Sunday, April 28, 2024

Special Story – గేమ్​ చేంజర్​!.. షర్మిల పక్కా ప్లాన్

పుట్టినింటి నుంచే ఆట ప్రారంభం
సీనియర్లను చేర్చుకునే యత్నాలు
దూకుడు పెంచి.. స్పీడందుకున్న వ్యూహాలు
వివేకా కుటుంబాన్ని రంగంలోకి దించే యత్నం
సీనియర్లను ఆకర్షిస్తూ కేడర్​లో జోష్‌
చేరికలతో వ్యూహాత్మక అడుగులు

( కడప, ప్రభన్యూస్ బ్యూరో ) పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతల స్వీకరణతో కడప జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఆమె జిల్లా పర్యటన జోష్ నింపింది. ఆమె ప్రభావం కపడ జిల్లాపై ఏ మేరకు ఉంటుంది?, గతంలో పార్టీ వీడిన నేతలు తిరిగి వస్తారా?.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి వ్యూహాలను అమలు చేస్తారు? ఉనికి చాటుతారా? అంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. కానీ, మాజీ మంత్రి అహమదుల్లాను కాంగ్రెస్ లో చేర్చుకొని ఆమె స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మరికొందరు నేతలు అహమదుల్లా బాటలోనే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర విభ‌జ‌న‌తో కాంగ్రెస్‌కు తీవ్ర న‌ష్టం..
రాష్ట్రంలో పూర్తిగా డీలాపడిన కాంగ్రెస్ పార్టీ షర్మిల చేరికతో పుంజుకుంటుందనే ఆశాభావం ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ప్రస్తుత సీఎం జగన్‌కు సోదరి కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధానంగా ఆమె చేరిక కడప జిల్లాలో ఎటువంటి రాజకీయ సమీకరణలకు దారితీస్తుందోనని చ‌ర్చ ఊపందుకుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో దేధీప్యమనంగా వెలుగొందింది. పలువురు నేతలు రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందారు. కానీ, వైఎఎస్సార్‌ అకాల మరణం, ఆయన తనయుడు జగన్ వైసీసీ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేయడం.. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించడంతో కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో పూర్తిగా నష్టపోయింది. కార్యకర్తలు సైతం ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు. అప్పటివరకు కాంగ్రెస్‌లోని మెజారిటీ నేతలు అందరూ జగన్ వెంట వైసీపీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ ఖాళీ అయింది. ఆ పార్టీని వైసీపీ పూర్తిగా ఆక్రమించింది.

కోలుకోలేని స్థితిలో కాంగ్రెస్‌..
2014, 19 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం నేటికీ కోలుకోలేక పోతోంది. ఆ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ వచ్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటింగ్ శాతం చూస్తే ఆ పార్టీ ఉనికి ఎంత దయనీయంగా మారిందో ఊహించవచ్చు. ఇప్పటికీ జిల్లా, నియోజకవర్గ స్థాయిలో బలమైన నాయకత్వం లేదు. చెప్పుకోదగ్గ నేతలే కరువయ్యారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆమె పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడంతో తిరిగి పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని జిల్లా నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టే ఆమె అడుగులు పడుతున్నాయి.

పార్టీపై ఆసక్తి చూపని లీడర్లు..
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్​పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజల ముందుకు వెళ్లలేక కొంతమంది సీనియర్ నేతలు తటస్థంగా ఉండిపోయారు. ఫలితంగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాలేదు. కడప జిల్లాలో పార్టీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. తులసీరెడ్డి వంటి ఒకరిద్దరు నేతలు మినహా కాంగ్రెస్ నేతలంతా ఎవరి దారి వారుచూసుకున్నారు. కేవలం ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు మాత్రమే కొనసాగుతూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు కీలక నాయకులు ఆసక్తి చూపలేదు. పోటీ చేసిన అభ్యర్థులకు కూడా నోట కంటే కూడా తక్కువ ఓట్లు నమోదు అయ్యాయి.

- Advertisement -

నోటా కంటే తక్కువ ఓట్లు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానానికి గుండ్లకుంట శ్రీరాములు పోటీ చేయగా 8341 ఓట్లతో 0.68 శాతం సాధించారు. కడప అసెంబ్లీ స్థానం నుంచి నజీర్ అహ్మద్ 1.12 శాతంతో 1863 ఓట్లు సాధించారు. ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానం నుంచి గొర్రె శ్రీనివాసులు పోటీచేసి 1.35 శాతంతో 2454 ఓట్లు, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి వెన్నపూస సులోచన పోటీ చేసి 0.28 శాతంతో కేవలం 570 ఓట్లు మాత్రమే సాధించారు. కమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేసి 1.26 శాతంతో 1997 ఓట్లు సాధించారు. మైదుకూరు నియోజకవర్గం నుంచి కే. మల్లికార్జున మూర్తి పోటీ చేసి 2.14 శాతంతో 3617 ఓట్లు, బద్వేల్ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేసి 1.49 శాతంతో 2337 ఓట్లు, పులివెందుల నియోజకవర్గం నుంచి వి.శ్రీనివాసరెడ్డి పోటీ చేసి 0.68 శాతంతో 1230 ఓట్లు సాధించారు.

కాంగ్రెస్​ పరిస్థితి దయనీయం..
ఈ ఓట్ల లెక్కలను చూస్తేనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జిల్లాలో ఎంత దయనీయంగా మారిందో ఊహించవచ్చు. కేవలం ద్వితీయ నాయకులు మాత్రమే ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్నారు. వారిలో కాస్త ఉత్సాహంగా ఉన్న నేతలకు విభాగాల పదవులు కట్టబెట్టి పార్టీని నడిపిస్తున్నారు. షర్మిల రాకతో వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఏం మేరకు పెరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. షర్మిల చీల్చే ఓట్ల పైనే అధికార వైకాపా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

బాబాయ్ కుటుంబానికి గాలం

షర్మిలకు జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమెకు జిల్లా రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది. చాలామంది మాజీ కాంగ్రెస్ నేతలతో నేరుగా పరిచయం ఉంది. పీసీసీ బాధ్యతలు చేపట్టిన ఆమె వెంట నడిచేందుకు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. పార్టీని వీడిన ముఖ్య నేతల నిర్ణయం ఎలా ఉన్నా.. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కానీ జిల్లాలో పూర్తిగా చచ్చుబడిపోయిన కాంగ్రెస్ కు జవసత్వాలు నింపాలంటే అంతకుమించి వ్యూహాలకు పదును పెట్టాలని షర్మిల నిర్ణయించారు. అందులో భాగంగానే బాబాయ్, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు యత్నిస్తున్నారు. ఇటీవల కడప పర్యటనకు వచ్చిన షర్మిల వివేక కుమార్తె సునీతతో చర్చించినట్లు సమాచారం. సునీత లేదా వివేక సతీమణి సౌభాగ్యమ్మను కడపలో పోటీకి దింపేందుకు షర్మిల యత్నించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి డియల్. రవీంద్రారెడ్డి తోనూ ఆమె నేరుగా చర్చించారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఆమె కోరారు. ఈ భేటీలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సీనియర్లతో చర్చలు?

షర్మిల ఇడుపులపాయ సందర్శన నేపథ్యంలో మాజీ మంత్రి అహమదుల్లా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు షర్మిల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈయన వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడుగా మెలిగారు. వైఎస్ మరణం, రాష్ట్ర విభజన నేపథ్యంలో అహమ్మదుల్లా కాంగ్రెస్ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం షర్మిల నాయకత్వంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. అదేవిధంగా బద్వేలు తెలుగుదేశం నాయకురాలుగా గుర్తింపు పొందిన విజయ జ్యోతి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే రత్న సభాపతి తనయుడు బండారు నటరాజ్, సంఘ సేవకులు మౌలాలి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొందరితో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. జిల్లా సీనియర్ నేతలు వేచి చూసే ధోరణితో వివరిస్తున్నారు.

ఆది నుంచే దూకుడు

పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే దూకుడుగా వ్యవహరించాలని షర్మిల నిర్ణయించారు. పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తూనే పీసీసీ చీఫ్ గా ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని ఆమె డిసైడ్ అయ్యారు. తన లక్ష్యం ఏంటో నిర్ణయించుకున్న షర్మిల వ్యూహాత్మకంగా అడుగులకు సిద్దమయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, రైల్వే జోన్‌, రాజధాని నిర్మాణం సహా అన్ని విభజన హామీల అమలు కాంగ్రెస్ తోనే సాధ్యమంటూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. వైసీపీ, టీడీపీ పార్టీలు బీజేపీతో కలవటం పైన ప్రధానంగా ప్రస్తావిస్తూ ముందుకెళ్తున్నారు. ప్రత్యేక హోదా పైన శుక్రవారం ఢిల్లీ వేదికగా దీక్షలు చేపట్టారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని షర్మిల ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.ఏది ఏమైనా సొంత జిల్లా కడప పై షర్మిల ఎటువంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement