Thursday, May 16, 2024

సింహగిరిపై ఘనంగా సీతారాముల కళ్యాణం.. ఏప్రిల్‌ 12న అప్పన్న కళ్యాణం

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు అయిన సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ సీతారామాలయంలో సోమవారం కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా శ్రీ సీతారామచంద్ర, లక్ష్మణ, ఆంజనేయసహిత విగ్రహాలకు తొలుత విశ్వక్షేణ, పుణ్యహవచనం, ఆరాధన గావించారు. అనంతరం నూతన కంకణదారణ , యజ్ఞోపవీతం, జిలకర్ర బెల్లం, మాంగళ్యదారణ, తలంబ్రాల ప్రక్రియలను అత్యంత వైభవోపేతంగా జరిపించారు. వేద మంత్రోశ్చరణలు, మృదుమధుర మంగళవాయిద్యాల నడుమ సాగిన సీతారాముల కళ్యాణంతో సింహగిరి ఆధ్యంతం భక్తిప్రపత్తులతో పులకించింది.

రాష్ట్రంలో అన్ని దేవాలయాలు కంటే ముందుగానే పాల్గుణఏకాదశి రోజున సింహగిరిపై సీతారాముల కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఆలయ ఇవో ఎం.వి.సూర్యకళ ఆధ్వర్యంలో స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, హవల్ధార్‌ ఎస్‌.టి.పి.రాజగోపాల్‌, ప్రధాన పురోహితుడు, అలంకార్‌ కరి సీతారామాచార్యులు , ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు, అప్పాజీ తదితరులంతా ఉత్సవంలో పాల్గొని వైభవంగా పూర్తి చేశారు. హాజరైన భక్తులందరికి తీర్ద ప్రసాదాలు అందజేశారు. అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు తదితరులు ఉత్సవంలో పాల్గొని స్వామిని సేవించి దర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement