Sunday, April 28, 2024

‘డిజిటల్ మహానాడు-2021’.. ఈ ఏడాది కూడా ఆన్‌లైన్‌లోనే!

ఈ ఏడాది కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు ఆన్‌ లైన్‌ లోనే జరగనుంది. ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం లో నిర్ణయించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారా వు జయంతి సందర్భంగా మే 28వ తేదీ కలిసివచ్చేలా మహానాడును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా కారణంగా గతేడాది ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈసారీ కరోనా ఉధృతి కారణంగా అదే విధానాన్ని పాటించాలని నిర్ణయించారు. పార్టీ ప్రతినిధులు ఎవరి ఇంట్లో వారు ఉండి ఇందులో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడెనిమిది వేల మంది వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేలా అదనపు అనుమతులు తీసుకోవాలని నిశ్చయించారు. ప్రతి రోజూ నాలుగు గంటల చొప్పున రెండు రోజుల్లో కలిపి ఎనిమిది గంటలపాటు దీనిని నిర్వహిస్తారు. 

డిజిటల్ మహానాడు-2021ను తెలుగుదేశం శ్రేణులంతా కలసికట్టుగా విజయవంతం చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా నాయకులు, కార్యకర్తలకు డిజిటల్ ఆహ్వానం పంపారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతిఏటా మహానాడు జరుపుకోవటం ఆనవాయితీ అన్న చంద్రబాబు… టీడీపీ కార్యకలాపాలను, భవిష్యత్ కార్యక్రమాలకు ఈ వేడుక ద్వారా మార్గనిర్దేశనం చేసుకుంటామని చెప్పారు.

మహోత్సవంలా జరగాల్సిన మహానాడును కరోనా కారణంగా ఈసారీ డిజిటల్ వేదికగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మే 27, 28 తేదీలలో ఆన్​లైన్​లో జరిగే డిజిటల్ మహానాడు 2021లో కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం, రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు, స్కాములు తదితర అంశాలపై తీర్మానం చేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement