Friday, May 17, 2024

స‌చివాల‌య ఉద్యోగులు గైర్హాజ‌రు.. సీఎం జ‌గ‌న్ చెప్పినా ప‌ట్టించుకోవ‌ట్లే..

అమ‌రావ‌తి: సీఎం జగన్ ఆదేశించినా రాష్ట్ర సచివాలయానికి అధికారులు, ఉద్యోగుల గైర్హాజరవుతున్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్​గా పరిగణిస్తోంది. ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరుకు సంబంధించి మరోమారు సాధారణ పరిపాలన శాఖ నోటీసు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విభాగాలు, హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన హాజరు వివరాలను నియంత్రణలోకి తెచ్చుకోవాలంటూ రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న వివిధ విభాగాల కార్యదర్శులకు సూచనలు జారీ చేసింది.

బయోమెట్రిక్ ద్వారా నమోదైన ఉద్యోగుల హాజరును ఎప్పటికప్పుడు గమనించాలని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు సచివాలయంలోని ఉద్యోగుల హాజరు నమోదు వివరాలు రోజువారీగా సంబంధిత శాఖ కార్యదర్శి పరిశీలించాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ సూచనలు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలో 10 శాతం మంది ఉద్యోగులు ఉదయం 11 గంటల తర్వాతే విధులకు హాజరవుతున్నట్టు గుర్తించినట్టు సాధారణ పరిపాలన శాఖ ఆ మోమోలో స్పష్టం చేసింది. కచ్చితంగా అన్ని విభాగాల్లోనూ 80 శాతం హాజరు తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఆయా శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై గతంలో జారీ చేసిన నిబంధనల్ని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఉద్యోగ విరమణ చేసిన, బదిలీ అయిన ఉద్యోగులకు సంబంధించిన వివరాలను బయోమెట్రిక్ పరికరాల నుంచి తొలగించాలని సూచించింది.

వాస్తవానికి మంత్రులు, సీఎం, సీఎస్ సమీక్షల పేరుతో 90 శాతం మంది ఉన్నతాధికారులు సచివాలయానికి రాకపోవటంతో ఉద్యోగులూ విధులకు హాజరు కావటం లేదు. మంత్రులు, కార్యదర్శుల్లో ఎక్కువ శాతం మంది హెచ్ఓడీ విజయవాడ, తాడేపల్లిలోని హెచ్ఓడీ కార్యాలయాలు, ఏపీఐఐసీ భవనంలోనే విధులు నిర్వహించేస్తున్నారు. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో కొందరు అక్కడికే వెళ్లాల్సి వస్తోంది. సంబంధిత శాఖల కార్యదర్శులు సచివాలయానికి హాజరైతే ఉద్యోగుల హాజరు శాతం కూడా పెరిగే అవకాశముందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఒక్క రాష్ట్ర సచివాలయంలోనే 2048 మంది ఉద్యోగుల్లో ఉదయం 10 గంటల సమయానికి సగటున 1400 మంది వరకే హాజరవుతున్నారని సాధారణ పరిపాలన శాఖ నమోదు చేస్తున్న వివరాలు చెబుతున్నాయి. బయోమెట్రిక్ అటెండెన్సు తప్పనిసరి చేసినా సచివాలయంలో విధులకు హాజరు కానివారి సంఖ్య 30 శాతంగా ఉంటోంది.

ప్రస్తుతానికి సచివాలయంతో పాటు హెచ్ఓడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఐదురోజుల పనిదినాలు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ మాత్రమే పనిగంటలు ఉన్నాయి. 10 గంటల 10 నిముషాల తర్వాత హాజరైతే ఆలస్యంగా వచ్చినట్టు పరిగణిస్తామని నెలలో మూడు మార్లు కంటే ఎక్కువ ఆలస్యాన్ని అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో సచివాలయ మాన్యువల్ ప్రకారం నడచుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement