Saturday, December 7, 2024

జగన్ రెడ్డి ఓ అమూల్ బేబీ: నారా లోకేష్

లక్ష కోట్లు దోపిడీ చేసి జైలుకెళ్లిన జగన్ రెడ్డి కక్షతో తెలుగుదేశం నేతల్ని జైలుకు పంపుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సంగం డైయిరీ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై విడుదలైన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను ఆయన ఇంటికెళ్లి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి ఓ అమూల్ బేబీ అంటూ వ్యాఖ్యానించారు. కొందరు అధికారులు చట్టాల్ని ఉల్లంఘించి పని చేస్తున్నారని. వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం అని హెచ్చరించారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.

రైతుల్ని పరామర్శించడానికి వెళితే ట్రాక్టర్ రాష్ డ్రైవింగ్ కేసు తనపై పెట్టారని గుర్తు చేశారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని భయపడుతూ బతికేది మంత్రులేనని అన్నారు. ధూళిపాళ్ల పాడి రైతులకు రూ.4 ఎక్కువ ఇవ్వటం, ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందించటం తప్పా అని ప్రశ్నించారు. దశాబ్దాల నుంచి రైతు ప్రయోజనాల కోసం పని చేస్తున్న సంగం డెయిరీ పై కక్ష సాధింపు దుర్మార్గం అని పేర్కొన్నారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ జగన్ రెడ్డి చేసిన కుట్రను స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా నరేంద్ర బయటపెట్టారని తెలిపారు. అమూల్ డైయిరీ కోసం ప్రజా ధనం ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో డైయిరీలన్నీ గుజరాత్ కు కట్టబెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

అమూల్ డెయిరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 3 వేల కోట్లు ప్రజాధనం వృధా చేస్తుందన్నారు. అసలు, వడ్డీ కలిపి ఏడాదికి 500 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందన్నారు. ప్రజలు చనిపోతుంటే పట్టించుకోని దద్దమ్మ జగన్ రెడ్డి కక్ష సాధింపులకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జగన్మోహన్ రెడ్డి పెట్టిన అక్రమ కేసుల లిస్టు చాలా పెద్దదన్నారు. రాష్ట్ర ఆస్తులను గుజరాత్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి ఓ శాడిస్టు రెడ్డి అని అన్నారు. ప్రజల పక్షాన పోరాడే సొంత ఎంపీని కొట్టించిన శాడిస్టు అని వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు కూడా భయపడి కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కక్షసాధింపు పక్కన పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని నారా లోకేష్ హితవు పలికారు.

కాగా, సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో అరెస్ట్ అయిన ధూళిపాళ్ల నిన్న సాయంత్రం బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement