Thursday, May 2, 2024

ఓవర్‌ లోడింగ్‌తో దెబ్బతింటున్న రోడ్లు.. పట్టించుకోని అధికారులు

అమరావతి, ఆంధ్రప్రభ : రహదారి భద్రత, రహదారుల సామర్ధ్యానికి ఓవర్‌ లోడింగ్‌ ప్రధాన సమస్యగా మారింది. సరుకు, రవాణా వాహనాల ఓవర్‌ లోడింగ్‌ వల్ల రాష్ట్ర రహదారులు చిధ్రమవుతున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర రహదారులు భారీ వాహనాలల్లో సామర్ధ్యానికి మించి సరుకు రవాణా చేస్తుండటంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంలా మారింది. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం వేలాది వాహనాల్లో సరుకు, రవాణాతో పాటు ఇసుక, గ్రానైట్‌, ఐరన్‌, ఇతర భారీ సామాగ్రిని తరలిస్తున్నారు. ముఖ్యంగా లారీలు, భారీ ట్రైలర్‌లు, కంటైనర్లలో సామార్ధ్యానికి మించి సరుకును రవాణా చేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో భారీగా ఓవర్‌ లోడ్‌తో ప్రయాణం సాగిస్తున్నా అధికార యంత్రాంగం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో రహదారి భద్రతతో పాటు రహదారుల పరిస్థితి రోజురోజుకీ అధ్వానంగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్న వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు కారణమవుతూ ప్రాణాలు హరిస్తున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నా అధికార యంత్రాంగం ఈ అంశంపై ఏమాత్రం దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఓవర్‌ లోడింగే ప్రధాన కారణం..

రాష్ట్రంలో రహదారుల అధ్వాన స్థితికి ఓవర్‌ లోడింగే ప్రధాన కారణమని నివేదికలు వెల్లడిస్తున్నా అధికార యంత్రాంగం ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఇంకోవైపు రహదారుల నిర్మాణంలో సరైన ప్రమాణాలను కాంట్రాక్టర్లు పాటించకపోవడంతో కొత్తగా వేసిన రహదారులు సైతం దెబ్బతింటున్నాయి. ఈ దెబ్బతిన్న రహదారుల్లోనే భారీ వాహనాలు నిత్యం వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్న పరిస్థితుల్లో ఇవి మరికాస్త అధ్వాన స్థితికి చేరుకుంటున్నాయి. అధిక లోడ్‌ కారణంగా రోడ్లపై ఒత్తిడి అధికం కావడంతో ఇవి పూర్తిగా దెబ్బతింటున్నాయి. సాధారణంగా రాష్ట్ర రహదారులు 30 కిలో న్యూటన్ల సామర్ధ్యంతో నిర్మిస్తారు. అయితే దీనికి భిన్నంగా వాహనాలు అధిక లోడ్‌తో ప్రయాణాలు సాగిస్తుండటంతో రహదారులపై ఒత్తిడి పడి చిధ్రమవుతున్నాయి. పెద్ద పెద్ద కంటైనర్లు, 10, 12, 20 టైర్ల వాహనాల్లో రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా అధిక బరువును తీసుకువెళ్లడం సర్వ సాధారణంగా మారింది. వాస్తవానికి రవాణా శాఖ నిబంధనల ప్రకారం 10 టైర్ల భారీ వాహనంలో కేవలం 25 టన్నుల సరుకును మాత్రమే రవాణా చేయాల్సి ఉండగా దానికి భిన్నంగా 30 నుంచి 35 టన్నుల వరకు రవాణా సాగుతుంది. 12 టైర్ల వాహనాల్లో 32 టన్నుల వరకు మాత్రమే అనుమతి ఉండగా 40 నుంచి 45 టన్నుల వరకు సరుకును రవాణా చేస్తున్నారు.

టోల్‌గేట్లు తప్పించుకునేందుకు వాహన యజమానుల జిమ్మిక్కులు..

- Advertisement -

ఒకవైపు ఇంధన ధరలలో పెరుగుదల.. మరోవైపు టోల్‌ ఛార్జీలు పెరగడంతో వాహన యజమానులు కొత్త పంధాలో రవాణా సాగిస్తున్నారు. పెరిగిన టోల్‌ ఛార్జీలను తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన రహదారుల్లో టోల్‌గేట్లను తప్పించుకునేందుకు గ్రామీణ ప్రాంతాల రహదారుల గుండా రాకపోకలు సాగిస్తుండటంతో ఆయా రహదారుల పరిస్థితి మరీ అధ్వాన స్థితికి చేరింది. రాష్ట్రానికి చెందిన వాహనాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ట్రాన్స్‌పోర్టర్లు ఇదే మార్గాన్ని అనుసరించడంతో రహదారి భద్రతకు పూర్తిస్థాయిలో ముప్పు ఏర్పడటంతో పాటు రోడ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా భారీ పారిశ్రామిక సామాగ్రితో పాటు ఇతర సామాగ్రిని భారీ వాహనాల్లో ఈ మార్గాల్లోనే తరలిస్తుండటం, వందలాది వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో గ్రామీణ రహదారుల పున:నిర్మాణంపై దృష్టి సారించిన ప్రభుత్వం వాటి నిర్మాణాన్ని చేపట్టింది. ఒకవైపు నిర్మాణ పనులు సాగుతున్న తరుణంలో మరోవైపు ఈ భారీ వాహనాల ప్రయాణం ఆయా మార్గాల గుండా సాగుతుండటంతో కొత్తగా నిర్మిస్తున్న రహదారులు కూడా మళ్లిd యధాస్థితికి చేరుకుంటున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో రహదారుల పరిస్థితి మరీ అధ్వానంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఓవర్‌ లోడింగ్‌తో పాటు గ్రామీణ ప్రాంత రహదారుల గుండా రవాణా సాగిస్తున్న వాహనాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement