Monday, April 29, 2024

Delhi | అవినాష్ రెడ్డి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (వైఎస్సార్సీపీ)తో పాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ డా. సునీత నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్ట్ వెకేషన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే కేసు తదుపరి విచారణను భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయిస్తుందని చెబుతూ కేసు విచారణను జులై 3కు వాయిదా వేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక అంశాలను పరిగణలోకి తీసుకోకుండా తీర్పునిచ్చిందని పేర్కొంటూ వివేకానంద రెడ్డి కుమార్తె డా. సునీత నర్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థ లేవనెత్తాల్సిన అభ్యంతరాలను సునీత లేవనెత్తుతున్నారని వెకేషన్ బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థకు నోటీసులిచ్చి వారి వాదనలు కూడా వినాల్సిందిగా డా. సునీత స్వయంగా వాదనలు వినిపించారు. తాజాగా సోమవారం నాటి విచారణలో ధర్మాసనం ప్రతివాదులిద్దరికీ నోటీసులిస్తూ సునీత పిటిషన్‍‌లో లేవనెత్తిన అంశాలకు బదులివ్వాల్సిందిగా ఆదేశించింది. సునీత దాఖలు చేసిన పిటిషన్‌లో తెలంగాణ హైకోర్టు తీర్పును తప్పుబడుతూ అనేకాంశాలు పొందుపరిచారు.

అత్యున్నత న్యాయస్థానం చెప్పిన అంశాలకు విరుద్ధంగా అవినాష్ రెడ్డికి హత్య కేసులో ముందస్తు బెయిల్ మంజూరైందని పేర్కొన్నారు. సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదని, చివరి మూడు సమన్లను కూడా ఆయన బేఖాతరు చేస్తూ విచారణకు హాజరుకాలేదని తెలిపారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తల్లి అనారోగ్యంతో ఉందనే కారణాలు చూపి ఆస్పత్రిలో షెల్టర్ తీసుకున్నారని కూడా ఆరోపణలు గుప్పించారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టుకు సెలవులు కొనసాగుతున్నందున దీనిపై రెగ్యులర్ బెంచ్ విచారణ చేపట్టాలని వెకేషన్ బెంచ్ భావించింది. ఈ పరిస్థితుల్లో కేసు విచారణను సెలవుల అనంతరం ప్రారంభమయ్యే రెగ్యులర్ బెంచ్‌లకు బదిలీ చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణపై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement