Friday, July 26, 2024

AP : సీఎం జ‌గ‌న్ పై ష‌ర్మిల వ్యాంగ్యాస్త్రాలు

వైసీపీ టీడీపీ దొందు దొందే
కాంగ్రెస్ తోనే రాష్ట్రంకు న్యాయం
చంద్రబాబు, జగన్ రాష్ట్ర ప్రజలను నిలువునా వంచించారు.
కేంద్రంలోని బిజెపి వద్ద రాష్ట్ర పరువును తాకట్టు పెట్టిన టిడిపి, వైసిపి.
కర్నూల్లో పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల

ఉమ్మ‌డి కర్నూల్ బ్యూరో, ఏప్రిల్ 21 (ప్రభ న్యూస్) కుంభకర్ణుడు ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే నిద్రపోతారని, అయితే నాలుగన్నరేళ్లు నిద్రపోయిన జగన్‌,ఎన్నికల వేళ నిద్ర లేచారంటూ ష‌ర్మిల వ్యాంగ్యాస్త్రాలు ప్ర‌ద‌ర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆమె కర్నూల్లో ఎపి న్యాయ యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా కర్నూల్ నగరంలోని స్థానిక చౌక్ బజారులో హాజరైన అశేష జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

- Advertisement -

రాష్ట్రానికి పదేళ్లుగా తీరని అన్యాయం చేసిన కేంద్రంలోని బిజెపితో టిడిపి నేరుగా పొత్తు పెట్టుకుంటే… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోడీకి తొత్తుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కావున ఈ పార్టీలతో రాష్ట్రానికి ఒరిగేదేం లేదన్నారు. రాష్ట్రంకు
పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకుండా కేంద్రంలోని బిజెపి మోసం చేసిందని గుర్తు చేశారు.పోలవరం విషయంలోనూ ఇదే మోసం జరిగిందన్నారు.వీటిని సాధించే విషయంలో వైసిపి, టిడిపిలు బిజెపిని నిలదీయలేక ప్రజలను వంచిస్తున్నాయన్నారు. ప్రజలను మోసం చేసిన పార్టీలతో టిడిపి నేరుగా పొత్తు పెట్టుకుంటే… మోడీకి తొత్తుగా వైసిపి వ్యవహరిస్తుందని ఆమె విమర్శించారు.

రాష్ట్రంలో ఆ రెండు పార్టీల్లో ఏది అధికారంలోకి వచ్చినా పాలించేది మాత్రం బిజెపినే అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను సాధించి ఉంటే నేడు రాష్ట్రానికి వేల పరిశ్రమలు వచ్చేవన్న విషయమును గుర్తు చేశారు. స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు లభించేవన్నారు. ఇవి లేకపోవడంతో కర్నూలు జిల్లా నుంచి ఉపాధి కోసం వలసలు వెళ్లే పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. రాయలసీమకు సాగు, తాగునీటిని అందించే హంద్రీనీవా, ఇతర ప్రాజెక్టులు వైఎస్‌ హయంలోనే 90 శాతం పూర్తయితే.
మిగతా పది శాతం ఈ పదేళ్లలో ఈ రెండు పార్టీలు పూర్తి చేయలేకపోయాయని దుయ్యబట్టారు. ప్రతి ఏటా జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తామని ఇచ్చిన హామీ అమలులో భాగంగా ఈ ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. కర్నూలు జిల్లాలో ప్రతి ఏటా బీటెక్లు డిగ్రీలు పూర్తిచేసిన యువతకు ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలైన బెంగళూరు, మహారాష్ట్ర, తెలంగాణ తమిళనాడుకు తరలి వెళుతున్న విషయమును ఆమె గుర్తు చేశారు.ఇండియాతోనే ప్రత్యేక హోదా సాధ్యం అని షర్మిల పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన ద్వారా రాష్ట్రంకు పరిశ్రమలు తరలివస్తాయని వీటి ద్వారా యువతీ యువకులకు ఉపాధి కలిగించేందుకు వీలుంటుందన్నారు.

ఉద్యోగాల కల్పన పైనే మొదటి సంతకం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదట 2.30లక్షల ఉద్యోగాల పైనే మొదటి సంతకం చేయనున్నట్లు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు.ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఇపుడు ఇస్తున్న ప్రతి హామీని నెరవేర్చుతామని వైఎస్‌ షర్మిల చెప్పారు. జగన్‌ తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని విస్మరించారన్నారు. పాఠశాల విద్య అభ్యసించే ప్రతి ఒక్కరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పిన జగన్‌ ఆ తరువాత మాట తప్పారన్నారు. ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇపుడు అమ్మఒడి ఇస్తున్నారన్నారు. అది కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకుండా కోత విధిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో 23వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని జగన్‌ తన పాదయాత్ర సందర్బంగా నిరుద్యోగులకు హామీ ఇచ్చారన్నారు.
అయితే నాలుగన్నరేళ్లు నిద్రలో ఉన్న జగన్‌… ఎన్నికల వేళ 6వేల పోస్టులతో దగా డీఎస్సీ నిర్వహించడానికి నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. ఎవరైనా ఎన్నికలకు రెండు నెలల మునుపు డీఎస్సీకి నోటిఫికేషన్‌ ఇస్తారా అని షర్మిల ప్రశ్నించారు. నిరుద్యోగులను దగా చేయడానికే జగన్‌ ఈ నాటకం ఆడారన్నారు. గతంలో ప్రభుత్వ చౌక దుకాణాల్లో 11రకాల సరుకులు రేషన్‌ కార్డుదారులకు అందించే వారన్నారు.

నిత్యావసర సరుకుల్లో కోత…
జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక కేవలం బియ్యం, చక్కెర మాత్రమే పంపిణీ చేస్తున్నారన్నారు. ఇలా నిత్యావసర సరుకుల్లో కోత విధించడం వలన పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ పాలనలో ఏడు పర్యాయాలు విద్యుత్‌ ఛార్జీలు, రెండు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారన్నారు. ప్రస్తుతం సామాన్యులు విద్యుత్‌ ఛార్జీల భారం మోయలేకున్నారన్నారు.నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచడంతో సామాన్యుల బతుకు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. జగన్‌ పేదలకు సంక్షేమ పథకాలు ఒక చేత్తో ఇచ్చి… రెండు చేతుల్తో వారిని దోచుకు తింటున్నారని ఆమె ఆరోపించారు. అంటే రూ. 100 ఇచ్చి..రూ.. 1000 జనం నుంచి లాక్కుంటున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళకు ఏడాది రూ.లక్ష వంతున ఆర్థిక సాయం చేస్తామన్నారు. వృద్ధులు,వితంతువులకు నెలకు రూ.4వేలు వంతున… ప్రత్యేక ప్రతిభావంతులకు రూ.6వేలు వంతున సామాజిక భద్రత ఫింఛను అందచేస్తామన్నారు.పేదల ఇళ్ల నిర్మాణం కోసం రూ.5లక్షలు ఆర్ధికసాయం చేస్తామన్నారు. ఇల్లు లేని ప్రతి పేదకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఇండియా వేదిక అభ్యర్థులను అత్యధిక మోజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇక ఓటు తల్లి, చెల్లిలాంటిదని… ప్రతి ఓటరు ఆలోచించి మంచి చేసే వారికి ఓటు వేయాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి రాం పుల్లయ్య యాదవ్, సిపిఐ, సిపిఎం నేతలు పాల్గొని ప్రసంగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement