Saturday, May 4, 2024

AP : శ్రీశైలంలో మిన్నంటుతున్న శివనామ స్మరణం…

శ్రీశైలంలో మల్లన్న భక్తులతో కిక్కిరిసింది. శివనామ స్మరణతో మారుమోగుతుంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. పవిత్ర పాతాళ గంగ, దేవస్థానం అధికారులు కల్పించిన కేంద్రాల వద్ద భక్తులు పవిత్ర స్నాన ఆచరించి.. తమ ఇష్టా దైవమైన శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయంకు పోటెత్తుతున్నారు. రాష్ట్రం తో పాటు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం ఐదు లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చి ఉంటారని శ్రీశైల ఆలయ అధికారులు లెక్కలను బట్టి వెళ్లడ‌వుతుంది.

మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారు కొలువై ఉన్న శ్రీశైలంలో రమణీయ, భక్తి భావతరంగిత ఆవిష్కృతమైంది, తమ ఇష్టదైవమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో శివన్నాస్మరణతో శ్రీగిరులు మార్మోగాయి. దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే అర్ధనారీశ్వరుడిని దర్శనానికి భక్తులు బారులుతీరారు. దీంతో భక్తజనంతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. ఉచిత దర్శనానికి కిలోమీటర్‌ మేర భక్తులు వేచిఉన్నారు. ఇక లడ్డూ కౌంటర్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివరాత్రి సందర్భంగా స్వామిఅమ్మవార్లకు సాయంత్రం 5 గంటలకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ఆదిదంపతులకు నంది వాహనోత్సవం, రాత్రి 10 గంటలకు రుద్రాభిషేకం నిర్వహిస్తారు. 10 నుంచి 12 గంటల వరకు కీలకఘట్టమైన పాగాలంకరణ ఉంటుంది. ఇందులో భాగంగా ఆలయ విమానగోపురానికి, ముఖమండప నందులకు పాగాలంకరణ చేయనున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇక రాత్రి 12 గంటలకు భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లకు అంగరంగవైభవంగా కల్యాణం నిర్వహిస్తారు.

- Advertisement -

సర్వం శివమయంగా కనిపించే క్షేత్రాన్ని మహాశివరాత్రిన దర్శించడమే మహాభాగ్యంగా భక్తులు భావిస్తూ కనిపించారు. క్షేత్రంలో ఎక్కడ ప్రతిష్ఠిత శివలింగం ఉన్నా దర్శనం చేసుకోవడానికి, అభిషేకంలో పాల్గొనడానికి భక్తులు ఆసక్తి చూపించారు. అనువైన ప్రతిచోటా అడుగడుగునా లింగార్చనలు నిర్వహించగా, ఈ అభిషేకాలను చూడడమే ధన్యం అనుకున్న భక్తులు పోటీపడ్డారు. సిద్ధులు, యోగులు, తపస్వులు ఎందరో మామూలు భక్తులతో కలిసిపోయి శివయ్యను దర్శించుకోవడం లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మల్లికార్జునుని భక్తిగీతాలు పాడేవారు, శంఖాలు పూరించేవారు. వాద్యఘోషతో కైలాసనాథునికి జయ జయనాదాలు, పురాణ శ్రవణం చేస్తూ కనిపించారు. ఇలా అందరూ ఏదో ఒక విధంగా ఆ శివయ్య ని దర్శించుకోవడం మహాభాగ్యం అంటూ ముందుకు కదిలారు.

శివరాత్రి వైభవ సంప్రదాయాలు…
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలోఉద్వేగ భరిత క్షణాలు సంధ్యాసమయంలో ప్రారంభం కానున్నాయి.అఖిలలోకాలకు ప్రభయై వెలిగే అచలేశ్వరునికి ప్రభోత్సవం సాయంత్రం ప్రారంభం కానుంది. స్వామి అమ్మవార్లు ప్రభపైకి విచ్చేయగా అందమైన ప్రభపై చిత్రవిచిత్ర పుష్పాలతో అలంకరణ భాగంగా ఇప్పటికే ఏర్పాట్లు గావించారు. వీటి అనంతరం ఆదిదంపతులు పురవీధుల్లో ప్రభలపై ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరించనున్నారు.

నందివాహన సేవ…
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న వాహనసేవలో భాగంగా ఈ శ్రీ స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ, ఆలయ ఉత్సవ అధికారులు చేపట్టనున్నారు.
మహారుద్రా భిషేకం …
లింగోద్భవకాల మహారుద్రా భిషేకం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి 10.00 ల నుండి శ్రీస్వామివారికి లింగోద్భవకాల మహారుద్రాభిషేకం నిర్వహించనున్నారు.నిష్ణాతులైన 11 మంది అర్చక స్వాములు మహాన్యాసపూర్వకంగా రుద్ర మంత్రాలను పఠిస్తుండగా , దాదాపు 4 గంటలకు పైగా జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీస్వామివారికి అభిషేకo కొనసాగనుంది. ఆలయప్రాంగణంలోని పవిత్రమైన మల్లికాగుండంలోని జలంతోను ,పంచామృతాలతోనూ , పలు ఫలోదకాలతోనూ ఈ అభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎక్కడ చూసినాశ్రీశైల ఆలయం చుట్టూ ఉండే సాలుమండపాలపై, మెట్లపై ఇతర మండపాలలో ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. వారందరి ఎదురుచూపులన్నీ పాగాలంకరణ కోసమే అన్నట్లుగా కనిపించింది. మరోవైపు ఆలయంలో లింగోద్భవకాల రుద్రాభిషేక ఏర్పాట్లలో అర్చకగణం మునిగిపోగా. లింగోద్భవకాల మహారుద్రాభిషేకం, పాగాలంకరణ ఒకేసమయంలో ప్రారంభం కానున్నాయి.ఇదే క్రమంలో దివ్యతీర్థజలాలతో, విశేషద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అఖిల జగత్తుకు మూలాధారమైన ఆదిదేవునికి జరిగే ఈ అభిషేకాన్ని దర్శించడం ఎన్నో జన్మల సుకృతంగా భక్తులు భావిస్తారు.

పాగాలంకరణ….
ఇదే సమయంలో లింగోద్భవకాల మహారుద్రాభిషేకం రాత్రి ప్రారంభం కానుంది. పాగాలంకరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక బ్రహ్మోత్సవాలలో జరిగే ఈ పాగాలంకరణకు ఎంతో ప్రత్యేకత ఉంది . మన వివాహాలలో పెండ్లికుమారునికి తలపాగ చుట్టడం ఒక సంప్రదాయం . ఈ ఆచారమే మేరకు శ్రీశైల ఆలయంలో పాగాలంకరణ ఆనవాయితీగా కొనసాగుతోంది . ఈ పాగా స్వామివారి గర్భాలయ విమాన శిఖరం నుండి ముఖమండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ అలంకరించనున్నారు. పాగను సమర్పించే భక్తులు నియమంతో భక్తిని మేళవించి రోజుకు ఒక మూర చొప్పున సంవత్సరంలో 365 మూరల పొడవుతో ఈ పాగాను నేస్తారు . ఈ పాగాలను అలంకరించే వ్యక్తి దిగంబరుడై పాగాను అలంకరిస్తాడు . దిగంబరుడై పాగాను అలంకరించవలసి ఉన్నందున పాగాలంకరణ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నారు. చిమ్మచీకటిలో పాగాలంకరణ చేయడం ఎంతో నేర్పుతో కూడుకొన్న పని. ప్రకాశం జిల్లా , చీరాల మండలం , హస్తినాపుర గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు తాను స్వయంగా తెచ్చిన పాగాతో పాటు ఇతర భక్తులు సమర్పించిన పాగాలను కూడా కలిపి స్వామివారికి అలంకరించనున్నారు.

కళ్యాణ వైభోగమే…
అలంకరణ కార్యక్రమం ముగిసిన అనంతరం రాత్రి 12 గంటలకు లకు స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం జరగనుంది. . వైభవంగా , కనుల పండువగా జరగనున్న ఈ కల్యాణోత్సవంలో స్వామివారు పట్టువస్త్రాన్ని ధరించి , తలపై ఒకవైపు గంగమ్మను , మరొకవైపు నెలవంకను , మెడలో రుద్రాక్షమాలను , నుదుట విభూతి రేఖలను , పట్టువస్త్రాలను ధరించి పెండ్లికుమారుడుగా ముస్తాబు కానుండగా, ఇక అమ్మవారు కూడా పట్టువస్త్రాలను ధరించి , నుదుట కల్యాణ తిలకాన్ని , బుగ్గన చుక్కను , సర్వాభరణాలను ధరించి పెండ్లికుమార్తె అయి స్వామికి సరిజోడు గా కనిపించనున్నారు. అనంతరం మంగళ తూర్యనాదాలతో , వేదమంత్రాల నడుమ నేత్రానందంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. అనంతరం సుముహూర్త సమయంలో స్వామి అమ్మవార్లకు జీలకర్ర , బెల్లం సమర్పించిన అనంతరం మాంగల్యపూజను జరిపించి అమ్మవారికి మాంగల్యధారణ గావించనున్నారు.తరువాత తలంబ్రాలు , బ్రహ్మముడి కార్యక్రమాలను జరిపి భక్తులకు ఆశీర్వచనాన్ని అందజేయడంతో స్వామి అమ్మవార్ల కళ్యాణ ఘట్టం ముగియనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement