Sunday, April 28, 2024

Stones Attack – మంత్రి ర‌జ‌నీ కార్యాలయంపై రాళ్ల దాడి…టిడిపి,జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అరెస్ట్ ..

గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై గ‌త అర్ధ‌రాత్రి టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడులు చేశారు. కొత్తగా నిర్మించిన ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. మంత్రి విడదల రజనిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఆన్ఛార్జీగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె గుంటూరులోని విద్యానగర్ లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొత్త సంవ‌త్స‌రం రోజున కార్యాలయం ప్రారంభోత్సవం కావాల్సి ఉంది. అయితే, అర్ధరాత్రి రఈ కార్యాలయంపై టీడీపీ – జనసేన కార్యకర్తలు దాడి చేశారు.
కాగా, రజని కార్యాలయానికి సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ, జనసేన కార్యకర్తలు రాత్రి పాలాభిషేకం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సమయంలో కొందరు ఆఫీసుపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఆఫీసు అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని, లాఠీఛార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. కొందరు టీడీపీ, జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి విడదల రజిని సోమవారం ఉదయం పార్టీ ఆఫీసు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మీడియాతో మాట్లాడుతూ.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బీసీ మహిళనైన నన్ను దాడులతో భయపెట్టలేరు. ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన దాడి. రాళ్లు తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇదంతా చేస్తున్నారు. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోండి. ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ప్రజలు మద్దతు ఉన్నంత వరకూ ఎదుర్కొంటాం. ఈ ఘటన వెనుక ఉన్న వారికీ గుణపాఠం చెబుతాం. చంద్రబాబు, నారా లోకేష్‌కు బీసీలపై కపట ప్రేమ. బీసీ మహిళా మంత్రిగా ఉన్న నా కార్యాలయంపైనే దాడి చేశారు. బీసీలంటే ఎంత చిన్న చూపో అర్థం అవుతుంది. పక్కా ప్రణాళికతో ఇలా దాడి చేశారు. లాఠీఛార్జ్ చేసినప్పటికి దాడి కొనసాగించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై ఎమ్మెల్యే మద్దాలి గిరి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించు​కోవడాన్ని ఎల్లో బ్యాచ్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఒకవైపు జయహో బీసీ అంటారు.. మరొకవైపు బీసీ మంత్రుల ఆఫీసులపై రాళ్లు రువ్వుతారు. గుంటూరులో ఆఫీసులపైన దాడి చేసే సంస్కృతి ఇప్పటి వరకు లేదు. తాము అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులుంటాయో రాత్రి ఘటనతోనే ప్రజలకు చెప్పారు. బీసీ మహిళ పోటీ చేయకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి అని కామెంట్స్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement