Tuesday, April 30, 2024

JAWAD CYCLONE: ఉత్తరాంధ్రకు తప్పిన ‘జవాద్’ ముప్పు.. ఆ జిల్లాలు అప్రమత్తం

జవాద్‌ తుపాను ముప్పు ఉత్తరాంధ్రకు తప్పింది. తీరం వైపు వేగంగా దూసుకొచ్చిన తుపాను.. అనంతరం దిశ మార్చుకుని శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ తీరానికి చేరనుంది. తుపాను బలహీనపడినా దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని చోట్ల గాలులు బలంగా వీస్తాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం ఉందని పేర్కొంది.

మరోవైపు తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఆదివారం సాయంత్రం వరకు వర్షాలు, గాలులు ఉంటాయని వివరించింది. ఉత్తరాంధ్రని వణికించిన జవాద్‌ తుఫాన్‌ దిశ మార్చుకుని, ఒడిసా వైపు వెళ్లిపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement