Friday, April 26, 2024

నేడు ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఈ ఉదయం 10.30 గంటలకు రోశయ్య భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి గాంధీభవన్‌కు తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దూతగా రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ఆదివారం గాంధీభవన్‌లో రోశయ్యకు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. గాంధీభవన్ నుంచి కొంపల్లిలోని ఫాంహౌజ్‌ వరకు అంతిమయాత్ర సాగనుంది. రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌ హాజరవుతారు.

కాగా, రోశయ్య మృతి పట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించాయి.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాజకీయాల్లో కురువృద్ధుడు అయిన రోశయ్య.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి, సీఎం పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో దాదాపు అందరు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల కేబినెట్‌లోనూ మంత్రిగా సేవలందించి.. రికార్డు సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేశారు. మొత్తం 15సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. వైఎస్ మరణం తర్వాత ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 14 నెలల అనంతరం తమిళనాడు గవర్నర్ గా పని చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement