠమెక్కాక ఇప్పటివరకు సుప్రీంకోర్టు కొలీజియం 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు- 250 మందికి పైగా హైకోర్టు జడ్జీలను నియమించింది. 15 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు నియామకాన్ని పూర్తిచేసింది. తద్వారా ఖాళీల భర్తీ విషయంలో జస్టిస్‌ రమణ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆయన నేతృత్వంలో కొలీజియం.. ఖాళీల భర్తీలో సామాజిక, లింగ సమతౌల్యతకు పెద్దపీట వేసింది. గతంలో ఎన్నడూలేనంత ఎక్కువగా సర్వోన్నత న్యాయస్థానంలో మహిళా న్యాయమూర్తులకు అవకాశం కల్పించింది. వారిలో ఒకరు 2027లో తొలి మహిళా సీజేఐగా బాధ్యతలు చేపట్టేందుకు బాటలు వేసింది.

జస్టిస్‌ రమణ చొరవతో వెలువడిన కొన్ని కీలక ఉత్తర్వులు …
దేశాన్ని కుదిపేసిన పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి. రవీంద్రన్‌ నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును పరిరక్షించాలన్న సంకల్పం ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా కనిపించింది. రాజద్రోహ సెక్షను ప్రభుత్వాలు సామాన్యులపై ఇష్టారీతిన ప్రయోగించకుండా గత మే నెలలో సర్వోన్నత న్యాయస్థానంలో మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. సెక్షన్‌ 124ఎని కేంద్ర ప్రభుత్వం పున:సమీక్షించేంతవరకూ దానికింద ఎఫ్‌ఎస్‌ఐర్లు నమోదు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించాలని అందులో ఆదేశించారు. దానికింద పెట్టిన కేసుల కారణంగా జైళ్లలో మగ్గుతున్నవారు బెయిలు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని స్పష్టతనిచ్చారు. సెక్షన్‌ 124ఎ కింద పెండింగ్లో ఉన్న విచారణలు, అప్పీళ్లు, నమోదుచేసిన అభియోగాలన్నింటినీ నిలిపివేయడం ద్వారా ప్రజల స్వేచ్ఛకు పట్టం కట్టారు.

కోర్టులు బెయిలు మంజూరు చేసినా.. ఆ ఉత్తర్వులు అందలేదన్న కారణంతో ఖైదీల విడుదలలో తాత్సారాన్ని నివారించడానికి ఫాస్టర్‌ పేరుతో సురక్షితమైన ఎలక్ట్రాన్రిక్‌ వ్యవస్థను అందుబాటు-లోకి తెచ్చి దీర్ఘకాల సమస్యకు తెరదించారు.
కఠినమైన యూఏపీఏ చట్టం కింద అరెస్టయిన ఓ కేరళ పాత్రికేయుడికి దిల్లీలో వైద్య సేవలు అందించాలని జస్టిస్‌ రమణ ఆదేశించారు. విచారణలో ఉన్నవారికి కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉంటు-ందని స్పష్టం చేశారు.

ఝార్ఖండ్‌ ధన్బాద్‌ అదనపు జిల్లా జడ్జి ఉత్తమ్‌ ఆనంద్ను పట్టపగలు ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటనను సుమోటోగా తీసుకొని సీబీఐ దర్యాప్తునకు సీజేఐ జస్టిస్‌ రమణ ఆదేశించారు. ఆ దారుణానికి పాల్పడినవారికి ఏడాది కంటే తక్కువ సమయంలోనే శిక్ష ఖరారయ్యేలా చేశారు. తద్వారా న్యాయవ్యవస్థలోని వ్యక్తుల్లో ధైర్యం నింపారు.
శివసేన చీలిక కేసును రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించి.. న్యాయం చేయడంలో పొరపాట్లను పరిహరించేందుకు ప్రయత్నించారు.

కరోనా సమయంలో జస్టిస్‌ రమణ ఓ కేసును సుమోటోగా తీసుకొని ఆక్సిజన్‌ సరఫరా, టీ-కా ధరల విషయంలో జోక్యం చేసుకున్నారు. ఫలితంగా ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకొని 18 ఏళ్ల వయసు దాటినవారందరికీ ఉచిత వ్యాక్సిన్ను ప్రకటించాల్సి వచ్చింది. ఆ సమయంలో కోర్టు జోక్యాన్ని మెచ్చుకుంటూ కేరళకు చెందిన లిడ్వినా జోసెఫ్‌ అనే 5వ తరగతి బాలిక సీజేఐకి లేఖ రాయడం.. ఆయన హయాంలో సామాన్యులపై సుప్రీంకోర్టు పనితీరు చూపిన ప్రభావానికి అద్దంపట్టింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన వైష్ణవి అనే 8వ తరగతి అమ్మాయి తమ ఊరికి బస్సు కోసం సీజేఐ జస్టిస్‌ రమణకు లేఖ రాయడం కూడా ఆయన పనితీరు సామాన్యుల్లోకి వెళ్లిందని చెప్పేందుకు నిదర్శనం.

మౌలిక వసతులకు ప్రాధాన్యం
జస్టిస్‌ రమణ న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనకు బాగా ప్రాధాన్యమిచ్చారు. జమ్మూకశ్మీర్‌ లో రూ. 310 కోట్లతో కొత్త కోర్టు భవన నిర్మాణానికి పునాదిరాయి వేశారు. తెలంగాణలో 32 జిల్లా కోర్టులను ప్రారంభించారు. తిరుపతిలో ఎర్రచందనం కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులకు శ్రీకారం చుట్టారు. విజయవాడలో రూ.100 కోట్లతో నిర్మించిన కొత్త కోర్టు సముదాయాన్ని ప్రారంభించారు. ఝార్ఖండ్‌ రెండు జిల్లాల్లో సబ్డివిజన్‌ కోర్టులను ప్రారంభించారు. ఇవన్నీ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆయన చేసిన కృషికి కొన్ని ఉదాహరణలే.

తెలుగు రాష్ట్రాలకు సహకారం
జస్టిస్‌ రమణ తెలుగు రాష్ట్రాలకు తనవంతు సహకారం అందిస్తూనే ఉన్నారు. హైదరాబాద్లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఆయన ఏర్పాటు-చేశారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 37కు మించి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ సంఖ్య అక్కడే నిలిచిపోయినట్లు ఇటీవల పార్లమెంటు-లో కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజూ ఇచ్చిన సమాధానం ద్వారా వెల్లడైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement