Tuesday, May 14, 2024

రహదారులు అధ్వానం.. వానలకు దెబ్బతింటే పట్టించుకోరా.?

నెల్లూరు, ప్రభన్యూస్‌ : జిల్లాలోని ప్రధాన జాతీయ రహదారి నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహింపబడుతోంది. ఇటీవల వరదలకు అక్కడక్కడా జాతీయ రహదారికి గండ్లు పడినప్పటికీ నిధుల కొరత లేకపోవడంతో వేగవంతంగా మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్ని చోట్ల మరమ్మతులు కొనసాగుతున్నప్పటికీ ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా సంబంధిత అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే జిల్లాలోని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రహదారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పలు చోట్ల మోకాళ్ల లోతు గుంతలతో వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. ఆయా రహదారులపై ప్రయాణిస్తున్న వారు ప్రమాదానికి లోనై కొన్ని చోట్ల ప్రాణాలు పోతుండగా, మరికొన్ని సంఘటనల్లో వాహనదారులకు తీవ్ర గాయాలు తగిలి అంగవైకల్యం చోటు చేసుకుంటోంది. మరికొన్ని ఘటనల్లో ప్రయాణికులు ఆస్పత్రులకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్‌అండ్‌బీ , పంచాయతీరాజ్‌ రెండు విభాగాల ఆధ్వర్యంలో నడిచే రహదారుల నిర్వహణ అత్యంత ఘోరంగా ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు , పెన్నా నదికి అనూహ్యంగా చోటుచేసుకున్న వరదలు కారణంగా మరింత అధ్వాన స్థితికి చేరుకున్నాయి. రహదారుల పునరుద్ధరణకు అధికారులు అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. అయితే నిధులు మంజూరు అయ్యాయో.. లేదో తెలియదు కాని.. ఎక్కడ కూడా పూర్తిస్ధాయి పునరుద్ధరణ జరగలేదు. తాత్కాలిక మరమ్మతులతో కొంత గులక, మట్టి తోలిన అధికారులు సరిపెట్టారు. దీంతో ఆయా రహదారులపై ప్రయాణం చేస్తున్న వాహనదారులకు నరకం కనబడుతోంది.

రూ. 2 వేల కోట్లు విడుదల చేశామంటున్న ప్రభుత్వం..

అయితే రాష్ట్రంలోని అన్ని రహదారులు పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టాలని , ఎక్కడ కూడా విమర్శలు రాకూడదని అందుకు ప్రత్యేకంగా రూ. 2 వేల కోట్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. అయితే జిల్లాలో నూతన రహదారుల నిర్మాణం సంగతి అటుంచి .. కనీసం మరమ్మతులకు కూడా నోచుకోని రహదారులు ఎన్నో ఉన్నాయి. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ, పంచాయ తీరాజ్‌ అధికారులను ప్రశ్నిస్తే పూర్తి వివరాలు చెప్పకుండా దాటవేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల ఇబ్బందులు గమనించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితమయ్యారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మరోవైపు కొన్ని చోట్ల రహదారుల నిర్మాణం ప్రారంభమైనప్పటికీ నత్తనడకన నడుస్తున్నాయి. సక్రమంగా బిల్లులు కావడం లేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పూర్తిగా దెబ్బతిన్న రహదారులు పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితుల్లో .. కనీసం మరమ్మతులన్నా చేసి ఇబ్బందులను తొలగించాలని ప్రజల కోరికగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement