Saturday, February 17, 2024

Smart Special – ఉరుముతున్నఉత్త‌రాంధ్ర‌! క్యూ క‌డుతున్న లీడ‌ర్లు

ఆంధ్రప్రభ స్మార్ట్, – ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణంలో రాజకీయ పోరుకు ప్రధాన పార్టీలు సిద్ధపడుతున్నాయి. ఉత్తరాంధ్ర మాదంటే మాది అని లీడ‌ర్లు గోలగోల చేస్తున్నారు. అధికార వైసీపీ పూర్తిగా ఉత్తరాంధ్రనే నమ్ముకోగా. సీఎం జగన్ గత నెల చివరిలోనే విశాఖజిల్లా బీమిలిలో యుద్ధానికి సిద్ధం అంటూ తొలిసారి శంఖారావం పూరించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా అంటూ ఇటీవల ఉత్తరాంధ్ర జిల్లాలో గొంతెత్తారు. జనసేన కూడా ఇటువైపే చూస్తోంది. జనసేన కీలక నేత‌ నాగబాబు నాలుగైదు రోజులుగా విశాఖ జిల్లాలో పర్యటించి పార్టీ సమీక్షలు నిర్వహించారు. సభలు సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీక‌రించిన‌ షర్మిల కూడా ఇచ్చాపురం నుంచే తన రాజకీయ ప్ర‌యాణాన్ని మొదలెట్టారు. ఆమె తొలి విడతలో మూడు ఉమ్మడి జిల్లాల్లో తిరిగి కాంగ్రెస్‌లో కదలిక తీసుకువచ్చారు. ఇక.. తాజాగా మరోసారి ఏజెన్సీ జిల్లా పాడేరు, నర్సీపట్నంలో పర్యటించారు. రచ్చబండ కార్యక్రమాలని చేప‌ట్టారు. ఇప్పుడు టీడీపీ నేత‌ లోకేష్ వంతు వ‌చ్చింది. శంఖారావం పేరుతో ఇచ్చాపురం నుంచి సభలను నిర్వహిస్తున్నారు. ఆయన ఉత్తరాంధ్రలోని మొత్తం ఉమ్మడి మూడు జిల్లాల్లో పదుల సంఖ్యలో సభలు నిర్వ‌హించేందుకు ప్లాన్ చేశారు.

పార్టీలన్నీ నమో నమః

ఇంతకీ ప్రధాన రాజకీయ పార్టీల రథులు, అతిరథులు, మహారథులంతా ఉత్తరాంధ్ర దిక్కులో… ఉరుకులు పరుగులకు కారణమేంటీ? ఎందుకంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలున్నాయి. అంటే.. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఇవి అయిదో వంతు అన్న మాట. శాసనసభ సీట్ల సంఖ్యలో 20 శాతం స్థానాలు ఉత్తరాంధ్రాలోనే ఉన్నాయి. అధికారానికి మేజిక్ ఫిగర్ 88 సీట్లు కాగా ఇందులో 40 శాతం స్థానాలు ఇక్కడ ఉన్నాయి. అందుకే ఉత్తరాంధ్రా సీట్లల్లో అన్ని రాజకీయ పార్టీలకూ ఆధిపత్యం కావాలి. పైగా ఇక్కడ జనాలు ఎపుడూ వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఏకపక్షంగా తీర్పు ఇస్తారు.

అప్ప‌ట్లో బాబువైపు.. త‌ర్వాత జ‌గ‌న్‌వైపు..

2004 నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. రెండు సార్లు కాంగ్రెస్ కి మెజారిటీ సీట్లు కట్టబెట్టి ఉమ్మడి ఏపీలో అధికారం కట్టబెట్టారు. ఇక 2014లో టీడీపీ కూటమికి 25 కట్టబెట్టి చంద్రబాబుని ఉత్తరాంధ్ర ప్రజలు సీఎం యోగ్యత కల్పించారు. 2019 నాటికి వస్తే వైసీపీకి 34 సీట్లలో ఏకంగా 28 సీట్లు ఇవ్వగా.. జగన్ కి 151 సీట్లతో అధికారం దక్కింది. ఇపుడు ప్రధాన పార్టీల కన్ను ఉత్తరాంధ్రా మీద పడింది. మరోసారి ఏకపక్ష విజయం అందుకోవాలని వైసీపీ ఆరాటపడుతోంది. టీడీపీ కంచుకోటలను బద్ధలుకొట్టేశామని ఇక తమదే విజయం అని వైసీపీ అంచనా వేసుకుంటోంది.

జ‌న‌సేన రాక‌తో మార‌నున్న అంచ‌నాలు..

జనసేన జత కలవటంతో ఈసారి టీడీపీ జాతకం మారుతుందని మిత్రపక్షాల అంచనా. 2014 ఎన్నికల తరహాలో అత్యధిక సీట్లలో కూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పాటులో ఉత్తరాంధ్ర తమకు సహకరిస్తుందని టీడీపీ ఆశిస్తోంది.అందుకే నారా లోకేష్ శంఖారావం సభలో ఉత్తరాంధ్రా జిల్లాలు టీడీపీకి కంచుకోటలు అని గట్టిగా చెప్పారు. ఉత్తరాంధ్రా జిల్లాలలో వైసీపీకి ఒక్క సీటు కూడా రానీయకుండా టీడీపీ జనసేన కూటమి కలసి పనిచేయాలనిజనసేన నాయకుడు నాగబాబుకోరారు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఉత్తరాంధ్రాలో ప్రధాన పార్టీలు బస్తీ మే సవాల్ అని దూసుకు వస్తుంటే.. . జనం తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికర అంశం.

Advertisement

తాజా వార్తలు

Advertisement