Friday, May 3, 2024

ఖరీఫ్‌లో తగ్గిన వరి సేద్యం.. మద్దతు ధర లేక నష్టపోతున్న రైతులు

అమరావతి, ఆంధ్రప్రభ : ఖరీఫ్‌లో వ్యవసాయశాఖ నిర్దేశించిన లక్ష్యం కన్నా వరి సాగు విస్తీర్ణం తగ్గింది.. ఆ మేరకు దిగుబడి తగ్గింది.. దీంతో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం తగ్గించింది.. అన్నీ తగ్గితే ధర పెరగాలి.. ధర పెరగకపోగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా దక్కటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లకూ, ఇతర మధ్యవర్తులకు ప్రమేయం లేకుండా ప్రతి ధాన్యం గింజను ఆర్బీకేల పరిధిలో పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యం ఆచరణలో నీరుగారిపోతోంది. ధాన్యం సేకరణ కోసం ఆర్బీకేల పరిధిలో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించినా అవి ఆశించిన సంఖ్యలో అందుబాటులోకి రాలేదు. ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు కూడా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించటం లేదని రైతులు చెబుతున్నారు. గోతాల సమస్య, కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆచరణకు నోచుకోకపోవటంతో ధాన్యాన్ని మధ్యవర్తుల ద్వారా రైతులు వ్యాపారులకు అమ్మేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న వ్యాపారులు ధాన్యం బస్తాకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా కనిష్టంగా రూ 300 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.

అక్కడికక్కడే రైతులకు నగదును చెల్లిస్తూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించుకుపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం 75 కిలోల ధాన్యానికి రూ 1530 రావాల్సి ఉండగా బయట మార్కెట్లో వ్యాపారులు రూ.1200కు మించి చెల్లించటం లేదు. వరి కోతలు ప్రారంభమైన కొన్ని ప్రాంతాల్లో ధాన్యం దిగుబబడులు వస్తున్నాయి..కొన్ని చోట్ల వానలు, మరికొన్ని చోట్ల ముసురులు కమ్ముకోవటంతో ధాన్యాన్ని నిల్వ చేయటం సమస్యగా మారింది. నూర్పిడి చేసిన ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా ఇళ్ళకు చేర్చటం.. ఇంటికి చేరిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకూ, వర్షాలు వస్తే పరదా పట్టలతో కాపాడుకునేందుకు అనవసరమైన ఖర్చును భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో వచ్చిన కాడికి ధాన్యాన్ని అమ్మేందుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. వరి కోతలు ప్రారంభమైన అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించటంతో పాటు ముందుగా చెప్పినట్టు కల్లాల వద్దే కొనుగోలును ప్రారంభిస్తే ఊరట లభించి ఉండేదని రైతులు చెబుతున్నారు.

- Advertisement -

భారీగా తగ్గిన సేకరణ లక్ష్యం

గత ఏడాది ఖరీఫ్‌ తో పోలిస్తే ధాన్యం సేకరణ లక్ష్యాన్ని ప్రభుత్వాన్ని భారీగా తగ్గించింది. గత ఏడాది 40.31 లక్షల టన్నుల ధాన్యాన్ని ఆర్బీకేల పరిధిలో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించగా ఈ ఏడాది సేకరణ లక్ష్యాన్ని 34 లక్షల టన్నులకు తగ్గించారు. దీంతో గత ఏడాది ఖరీఫ్‌ తో పోలిస్తే 6.3 లక్షల టన్నుల సేకరణ తగ్గింది. ఖరీప్‌ సాగు విస్తీర్ణాన్ని 39 లక్షల ఎకరాలుగా ప్రకటించినా ఆ స్థాయిలో రైతులు సాగు చేయలేదు. 36 లక్షల ఎకరాల్లోనే వరి పండించినట్టు తాజా అంచనా. ఈ మేరకు దిగుబడి తగ్గే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కూడా ధాన్యం సేకరణ లక్ష్యాన్ని తగ్గించింది. ఈనెల 14 సోమవారం వరకు ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 1129 మంది రైతుల నుంచి 15.49 కోట్ల విలువైన 7,592 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టు కల్లాల వద్దే కొనుగోలు చేయటం, సరిపడా గోతాలు సమకూర్చటం, కూలీ, రవాణా ఖర్చులను కూడా భరించి ధాన్యాన్ని తరలించే ప్రక్రియ అన్ని ప్రాంతాల్లో నూటికి నూరుశాతం అమలైతే తమ కష్టాలు కొంత గట్టెక్కుతాయని రైతులు చెబుతున్నారు. ప్రత్యేకించి నూర్పిళ్ళు మొదలై ధాన్యం దిగుబడులు ముమ్మరమైన ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement