Saturday, May 4, 2024

Politics – కృష్ణా జిల్లా వైసీపీ, టీడీపీ నేతల్లో గందరగోళం ….

కృష్ణా బ్యూరో (ప్రభ న్యూస్) : సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఆయా పార్టీల శ్రేణులలో గందరగోళం నెలకొంది. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికకు ప్రాధాన్యం ఇవ్వడంతో తుది జాబితా వెలువడే లోపు ఎవరుంటారో.. ఎవరు గోడ దూకుతారో.. మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కర్తలను వైసీపీ అధిష్టానం మార్పు చేసింది. వీరిలో ఎంతమందికి టికెట్ దక్కుతుందో.. ఎంత మందికి నిరాశ కలుగుతుందో అర్థం కాక పార్టీ శ్రేణుల్లో అయోమయం నెల‌కొంది. ఎడతెగని తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఇది సరే తెరపైకి కొత్త వ్యక్తులు వస్తారనే అంశంపైన పలు నియోజకవర్గాల్లో ఆయా పార్టీ శ్రేణుల్లో చర్చలు, ప్రచారం జోరుగా సాగుతున్నాయి.

జ‌న‌సేన‌లో చేరిన బాల‌శౌరి..

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. మచిలీపట్నం పార్లమెంటుకు వైసీపీ సమనయకర్తగా అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పేరును అధిష్టానం ప్రకటించింది. ఎంపీ అభ్యర్థిగా చివరి క్షణాల్లో మారే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సామాజికంగా, ఆర్థికంగా బలమైన అభ్యర్థి కోసం వైసీపీ అధిష్టానం ఇప్పటికీ చర్చలు జరుపుతున్నట్టు భోగట్టా. ఇక అవనిగడ్డ నియోజకవర్గంలో తాజాగా వైసీపీ అధిష్టానం తెరమీదకు తీసుకువచ్చిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రాజకీయాలతో ఇమడలేనని, తన బదులు తన కుమారుడిని రంగంలోకి దించాలని కోరారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి తోడు మచిలీపట్నం ఎంపీ స్థానంలో అభ్యర్థి మార్పిడి జరిగితే.. సింహాద్రి రమేష్ నాయుడును తిరిగి అవనిగడ్డకు పంపిస్తారా? లేక వీఆర్ లో ఉంచుతారా? అనేది సమాధానం దొరకని ప్రశ్న.

లోక‌ల్ హీరోల వీధి పోరాటం..

పెనమలూరు ఎమ్మెల్యే కేపీ సారథి రాజీనామా చేయడంతో, పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ ను సమన్వయకర్తగా నియమించారు. అంతే ఇక్కడ లోకల్ హీరోలు వీధిపోరాటానికి దిగారు. మంత్రి జోగి రమేష్ కు తాము మద్దతు ఇచ్చేది లేదని పేచీకి దిగారు. ఇక్కడ జోగి రమేష్ ఎంతమేరకు నిలదొక్కుకుంటారో వైసీపీ వర్గాలకు అర్థం కావటం లేదు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు కూడా వైసీపీ అధిష్టానం మొండి చెయ్యి చూపింది. దీంతో ఆయన రాజీనామా చేశారు. ఇంకెముంది తన సొంత నియోజకవర్గం మైలవరం నుంచి పోటీ చేయాలని జోగి రమేష్ ఉర్రూతలూగారు. కానీ.. అధిష్టానం ఎక్కడా తగ్గలేదు. మైలవరం సమన్వయ కర్తగా స్థానిక బీసీ నేత సర్నాల తిరుపతిరావు ను రంగంలోకి దించారు. ఈ స్థితిలో ప్రస్తుతం సిట్టింగ్ లు, ఇన్చార్జీల్లో చివరి వరకు టికెట్ రేసులో ఎవరు నిలబడతారో అనే దానిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. సందట్లో సడే మియా లా ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

- Advertisement -

ఉమ్మడి పార్టీలోనూ అదే తీరు..

ఇక తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థులను ఇప్పటివరకు ప్రకటించలేదు. మరోవైపు బీజేపీతో కూడా పొత్తు ఉండే అవకాశాలు ఉండడంతో అభ్యర్థుల ఖరారు కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో టీడీపీ, జనసేన ఆశావాహుల్లో తమకు టిక్కెట్ దక్కుతుందా…లేదా.. అనే దానిపై ఉత్కంఠత నెలకొంది. కొన్ని నియోజకవర్గాల్లో ఎవరికి వారే తామే ఉమ్మడి అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మైలవరం టీడీపీలో టిక్కెట్టు పేచీ నడుస్తోంది. మాజీ మంత్రి దేవినేని ఉమకు టిక్కెట్టు ఇవ్వొద్దని స్థానిక టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ. జనసేన ఉమ్మడి అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ స్థానం తమకు కావాలని జనసేన కోరుతోంది.

టీడీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు..

కాగా, మండలి బుద్ధ ప్రసాద్ రాజకీయ భవితవ్యం అర్థం కాని స్థితి. పెడన నియోజకవర్గంలోనూ టీడీపీలో అంతర్గత కుమ్ములాట తప్పటం లేదు. స్థానిక టీడీపీ ఇన్ చార్జి కాగిత కృష్ణ ప్రసాద్ కే టిక్కెట్టు ఇస్తున్నట్టు అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ కాపు వర్గాలకు కేటాయించాలని బూరగడ్డ వేదవ్యాస్ వర్గం పట్టుపడుతోంది. ఈ పంచాయితీ ఏ దారి తీస్తుందో ? అర్థం కాక పెడన నియోజకవర్గ టీడీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. ఇక నూజివీడులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. స్థానికేతర నాయకులకు సీటు వద్దని స్థానిక టీడీపీ వర్గాలు గోల గోల చేస్తుంటే.. తాజా కొలుసు పార్థసారథి పేరు తెరమీదకు రావటంతో నూజివీడు తెలుగుతమ్ముళ్లు కంగుతిన్నారు. ఇక ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వర్గం ముఖం పాలిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఫలితంగా టీడీపీ, జనసేన శ్రేణుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాకుండానే తమ శ్రేణులను ప్రజల వద్దకు వెళ్లే విధంగా ప్రధాన రాజకీయ పార్టీలు వివిధ కార్యక్రమాలను చేపట్టాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement