Wednesday, May 1, 2024

Delhi: ద్రౌపది ముర్ముపై ఆర్జీవీ ట్వీట్ తీవ్ర అభ్యంతరకరం.. వెంట‌నే ట్వీట్ తొలగించాలి: జీవీఎల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే తరఫున బరిలోకి దిగిన ద్రౌపది ముర్ముపై దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ తీవ్ర అభ్యంతరకరమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. తక్షణమే ఆ ట్వీట్ తొలగించాలని డిమాండ్ చేశారు. చీప్ పబ్లిసిటీ కోసం వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమన్న విషయం మర్చిపోరాదని, మీడియా సైతం ఈ అంశంపై చర్చలు నిర్వహించడం సరికాదని జీవీఎల్ అన్నారు. మొట్టమొదటిసారిగా ఆదివాసీ మహిళకు రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించడంపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని ఆయన తెలిపారు.

ప్రతిపక్షాల తరఫున యశ్వంత్ సిన్హాను నిలబెట్టినప్పటికీ చాలా పార్టీలు తమ అభ్యర్థికే మద్ధతివ్వనున్నాయని వెల్లడించారు. ఎన్డీయే అభ్యర్థికి ఇప్పటికే 55 శాతం ఎలక్టోరల్ కాలేజి మద్ధతు లభిస్తోందని, ఇది 75 శాతానికి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయనన్నారు. మరోవైపు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మద్ధతు కోరుతూ ద్రౌపది ముర్ము అన్ని రాష్ట్రాల్లో పర్యటించనున్నారని తెలిపారు. ఇప్పటికే ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సహా పలు పార్టీల నేతలకు ఫోన్ చేసి మద్ధతు కోరారని తెలిపారు. జులై 1 నుంచి ప్రచారం మొదలుపెడతారని, జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడతారని జీవీఎల్ నరసింహారావు అన్నారు.

రాష్ట్రపతి పదవిలో తెలుగువారు ఉంటే అందరికీ సంతోషమేనని, కానీ ఆదివాసీ మహిళను ఎంపిక చేయడం పట్ల అన్ని రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతోందని జీవీఎల్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలను రాజకీయం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ సమగ్రతను, ఐక్యతను ఎవరూ ప్రశ్నించలేరని హితవు పలికారు. తాము అనుకున్నట్టుగా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక జరగలేదని దేశాన్ని విడగొట్టాలని వ్యాఖ్యానించడం సరికాదని తీవ్రస్వరంతో హెచ్చరించారు. మరోవైపు మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం గురించి ప్రశ్నించగా, అక్కడి పరిణామాలు పూర్తిగా శివసేన అంతర్గత వ్యవహారమని, వాటితో తమకు సంబంధం లేదని తెలిపారు.

అభియోగాలు మోపితే న్యాయపోరాటం చేశారు.. రోడ్డెక్కి నానాయాగీ చేయలేదు
గుజరాత్ అల్లర్లలో నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీదే బాధ్యత అంటూ చేసిన ఆరోపణలు సహేతుకం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిందని జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ అంశంపై ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) క్లీన్ చిట్ ఇస్తూ సమర్పించిన నివేదికను ట్రయల్ కోర్ట్ మొదట ఆమోదించిందని, ఆపై హైకోర్టు కూడా సమర్థించిందని గుర్తుచేశారు. అయినా సరే రాజకీయ దురుద్దేశాలతో కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, కానీ చివరకు సుప్రీంకోర్టు సైతం క్లీన్ చిట్ ఇచ్చిందని ఆయన తెలిపారు.

తనపై ఎన్ని ఆరోపణలు చేసినా, ఏ అభియోగాలు మోపినా ప్రజాస్వామ్యయుతంగా మోదీ న్యాయపోరాటం చేసి బయటపడ్డారని, కానీ విచారణకు హాజరవ్వాలంటూ ఈడీ సమన్లు జారీ చేస్తేనే కాంగ్రెస్ నేతలు నానాయాగీ చేస్తున్నారని మండిపడ్డారు. తామెప్పుడూ విచారణను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కలేదని గుర్తుచేశారు. ఏదేమైనా 20 ఏళ్లుగా మోదీపై సాగిన కుట్రకు తెరపడిందని హర్షం వ్యక్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement