Friday, May 10, 2024

AP | ఉపాధి కల్పనలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల రికార్డు..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై దృష్టి సారించింది. పరిశ్రమలు స్థాపించే ప్రాంతంలో స్థానికంగా ఉండే వారికే ఆయా పరిశ్రమల్లో అధిక శాతం మందికి ఉపాధి కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో స్థానికంగా వుండే వారికి ఉపాధి అవకాశాలు మెండుగా వుండడంతో ఆయా ప్రాంతాల ప్రజల జీవన శైలి మరింత మెరుగుపడింది. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పనలో రాష్ట్రంలోని సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) రికార్డు సృష్టిస్తున్నాయి.

2023-24లో ఎంఎస్‌ఎంఈల ద్వారా కనీసం 7.50 లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్దేశించుకోగా కేవలం ఐదు నెలల్లోనే లక్ష్యానికి చేరువ కావడం విశేషం. ఈ ఏడాది రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఎంఎస్‌ఎంఈల ద్వారా 7,01,975 మంది స్థానికులు కొత్తగా ఉపాధి పొందినట్లు కేంద్ర ఎంఎస్‌ఎంఈ పోర్టల్‌ ‘ఉద్యం’ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆగస్టు నాటికే 93 శాతం లక్ష్యాన్ని సాధించడంతో గతేడాది తరహాలోనే రెండురెట్లు అధికంగా ఉపాధి కల్పించే అవకాశాలున్నట్లు- ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేర్కొంది.

- Advertisement -

2022-23లో ఎంఎస్‌ఎంఈల ద్వారా 1,56,252 మందికి ఉపాధి కల్పించాలని నిర్దేశించుకోగా ఏకంగా 231 శాతం అదనంగా 3,61,172 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఇదిలా వుండగా ఎంఎస్‌ఎంఈ రంగంలో ఉపాధి కల్పనకు పరిశ్రమల శాఖ జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించగా తొమ్మిది జిల్లాలు ఇప్పటికే లక్ష్యాన్ని దాటేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిత్తూరు, ఏలూరు, శ్రీసత్యసాయి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, కర్నూలు, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలు ఐదు నెలల్లోనే 100 శాతం లక్ష్యాన్ని అధిగమించాయి.

చిత్తూరు జిల్లా లక్ష్యం కంటే ఇప్పటికే 317 శాతం, ఏలూరు 187 శాతం, శ్రీసత్యసాయి 151 శాతం సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది ‘ఉద్యం’ పోర్టల్‌లో కనీసం 1.50 లక్షల ఎంఎస్‌ఎంఈలను నమోదు చేయాలని నిర్దేశించుకోగా ఐదు నెలల్లోనే 97,378 యూనిట్లు కొత్తగా ఏర్పాటైనట్లు అధికారులు వెల్లడించారు. ఐదు జిల్లాలు 80 శాతానికిపైగా లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకున్నాయి. కొత్త యూనిట్ల ఏర్పాటు లక్ష్యంలో ఏలూరు 91 శాతం, పశ్చిమ గోదావరి 84 శాతం, ప్రకాశం 81 శాతం, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు 80 శాతం, కర్నూలు 80 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement