Monday, April 29, 2024

ఇసుక దోపిడీ.. అడ్డుకుంటున్న అధికారుల పై అధికార పార్టీ హంగామా..

ఒంగోలు, ప్రభన్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానానికి కల్పించిన వెసులుబాటు అక్రమార్కుల దోపిడీకి దారి చూపింది. ఇసుక వ్యాపారం రాజకీయ నేతలకు, అస్మదీయులకు లాభసాటిగా మారింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇసుక వ్యాపారంలో దోపిడీ కేంద్రీకృతం అవుతోంది. అప్పట్లో ‘ఇసుకాసురులు’గా తిట్టి పోసిన వైసీపీ, నాటి అక్రమాలను అరికడతామంటూ.. చెబుతూనే.. ఇసుక దందాను తామే చేజిక్కించుకుంటున్నారు. ఇటీవల కొత్తపట్నంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఎస్‌ఈబీ అధికారులు అడ్డుకోవడంతో అధికార పార్టీకి చెందిన నాయకుడు హంగామా చేసిన విషయం మర్చిపోక ముందే తాజాగా అద్దంకిలో ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు అధికారిని దిగ్బంధం చేయడం సంచలనంగా మారింది. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఓ అధికారి అడ్డుకోగా.. ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. గుండ్లకమ్మ రీచ్‌లోని సర్వే నెంబర్‌ 174లో ఉన్న 1.11 ఎకరాల భూమిని జగనన్న కాలనీలకు ఇసుక తవ్వకునేలా ఎస్‌ఈబీ, గృహ నిర్మాణశాఖ, రెవెన్యూ అధికారులు అనుమతించారు. ఈ ఇసుక పూర్తిగా ఉచితకం కాగా, రవాణా ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ఆ కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేసుకునే వారు ముందస్తు అనుమతి పొందిన తరువాతనే ఇసుక తీసుకెళ్లాలి. అయితే ఇదే అదునుగా కొందరు భారీ సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను తనిఖీ చేయగా.. అనుమతి లేని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు ఎస్‌ఈబీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీకి చెందిన శ్రేణులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు.

రాజకీయ ప్రమేయాలతో కోట్టాది రూపాయల అక్రమ వ్యాపారం జరుగుతోంది. అధికారులు ఏమైనా ఫిర్యాదులు వస్తే తప్ప.. రాజకీయ ప్రమేయం ఉన్న అక్రమ రీచ్‌ల వద్దకు వెళ్లడం లేదు. రాజకీయ నాయకుల అండదండలతో, అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఈ వ్యాపారం యథేచ్ఛగా జరుగుతోంది. అద్దంకి, ఒంగోలు, కొండెపి నియోజవకవర్గం పరిధిలోని ఆయా ప్రాంతంలో ఇసుక అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. జరుగుమల్లి మండలంలో అధికారిక రీచ్‌లు ఉండగా, జరుగుమల్లి ప్రాంతంలో అనధికారికంగా ఇసుక క్వారీయింగ్‌ పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రతి రోజు టన్నుల కొద్దీ ఇసుక తరలిపోతోంది. క్వారీలలో త వ్వుతున్న ఇసుక నేరుగా ఆయా ఇసుక పాయింట్లకు తీసుకొచ్చిన తరువాత, అక్కడి నుంచి అనుమతులు తీసుకొని గృహ నిర్మాణాలకు తీసుకెళ్లాలి. కానీ, కొందరు అక్రమార్కులు నేరుగా క్వారీల నుంచి తవ్వుకొని అక్రమంగా తరలిస్తున్నారు. అనుమతి పొందిన దాని కంటే అధిక మొత్తంలో ఇసుకను తోడేయడమే కాకుండా, సదూర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. జరుగుమల్లి మండలంలోని ముసి, అట్లేరు పరివాహక ప్రాంతంలో అనధికారికంగా అధికార పార్టీకి చెందిన నాయకులు తమ పలుకుబడిని వినియోగించి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.
వాస్తవానికి ఇసుక కావాల్సిన వారు అధికారిక ఇసుక రీచ్‌ల ద్వారా ఇసుకను తవ్వుకునేందుకు గ్రామ పంచాయతీలో డిజిటల్‌ అసిస్టెంట్‌కు ఆధార్‌ కార్డు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఒక ఆధార్‌కు పది ఇసుక ట్రక్కులు అనుమతి పొంది తెచ్చుకోవచ్చు. అయితే ఇసుక విక్రయాలు జరుగుతున్న గ్రామాల వద్ద పంచాయతీకి టన్నుకు నిర్ఱయించిన రేటు ప్రకారం ఇసుక అమ్మకం దారులు చెల్లిస్తున్నారు. కానీ, అధికారికంగా తీసుకునే రశీదు పైనే ఎక్కువ ట్రక్కులు తరలిస్తున్నారనే విమర్శలు లేక పోలేదు.

అధికారుల కళ్లకు గంతలు.!

అద్దంకి, ఒంగోలు, కొండెపి ప్రాంతంలో యధేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా.. సంబంధితశాఖల అధికారులు కళ్లకు గంతలు కట్టుకొని చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా ట్రక్కు దొరికిందంటే చాలు.. పలువురికి పండగే ! ప్రతి రోజు అనధికారిక ఇసుక ట్రక్కులు తరలిపోతున్నా.. పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. జరుగుమల్లి, నందనవనం, చింతపాలెం, చిరుకురపాడు, నరసింగోలు, పైడిపాడు, కామేపల్లి, కె.బిట్రగుంట గ్రామాల నుంచి పట్టపగలే అక్రమంగా ఇసుక తరలిస్తున్నా.. అధికారులు దాడులు నామమాత్రమే. రాత్రి వేళల్లో ఎక్స్క్‌లేటర్లతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం. గుండ్లకమ్మ నదిలో ఇసుకే కాక పక్కనే ఉన్న రైతుల భూముల్లో కూడా రాత్రి సమయాల్లో తవ్వకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సరాసరి రూ.20వేల నుంచి రూ.30 వేల వరకు ఇసుక అక్రమార్కులు నిత్యం గడిస్తున్నారు. ఇటీవల కొంత మంది గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. రాత్రి సమయాల్లో తోలిన ఇసుకను గ్రామంలో ఒక చోట్ల నిల్వ ఉంచుకొని వెంటనే అమ్మకాలు చేస్తున్నారు.

టన్ను ధర రూ.5000..

- Advertisement -

రీచ్‌లలో టన్నుకు రూ. 475కు అమ్మాలని ప్రభుత్వం ఆదేశించింది. రవాణా ఛార్జీలతో కలిపి ఎంతకు అమ్మాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ధరలు ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లాలో కొన్ని చోట్ల టన్నుల ఇసుకను రూ.800 నుంచి రూ.1000 వరకు రేటు పెట్టారు. ఇది కూడా అన్ని వాతావరణ పరిస్థితులూ అనుకూలిస్తేనే.. లేకుండా మరో రూ. 5 వేల వరకు అదనంగా చెల్లించాల్సిందే ! అంతే కాదు దొంగ బిల్లుల వ్యవహారం కూడా ప్రస్తుతం హాట్‌ హాట్‌గా మారింది. కొందరు వైసీపీ నాయకులే దొంగ వే బిల్లులు ముద్రించి వాటితో అనధికార అమ్మకాలకు పాల్పడుతున్నారని సమాయారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement