Wednesday, May 1, 2024

Tirupati: టాస్క్ ఫోర్స్ దాడులు.. 20మంది ఎర్రదొంగల అరెస్టు

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ నిర్వాహించిన దాడుల్లో 20మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం  చేసుకున్నట్లు టాస్క్ ఫోర్సు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సంబంధిత వివరాలు తెలియచేసారు. ఆర్ఐ కే.సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ముగ్గురు ఆర్ఎస్ఐలు సురేష్ బాబు, వై.విశ్వనాథ్, కేఎస్కే. లింగాధర్ టీమ్ లు మూడు ప్రాంతాలలో కూంబింగ్ చేపట్టారు. ఒక టీమ్ అన్నమయ్య జిల్లా తుమ్మలబైలు సెక్షన్ చాకిరేవు కోసం సమీపంలో అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు.

మరో టీమ్ అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజి ఫింఛా సెక్షన్ దిన్నెల ఫారెస్టు బీటు, చిట్టికురవ రాస్తా కోన సమీపంలోని నిషేధిత అటవీ ప్రాంతానికి వెళ్లారు. మూడవ టీమ్ తిరుపతి జిల్లా నాగపట్ల సెక్షన్లోని తిరుపతి పీలేరు రోడ్డులో గల వెంకట పద్మావతీ ఇనిస్టిట్యూట్ కళాశాల ఎదరుగా ఉన్న అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఆ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఎర్రచందనం  దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. వారిని మూడు వైపుల నుంచి టాస్క్ ఫోర్సు టీమ్ లు చుట్టుముట్టి అరెస్టు చేయగలిగారు.

అరెస్ట్ అయిన 20మందిలో తమిళనాడు వేలూరు జిల్లా ఆనైకట్టు తాలూకాకు చెందిన రమేష్ (42), సురేష్ సాంబశివం (38), నవీన్ వెంకటేశన్ (23), సెంగోదరన్ మునిస్వామి (29), తిరువన్నామలై జమునామత్తూరుకు చెందిన కొళందై చిన్నపయ్యన్ (50), కల్లకురిచ్చి జిల్లాకు చెందిన ఏలుమలై (33), సామికన్ను పచ్చయ్యన్ (37), గణేశన్ పిచ్చన్ (28), అనంతరామన్ (19), అన్బు పచ్చన్ (40), అళగేషన్ కుమారస్వామి (36), సెంథిల్ రామన్ (30), తిరుపత్తూరు జిల్లాకు చెందిన వెంకటేశన్ కాళి (34), రంగనాథన్ పెరుమాళ్ (39), అదే జిల్లా ఆంబూరు తాలూకాకు చెందిన మురళి మురుగన్ (24), ఎల్లియన్ (57), వేలు రత్నం (36), ముత్తురామన్ చిన్నపయ్యన్ (40), దామోదరం రాజా (46), సత్యవేలు రత్నం (27) లుగా గుర్తించినట్లు తెలిపారు.

- Advertisement -

వీరిని అరెస్టు చేసి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ కేసులను సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ చెరుకూరి షఫీ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరి కొంతమంది అడవుల్లో ఉన్నారని సమాచారం అందుకోవడంతో, మరికొన్ని బలగాలు అడవిలో కూంబింగ్ చేపడుతున్నాయని తెలిపారు. పట్టుబడిన వారి నుంచి ఒక మోటార్ సైకిల్ తో పాటు 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.50లక్షల వరకు ఉంటుందని ప్రాధమికంగా అంచనా వేసినట్టు డీఎస్పీ మురళిధర్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement