Monday, April 29, 2024

Smart Story – ఆపరేషన్​ కోవర్ట్​! పార్టీల స్ట్రాటజీలన్నీ లీక్​

రాజకీయాల్లో నయా కట్టప్పలు
సొంత పార్టీలోనే కోవర్టులు
గుట్టు రట్టులో లీకు ధీరులు
అంతర్గత సమాచార బయటికి
ప్రత్యర్థులకు అందించే ఏర్పాట్లు
రాజకీయ దళారుల నయా యజ్ఞం
విలవిల్లాడుతున్న అభ్యర్థులు
ఇదీ ఎలక్షణంలోని విలక్షణం

ఎదుటోడి ఇంటి గుట్టు చోరీకి నిగూఢ కోవర్టులున్నారు. ఇప్పుడంతా లీకు వీరుల ప్రయోగం జరుగుతోంది. ఆ కోవర్టులే కట్టప్పలై వెన్నుపోటుకు రెడీ అయిపోయారు. ఆ లీకు గ్యాంగే అపర దుశ్శాసన అవతారంలో దస్త్రాపహరణం చేస్తోంది. ఔను ఎలక్షన్లు వస్తున్నాయ్.. ఎమ్మెల్యేగా గెలవాలంటే మంది మార్బాలం కావాలి. శత్రువు అభేద్య కోటను ఛిద్రం చేయాలంటే రహస్య మంతనాలు తప్పవు. అందుకే నోట్ల కట్టప్పలను పట్టుకుని ఎదుటోడి గూటికి కన్నం వేసే వ్యూహం పన్నుతున్నారు.

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – ఎన్నికల నోటిఫికేషన్​ పలకరించ లేదు. అప్పుడే వెన్నుపొట్లకు రెడీ అంటున్నారు కొంతమంది లీడర్లు. ఎన్నికలాట ఆడుకుందాం అని గోదాలోకి దిగిన వివిధ రాజకీయపార్టీల నేతలకు కోవర్టుల ప్రమాదం పొంచిఉన్నట్టు తెలుస్తోంది. తాడేపల్లి దర్బారులో కీలక సమాచారం చోరీ నుంచి.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పసుపుకోటలో రహస్య మంత్రాంగం వరకూ సమాచారం లీకు అవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థుల కదలికలపై సమాచారం సేకరణకు కోవర్టులు, లీకు వీరులను సర్వేగ్రేశరులుగా అభ్యర్థుల నియామకల జాతర జరుగుతోంది.

ప్రత్యర్థి పార్టీలోని కొంతమంది కరుడు గట్టిన కట్టప్పలను తమ వేగులుగా నియమించి అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే క్రతువును ప్రారంభించారు. ఈ కబురుతో ప్రతి వ్యూహాలు పన్ని ప్రత్యర్థి పార్టీని దెబ్బతీయాలన్నది కొంతమంది లీడర్ల కోరికగా తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ముఖ్య నేతతో పాటు, ఇంకొంత మంది కదలికలను తెలుసుకుంటూ ఈ కోవర్టులు ప్రత్యర్థి శిబిరానికి సమాచారాన్ని అందిస్తున్నారు. కొంతమంది తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రత్యర్థి పార్టీ నేతలతో చేతులు కలిపి ప్రస్తుతం ఉన్న పార్టీకి, తమ నేతలకు వెన్నుపోటు పొడుస్తున్నారు. దీంతో తమ రహస్యాలను ప్రత్యర్థి పార్టీకి ఎవరు ఎవరు చేరవేస్తున్నారో తెలియక నేతలు కుమిలి కుమిలి తల్లడిల్లుతున్నారు. ఫలితంగా తమ చుట్టూ ఉన్న కంచెలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయ పరిస్థితిలో పలు నియోజకవర్గాల్లో కొంతమంది అభ్యర్థులు ఉన్నారు.

రెండు వైపులా ఉపయోగం..

ఆర్థిక ప్రయోజనాలు, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గెలిస్తే అక్కడ కూడా చక్రం తిప్పొచ్చని భావిస్తున్న కొంతమంది రాజకీయ దళారులు ఇలా కోవర్టులుగా మారుతున్నారు. పార్టీ పటిష్టత, ఎత్తుగడల్లో భాగంగా ఇటీవల కాలంలో ప్రధాన పార్టీలు వలసలను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిగో వైపీపీ నుంచి టీడీపీలోకి భారీగా కార్యకర్తల చేరిక… చూశారా? వైసీపీ కోటకు జనసైనికులు కదం తొక్కి సాహో అన్నారు. అబ్బో పసుపు కోటకు వైసీపీ కార్యకర్తల పరవళ్లు. అక్కడ 100 మంది చేరితే… ఇక్కడ 150 మంది జత కట్టారు. ఇక్కడ 200 మంది ర్యాలీగా పార్టీలో చేరితే.. అక్కడ ఏకంగా 500 మంది కార్లల్లో వచ్చి పార్టీ కండువాలు కప్పుకున్నారట. ఈ కథలన్నిటికీ సూత్రధారులు, పాత్రదారులు కట్టప్పలే. నిన్నటి వరకూ మహానేత, జనహృదయ నేత అని కీర్తించినోళ్లే.. చీ ప్రజాద్రోహి, నిలువెత్తు దోపిడీ దొంగ అని తిట్లదండకం అందుకుంటున్నారంటే అంతా ఈ లీకు బాబుల వ్యవహరంగానే తెలుస్తోంది.

- Advertisement -

అదే పనిగా.. పార్టీల్లో చేరికలు

సహజ నటచక్రవర్తులుగా ఈ పాత్రలు పోషించటానికి.. ఇదే అదునుగా క్రియాశీలక పాత్రల్లో వలసపక్షుల రూపంలో ఇతర పార్టీల్లోకి ప్రవేశించడం, ఇతర పార్టీల ముఖ్య అనుచరులతో టచ్​లో ఉంటూ పార్టీ అంతర్గత వ్యవహారాలను బట్టబయలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకు వెళ్లే క్రమంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం ముఖ్య నేతలకు కత్తి మీద సాములా మారింది. ఆయా పార్టీల్లో దీని ప్రభావంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో నేతల భవితవ్యంపై నీలి నీడల కమ్ముకునే ప్రమాదం ఉంది.

ఇంటర్నల్​ చర్చలు కూడా బయటికి..

ఇదిలా ఉండగా అధికార, ప్రతిపక్ష పార్టీలకి చెందిన నేతల అంతర్గత సమావేశపు వివరాలు సైతం ఇటీవల బట్టబయలవుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే కోవర్టుల వ్యవహారశైలి ఎంత బలంగా పనిచేస్తుందో అర్థమవుతుంది. రాజకీయంగా అధికార ప్రతిపక్ష సభ్యులు బహిరంగ పోటీకి సిద్ధమై కాలు దువ్వుతుంటే.. నమ్మకం ముసుగులో కొంతమంది ఈ దగుల్బాజీ తనానికి పాల్పడుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులను మోసం చేస్తున్నారు. తమ పబ్బం గడుపుకుంటున్నారు. దీంతో రాజకీయ దళారులను ప్రతి ఒక్కరూ దూరంగా ఉంచాలనే వాదన తెరపైకి వస్తోంది. ప్రతీ విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని, లేకుంటే గెలుపు ఓటములు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement