Saturday, May 4, 2024

విత్తనాల కొరత అంటూ కాసులు దోచేస్తున్న వ్యాపారులు

గుంటూరు ప్రతినిధి, ప్రభన్యూస్ – తొలకరి పులకరించే రోజు దగ్గరలో ఉంది… రైతన్నలు మళ్లీ పొలం బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.. మే నెలలోనే వర్షాలు కురవడంతో భూతల్లి తడిసి ముద్దయింది. దీంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నారు. గుంటూరు మిర్చికి… గుంటూరు కారానికి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత ఉంది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా రైతులు మిర్చి సాగుకు మొగ్గు చూపుతున్నారు.. ఈ ఏడాది మిర్చికి మార్కెట్లో మంచి ధర లభించింది. రైతులు ఇప్పటి నుండే విత్తనాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే అదునగా భావించిన ఫర్టిలైజర్ షాపు యాజమాన్యాలు విత్తనాల ధరలు అమాంతంగా పెంచుతున్నారని ఆరోపణ వినిపిస్తున్నాయి.

ఫర్టిలైజర్ షాపులు బోర్డులపై ధరల పట్టిక నమోదు చేయరు… వారిష్టానుసారం రైతులకు విత్తనాలు విక్రయిస్తూ కొందరికి బిల్లులు ఇస్తున్నారు… మరికొందరికి బిల్లులు కూడా ఇవ్వకుండా అధిక ధరలకు విత్తనాలు అమ్మకాలు నిర్వహిస్తున్నారని రైతుల మండిపడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఫర్టిలైజర్ షాపుల వ్యాపారులు మిర్చి, పత్తి విత్తనాలకు అధిక ధరల విక్రయిస్తున్నారని సమాచారం. అధికారులు మాత్రం నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు కూడా ఈ సీజన్లో భారీగా ముడుపులు చెందుతాయని ఒక నానుడి. ఈ సీజన్లో కొన్ని కంపెనీల విత్తనాలతో పాటు నకిలీ విత్తనాలు కూడా విక్రయాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. కొంతమంది రైతులు నకిలీ విత్తనాలతో నష్టాలు పాలై అప్పులు ఊబిలో ఊరుకుపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొందరు రైతులు ఏకంగా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. రైతులు బహిరంగంగా అధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి.. అప్పుడు హడావుడి చేసే అధికారులు ముందుగానే రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

విత్తన వ్యాపారాలు రైతుల జేబుకు గండి కొడుతున్నారని తెలుస్తుంది. గత సంవత్సరం 350 నుండి 500 రూపాయలకు విక్రయించిన 355 బ్యాడిగి రకం మిర్చి విత్తనాలు ఈ సంవత్సరం అమాంతం ఒకసారి గా 770 రూపాయలకు విక్రయిస్తున్నారు. అమాయకులైన కొందరు రైతులను ఎంచుకొని వ్యాపారాలు బిల్లులు లేకుండా విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఫర్టిలైజర్ షాప్ లో స్టాక్ బోర్డ్స్ మీద వున్నా విత్తనాలు షాపులో ఉండవు. ఆగస్టు సమయంలో ఈ విత్తనాలు విత్తుతారు కానీ ఇప్పుడే డబ్బులు దండుకొనే కార్యక్రమంలో భాగంగా విత్తనాలు “దొరకవు ” తరువాత కూడా స్టాక్ వస్తుందో లేదో తెలీదు అనే ప్రచారం చేసి రైతుల అవసరాన్ని ఆసరాగా తీస్కొని, వారి అమాయకత్వాన్ని డబ్బుగా మార్చుకుంటునారు. గతం కంటే 250 నుండి 300 రూపాయల అధికంగా విక్రయిస్తున్నారని ఆరోపణ ఉంది. విత్తనాల పాకెట్లు ఇప్పుడు అమాంతం ఒక్కసారి గా 750 నుండి 800 వరకు రేటు పెంచి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు రైతులు తెలుపుతున్నారు. నిజంగా స్టాక్ లేదా… స్టాక్ ఉన్న వ్యాపారులు అలా ప్రచారం చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

- Advertisement -

విత్తనాల కొరత ఏర్పడిందనే భ్రమలో వెనక ముందు ఆలోచించ కుండా అప్పో సోప్పో చేసి రైతులు విత్తనాలు కొనడానికి సిద్ధమవుతున్నారు. స్టాక్ బోర్డు లో వున్నా స్టాక్ షాపులో కనిపించడంలేదు. సంవత్సరం 10 గ్రాముల విత్తనాలు 500 నుంచి 700 వరకు విక్రయించి ప్రస్తుతం 10 గ్రాముల ప్యాకెట్ 1000 రూపాయలు పెంచి విక్రయిస్తున్నారని సమాచారం. గత 20 సంవత్సరాల నుండి ఎప్పుడు ఇటువంటి పరిస్థితిని చూడలేదని, అన్ని విత్తనాలు రేట్లు పెంచేసారని రైతులు మండిపడుతున్నారు. మిర్చి లో ఎర్ర నల్లి, ఇతర బోబర్లు వంటి వైరస్లు ఏలా రైతులను పీల్చి పిప్పి చేస్తుంటే…. విత్తనాలు అమ్మే వ్యాపారాలు కుడా అలానే వున్నారని రైతులు వాపోతున్నారు. షాపుల ముందు రైతులు విత్తనాల కోసం వేసి ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. రోజుల తరబడి షాపుల చుట్టూ రైతులు ప్రదక్షిణ చేస్తున్నారు.

పల్లెల్లో రైతులు విత్తనాలు షాపులకు వెళ్తుంటే.. మా షాపులో స్టాక్ లేదని చెప్తూ వేరే షాపు నుండి తెప్పిస్తామంటూ అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్లో విత్తనాలు వ్యాపారం చేస్తున్న అధికారులు నమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని రైతుల మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి స్టాక్ లేదు అంటూ ప్రచారం చేస్తూ మార్కెట్ నిర్వహిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రైతుల కోరుతున్నారు.. మొత్తం ఆర్బిక్కేలు ద్వారా విత్తనాలు అందించలేకపోతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మిర్చి, పత్తి మార్కెట్లో ఉన్నప్పటికీ వ్యాపారులు తప్పుడు ప్రచారం చేసి రైతులను ఆందోళనలతో గురిచేసి బ్లాక్ మార్కెట్ ద్వారా రైతుల జేబు ఖాళీ చేసే విధంగా వ్యాపారులు వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నత అధికారులు దీనిపైన స్పష్టంగా ప్రకటన చేసి రైతులకు న్యాయమైన విత్తనాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement